ఆశ్రమం మరియు దాని స్థాపన

దేశంలోగ‌ల‌ అనేక ఆధ్యాత్మిక కేంద్రాల‌లో శ్రీ స్వామి రామానంద సిద్ధ‌యోగ జ్ఞానాశ్ర‌మం ప్ర‌త్యేక స్థాన‌మును పొందియున్న‌ది. సిద్ధయోగ సాధ‌న‌ను, బ్ర‌హ్మ‌జ్ఞాన‌మును తెలియ‌జేయు కేంద్రమిది. శ్రీ‌మ‌ద్భ‌గ‌వ‌ద్గీత‌లో జ్ఞానినః త‌త్త్వ‌ద‌ర్శినః అని చెప్పిన‌ట్లు మోక్ష‌ము కొరువారు శాస్త్ర‌జ్ఞాన‌మును, అనుభ‌వ జ్ఞాన‌మును గ‌ల గురువుల వ‌ద్ద‌కు పోయి బ్ర‌హ్మ‌విద్య‌ను నేర్చుకొన‌వ‌ల‌యున‌ని శ్రీ‌కృష్ణ‌ప‌ర‌మాత్మ సూచించినటువంటి కేంద్ర‌మిది. ఇటువంటి అరుదైన ఆశ్ర‌మ‌మును సిద్ధ‌గురువులు బ్ర‌హ్మ‌ర్షి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వామి రామానంద ప‌ర‌మ‌హంస‌ల వారు 1965 సంవ‌త్స‌ర‌ములో విజ‌య‌న‌గ‌రం జిల్లా బాడంగి మండ‌లం కామ‌న్న‌వ‌ల‌స‌లో స్థాపించియున్నారు. వీరు కేర‌ళ రాష్ట్రంలోని క‌న్నూరు జిల్లా క‌ళ్ళియాసేరి అను గ్రామం నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చి, స‌ర్వేయ‌ర్‌గా ఉద్యోగం చేయుచున్న‌ప్పుడు తెలుగుభాషలో ప్ర‌వేశంతో .. వారి గురుదేవులు, కేర‌ళ‌లోని వ‌డ‌గ‌రకు చెందిన‌ సిద్ధ‌గురువులైన‌ బ్ర‌హ్మ‌ర్షి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వామి శివానంద ప‌ర‌మ‌హంస‌ల వారు ర‌చించిన సిద్ధ‌వేద‌ము అను గ్రంథ‌మును చ‌దివి, వారివ‌ద్ద‌నే సిద్ధ‌యోగ విద్య‌ను ఉప‌దేశ‌ము పొంది, తీవ్ర‌సాధ‌న చేయుచు, సంపూర్ణ వైరాగ్య‌ముతో త‌న ఉద్యోగ‌మున‌కు రాజీనామా చేసి, హృషీకేశ్‌లో అనేక చోట్ల అంత‌ర్ముఖ ప్రాణాయామ రూప త‌పస్సును ఆచ‌రించుచూ, చివ‌ర‌కు గోదావ‌రి న‌ది ఒడ్డున ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్దగ‌ల యోగి జ‌నార్ద‌న స్వామి ఆల‌యం ప‌క్క‌న ఒక కొండ‌గుహ‌లో చిర‌కాలం దేహ‌స్పృహ లేకుండా త‌పస్సు చేసి సిద్ధిపొందియున్నారు. ఆ గుహ‌లో నాగుపాముతో స‌హ‌వాస‌ము చేయుచూ, చిర‌కాల‌ము త‌పస్సు చేసిన రామానందుల వారిని పాముల స్వామి అనియు, మౌన‌స్వామి అనియు పిలిచెడివారు. సిద్ధిపొందిన త‌రువాత ఈశ్వ‌రుని ప్రేర‌ణ‌తో ఈ బ్ర‌హ్మ‌విద్య‌ను బ‌హుళ ప్ర‌చార‌ము చేయుట‌కు కామ‌న్న‌వ‌ల‌స ముఖ్య కేంద్ర‌ముగా స్థిర‌ప‌ర‌చుకొంటిరి. అంత‌కుపూర్వ‌ము విజ‌య‌వాడ‌లోని భ‌వానిపురం లోను, కొత్త‌గూడెంలోను ఆశ్ర‌మ‌ములు స్థాపించి, శాస్త్ర జ్ఞాన‌మును (భ‌గ‌వ‌ద్గీత, ఉప‌నిష‌త్తులు, బ్ర‌హ్మ‌సూత్ర‌ములు) త‌మ యోగానుభ‌వ‌ముతో జోడించి, చెప్పుట‌కు స‌రైన శిష్యుల కొర‌కు వెత‌కుచుండ‌గా దైవాజ్ఞ ప్ర‌కారం ప్ర‌స్తుత పీఠాధిప‌తి శ్రీ స్వామి అంత‌ర్ముఖానంద (డాక్ట‌ర్ వండాన వేంక‌టేశ్వ‌ర రావు ఎం.