సద్గురుశ్రీ అంతర్ముఖానందుల వారి పూర్వ నామధేయము శ్రీ వండాన వేంకటేశ్వరరావు. వీరు శ్రీకాకుళం జిల్లా బురిడికంచరాం గ్రామంలో 1951 సెప్టెంబరు 13 తేదీన (భాద్రపద మాసం శ్రవణం నక్షత్రం) దాలినాయుడు, లక్షీనరసమ్మ దంపతుల పుణ్యఫలముగా జన్మించారు. ప్రతిరోజు 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ‘లోలుగ’ అనే గ్రామంలో ప్రాధమిక విద్యను అభ్యసించారు. బాల్యం నుండియే వారు ప్రతిభావంతులు. SSLC పాసయ్యాక ఉపాధ్యాయుల ప్రోద్బలంతో తల్లిదండ్రులు వారిని PUC చదివేందుకు విజయవాడలోని లయోలా కళాశాలలో చేర్పించారు. అనంతరం విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాల నుండి MBBS నందు చేరి ఆఖరి సంవత్సరంలో సర్జరీ విభాగంలో రెండు స్వర్ణపతకాలు సాధించి, కోర్సు పూర్తిచేసిరి. అనంతరం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అన్ని అర్హతలు ఉన్ననూ, (మెరిట్ ప్రకారం MS General Surgery, MS Orthopedic సీట్లు వచ్చినను అందులో చేరలేదు.) బాహ్య విద్యలపై అనాసక్తత వలన ఏజెన్సీ ప్రాంతంలోని సీలేరులో ప్రయివేటు వైద్యునిగా వృత్తిని ప్రారంభించి రెండు సంవత్సరాలపాటు అక్కడ పేద గిరిజనులకు వైద్య సేవలందించారు. తరువాత విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్యాధికారిగా ఉద్యోగం పొందారు. తండ్రిగారి ఆజ్ఞానుసారం పార్వతీదేవి గారిని వివాహమాడగా ఒక కుమార్తె, ఒక కుమారుడు కలిగారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుండగా ఒక స్నేహితుని ద్వారా శ్రీ స్వామి రామానంద పరమహంసలవారిని గురించి తెలుసుకొని 1978 లో మొదటిసారిగా వారి దర్శనార్థం కామన్నవలసలోని ఆశ్రమానికి వచ్చారు. స్వామీజీని దర్శించుకొని, వారి బోధనలు విన్నాక వారికి స్వామీజీ పై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగాయి.
స్వామీజీపై ఉన్న భక్తికి ఫలంగా వారికి బదిలీ అయ్యి, ఆశ్రమానికి అత్యంత సమీపంలో ఉన్న బాడంగి PHC లో 15 సంవత్సరాలు పనిచేసే అవకాశం లభించింది. స్వామీజీ దర్శనార్థం గురూజీ తరచుగా ఆశ్రమానికి వెళుతూ ఉండేవారు.
స్వామీజీ సమక్షంలో ఉన్నంతసేపు, వారి వాక్కులను శ్రద్ధగా ఆలకిస్తూ, మిగిలిన సమయాలలో వారుపదేశించిన యోగవిద్యను తీవ్రంగా సాధన చేస్తూ, వారు బోధించిన వేదాంత రహస్యాలను విచారణ చేస్తూ, కొలది రోజులలోనే వారికి అత్యంత ప్రియశిష్యులయ్యారు.


వారిరువురి మధ్య గురుశిష్య బంధం తీవ్రతరమై, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతదై, చివరికి నిత్యం స్వామీజీ సేవలో ఆనందించే లక్ష్యంతో గురూజీ, వారి ధర్మపత్ని పార్వతమ్మ, కుమార్తె ఝాన్సీ, కుమారుడు శివరామకృష్ణలతో సహా ఆశ్రమానికి వచ్చి స్థిరపడ్డారు. ఇక ఆ పుణ్యదంపతుల దైనందిన జీవితం స్వామీజీ సేవతోనే ముడిపడి ఉండేది. భక్తిశ్రద్ధలతో స్వామీజీ సేవలో అనునిత్యం తరిస్తూ స్వామీజీ ప్రేమను, అనుగ్రహాన్ని సంపూర్ణంగా సాఫల్యం చేసుకొన్నారు.
స్వామీజీ అనుగ్రహంతో అత్యంత బాధ్యతాయుతమైన వైద్యవృత్తిలో విధులను గురూజీ మిక్కిలి సమర్థవంతంగా నిర్వర్తించి, ఎందరినో రోగాలనుండి విముక్తులను చేసి, ఉత్తమ వైద్యాధికారిగా ఐదుసార్లు ప్రభుత్వ పురస్కారాలను పొందారు. తరువాతి కాలంలో జిల్లా వైద్యఆరోగ్య అధికారిగా, రీజనల్ డైరెక్టర్ (విశాఖపట్నం) గా పదోన్నతులు కూడ పొంది పదవీ విరమణ నాటి నుండి పూర్తి సమయం ఆశ్రమంలోనే గడుపుతున్నారు.
మహాత్ముల చెంత ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. అనుక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. లౌకిక జ్ఞానానికి భిన్నంగాను, విరుద్ధంగాను కనిపించే బ్రహ్మవేత్తల ప్రవర్తనను అర్థం చేసుకోవడం సులభం కాదు.
శిష్యులు అనేకమంది ఉన్నప్పటికీ గురువర్యుల భావాన్ని లోతుగా అర్థం చేసుకొని తదనుగుణంగా ప్రవర్తించగలిగే వారు చాలా అరుదు. ఆ కోవకు చెందినవారే శ్రీ గురూజీ. గురుశిష్య సంబంధంలో అత్యంత ప్రధానమైనది విశ్వాసం. గురువర్యుల పట్ల అత్యంత విశ్వాసంతోనే వారు స్వామీజీ గురుత్వాన్ని పూర్తిగా పొందగలిగారు. ప్రతి పరీక్షలోను విజయం సాధించేవారు. కఠినమైన పరీక్షా సమయాలలో సైతం సాధనను తీవ్రతరం చేసి విజయం సాధిస్తూ తోటి శిష్యులకు మార్గదర్శకులయ్యారు.
స్వామీజీ తరచుగా వీరిపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నట్లు సహ శిష్యులు భావించేవారు. అయితే, సద్గురు తత్త్వాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకొనన గురూజీ మాత్రమే అది ఆగ్రహం కాదని, స్వామీజీకి తనపట్ల ఉన్న వాత్సల్యమని ప్రతి సందర్భంలోను గుర్తించేవారు. గురూజీని ఎల్లప్పుడూ ‘డాక్టరూ’ అని సంబోధిస్తూ ఉండే స్వామీజీ గురూజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ‘మా డాక్టరు మా డాక్టరు’ అంటూ ఆర్ద్రంగా చెప్పే మాటలలో మాత్రం వారి ప్రేమ అనివార్యంగా ప్రకటితమయ్యేది. ‘నేను డాక్టరూ ఒక్కటే’ అంటూ పలుసార్లు స్వామీజీ పలికిన మాటలు వారిరువురి మధ్య అభేదాన్ని వెల్లడించేవి.
గురూజీ సంకల్పం శిలాసదృశం. ఏ కార్యం మొదలుపెట్టినా అకుంఠిత దీక్షతో, నిర్విరామ కృషితో దానిని సాధించడం వారి నైజం. స్వామీజీ సేవలోను, తమ పారమార్థిక లక్ష్యంలోను కూడ వారిది ఇదే పంథా. గురునామ స్మరణము చేతనే వారు అశ్రునయనులు కావడం ఇప్పటికీ అందరికీ అనుభవమే. గురువే నిత్యుడు, శాశ్వతుడు, మనమే అనిత్యులమనే నిజగురు తత్త్వాన్ని ఆవిష్కరించిన శ్రీ గురూజీ చదువు, విజ్ఞానం, సంస్కారం గురుసేవకు ఉపయోగించబడినప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందంటారు. గురుసేవ విషయంలో తృప్తి చెందకూడదని, శిష్యులు గురువు యొక్క విరాట్ స్వరూపమని, అద్వైతం వాచావేదాంతము కాదని, యోగ జ్ఞానముల చే ఆచరణ ద్వారా సాధించవలసినదని సశాస్త్రీయముగా బోధించారు.
వైద్యులుగా పదవీ విరమణ పొందినప్పటికీ, భవరోగాల బారిన పడినవారికి తత్త్వబోధనల ద్వారా స్వస్థత కల్పిస్తూనేయున్నారు. వ్యవసాయ కుటుంబములో జన్మించిన గురూజీ శిష్యుల మనో క్షేత్రాలను అనుగ్రహ భాషణల ద్వారా సారవంతము చేసి, అనిత్య విషయ వాంఛలనెడి కలుపుమొక్కలను తొలగించి, జ్ఞాన బీజములను నాటి, తత్త్వ ఫలాలను పండిస్తూ, ఆధ్యాత్మిక సేద్యం చేస్తూనే యున్నారు.

తమ గురుదేవులు శ్రీ స్వామి రామానంద పరమహంసవారిచే ‘త్వమేవ అహమ్’ అని ప్రకటింపబడి, ఆశ్రమ పీఠాధిపతిగా, బ్రహ్మవిద్యా సాంప్రదాయ సద్గురువుగా, సకల జీవుల శ్రేయో ప్రదాతగా ఆశ్రమ బాధ్యతలను, శిష్యుల అభ్యున్నతిని గురుతర బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు గురూజీ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వంతో తల్లిని ఎలా గౌరవించాలో పాదాభివందనము ద్వారా శిష్యులకు మార్గదర్శకము చేసే తనయుడిగా, తండ్రిగా, భర్తగా, సదా గురుస్మరణము ద్వారా శిష్యుల కర్తవ్యం బోధించే గురువుగా, శిష్యుల యోగక్షేమాల విషయంలో అంతా తానై నిర్వర్తిస్తూ శిష్యుల చిత్తాపహారకులయ్యారు.

Awards
Here is a comprehensive list of Guruji’s awards:
- 2004 Government of AP Best Service Certification of Appreciation Award
- 2005 Government of AP Best District Award
- Y Kishore Chandra Dev Member of Parliament Award
- 2007 Asajyothi Award
- District Health and Medical Officer
- Rajiv Excellence Award
- Best Doctor Award- Minister Pathiwada Narayana Swami Naidu
- Best Doctor Award- 1981
- Best Doctor Award – Rotary Club – 2007
- Best Doctor Award – Collector – 1991, 1993, 2006
- Best Doctor Award – Government of AP – 1995
- 1997 – Commendation – AP Government