బి.బి.ఎస్‌) ప‌రిచ‌యం కాగా .. ఆత‌నిని ముఖ్య‌శిష్యునిగా తీర్చిదిద్ద‌డ‌మైన‌ది. ఆజ‌న్మ బ్ర‌హ్మ‌చారి, స‌న్న్యాసిగా సిద్ధిపొందిన శ్రీ స్వామి రామానంద ప‌ర‌మ‌హంసల వారు .. డాక్ట‌ర్ వేంక‌టేశ్వ‌ర‌రావు గృహ‌స్తుడైన‌ను ఆత‌ని భ‌క్తిశ్ర‌ద్ధ‌లు, యోగ‌సాధ‌న‌ల వ‌ల‌న అనుగ్ర‌హించిరి. 14 సంవ‌త్స‌ర‌ముల వీరి గురుశిష్య సంబంధం అనిత‌ర సాధ్య‌మైన‌ది. ద‌గ్గ‌ర‌లో ఉన్న సాలూరు, పిమ్మ‌ట బాడంగిలోను వైద్యాధికారిగా ఉద్యోగ‌ము చేయుచున్న డాక్ట‌ర్ వేంక‌టేశ్వ‌ర రావును ఆశ్రమ ఉత్తరాధికారి గా నియ‌మించి, 91 సంవత్స‌రముల వ‌య‌స్సులో 1993 మార్చి 9వ తేదీన మ‌హాస‌మాధి చెందిరి. సంస్కృత భాషా ప‌రిచ‌య‌ము లేని డాక్ట‌ర్ వేంక‌టేశ్వ‌ర రావును, అత‌ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌కు మెచ్చి, త‌న త‌ప‌శ్శ‌క్తితో స‌క‌ల శాస్త్ర సారాన్ని అన‌గా భ‌గ‌వ‌ద్గీత, ఉప‌నిష‌త్తులు, బ్ర‌హ్మ‌సూత్ర‌ములు, యోగ‌వాశిష్ఠ‌ము, భార‌త, భాగ‌వ‌త, రామాయ‌ణాల‌ను అంద‌లి ల‌క్ష్యార్థ‌ములన్నియు యోగ జ్ఞాన‌ముల సార‌మే అని, స‌నాత‌న ధ‌ర్మమ‌న‌గా యోగ‌సాధ‌న ద్వారా శ‌రీర శుద్ధి, త‌ద్వారా మ‌న‌శ్శుద్ధి చేసుకొని, తానెవ‌రో య‌ను అప‌రోక్షానుభూతిని పొందేవిధంగా రాత్రింబ‌వ‌ళ్ళు బోధ చేశారు. గురుసేవ ఏ విధంగా చేయాలి? గురుభ‌క్తిని ఎలా పెంపొందించుకోవాలి అనేవి తెలియ‌జేసి, గురుఅనుగ్ర‌హ‌ము ద్వారా అన‌తి కాల‌ములోనే సిద్ధ‌విద్య‌లో సంపూర్ణ నిష్ణాతునిగా డాక్ట‌ర్ ని తీర్చిదిద్దారు. సైంటిస్టుల‌ను గాని, వైద్యుల‌ను గాని, శాస్త్ర పండితుల‌ను గాని, సంభ్ర‌మాశ్చ‌ర్య‌ములకు గుర‌య్యే విధంగా సంపూర్ణ జ్ఞానిగా తీర్చిదిద్దారు. గురు అనుగ్ర‌హ‌ము యొక్క ప్ర‌తిఫ‌ల‌ము ఎంత‌లోతుగా ఉంటుందో డాక్ట‌ర్ ద్వారా ప్ర‌పంచ‌మున‌కు తెలియ‌జేశారు. త్వ‌మేవాహం అహ‌మే వ‌త్వం అని వారు ప‌దేప‌దే బ‌హిర్గ‌త‌ముగా వ‌క్కాణిస్తూ ఆద‌ర్శ గుర‌శిష్య సంబంధాన్ని లోకానికి తెలియ‌జేశారు. “నా త‌ద‌నంత‌రం ఈ బ్ర‌హ్మ‌విద్య‌ను కొన‌సాగించ‌గ‌ల స‌మ‌ర్థుడు నా డాక్ట‌రే” అని నిర్ధారించుకొని, 1993 మార్చి 9వ తేదీన మ‌హాస‌మాధి చెందియున్నారు. భావికాలంలో ఇసుక వేస్తే రాల‌ని విధంగా భ‌క్తులు, యోగులు, కామ‌న్న‌వ‌ల‌స‌లో గుమిగూడెద‌రని, కామ‌న్న‌వ‌ల‌స ఒక క‌లియుగ బృందావ‌నం కాగ‌ల‌ద‌ని అనుగ్ర‌హించియున్నారు.

శ్రీ‌స్వామి రామానందుల వారు త‌మ శిష్యుల‌గు శ్రీ అంత‌ర్ముఖానందుల వారికి 14 సంవ‌త్స‌రముల కాలంలో బోధించిన సారం.

అన్ని రోగాల‌కు (శారీర‌క‌, మాన‌సిక‌) మ‌న‌లోగ‌ల మాన‌సిక శ‌క్తి (ఆధ్యాత్మిక శ‌క్తి) లోప‌మే మూల కార‌ణం (Deficiency of mental energy is the root cause for all both mental and physical diseases) ప్ర‌తీ జీవియందు ఉచ్ఛ్వాస‌ము త‌క్కువ‌గాను (20 సెంటీమీట‌ర్లు), నిశ్వాస‌ము (30 సెంటీమీట‌ర్లు) జ‌రుగుచున్న‌ద‌నున‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ప్ర‌తీ శ్వాస‌యందు ఉచ్ఛ్వాస‌ము కంటే నిశ్వాస‌ము 10 సెంటీమీట‌ర్లు ఎక్కువ‌గా పోవుచున్న‌ది. అందులో దైవ‌శ‌క్తి, జ్ఞాన‌ము, ఆనంద‌ము, ప్ర‌కాశ‌ము కోల్పోవుచున్నాము. ఈ విధంగా ఒక నిమిషంలో 15 శ్వాస‌లలో 10 సెంటీమీట‌ర్లు అన‌గా 1.50 మీట‌ర్లు .. ఒక గంట‌లో 15 * 60 = 900 * 10 సెంటీమీట‌ర్లు = 90 మీట‌ర్లు .. ఒక రోజులో 15 * 60 * 24 = 21600 * 10 సెంటీమీట‌ర్లు అన‌గా 2 కిలోమీట‌ర్ల 160 మీట‌ర్ల శ‌క్తిని ప్ర‌తీదిన‌ము పుట్టిన‌ది మొద‌లు కోల్పోవుచున్నాము. భౌతిక‌మైన ఆహార‌ము తీసుకొనుచున్న‌ప్ప‌టికీ .. అది దివ్య‌శ‌క్తి, జ్ఞాన‌ము, ఆనంద‌ముల‌ను పూడ్చ‌లేక‌పోవుచున్న‌ది. అగ్ని స్వ‌రూప‌మ‌గు ప్రాణ‌ము ప్ర‌తీశ్వాస‌యందు ఖ‌ర్చ‌గుచుండుట‌చే శ‌రీర‌ములోని ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మంద‌గించి, శ‌రీర‌ము చ‌ల్ల‌బ‌డి, క‌ఫ‌ము త‌యార‌గుచున్న‌ది. అగ్ని త‌గ్గిపోవుచుండుట‌చే జీర్ణ‌శ‌క్తి మంద‌గించి, క‌ఫ‌ము త‌యార‌గుచున్న‌ది. ఈ క‌ఫ‌మే శ‌రీర‌ములో పేరుకుపోయి, శారీర‌క, మాన‌సిక రోగ‌ముల‌కు కార‌ణ‌మ‌గుచున్న‌ది. క‌ఫ‌ము ఎక్కువ‌గుచున్న కొల‌దీ ప్రాణ‌ము పైకి వెళ్ళ‌లేక‌, నిశ్వాస‌ము అధిక‌మై, తుద‌కు మ‌ర‌ణ‌ము ఆస‌న్న‌మ‌గుచున్న‌ది. అందుచే క‌ఫ‌మే య‌ముడు. క‌ఫ‌మే పాప‌మ‌ని చెప్ప‌బ‌డిన‌ది. మ‌న శ్వాస‌ను ప‌ట్టుకొని లోలోప‌లనే మ‌ధ‌న‌ము చేసిన‌చో యోగాగ్ని వృద్ధియై, స‌ర్వ నాడులు శుద్ధియై, శ‌రీర‌ము, మ‌న‌స్సు, రెండును ఒకేసారి నిర్మ‌ల‌మై సంపూర్ణ ఆరోగ్య‌ము, అత్యంత మాన‌సిక శ‌క్తి, త‌ద్వారా జ్ఞాన‌ము క‌లుగుచున్న‌వి. ఈ యోగానుభ‌వ‌మే “నాసాభ్యంత‌ర చారిణౌ” అని శ్రీ‌మ‌ద్భ‌గ‌వ‌ద్గీత‌ 2వ అధ్యాయం లోను, మాండూక్య‌, ముండ‌క‌, శ్వేతాశ్వ‌రోప‌నిష‌త్తుల‌లోను చెప్ప‌బ‌డియున్న‌ది. ఇదే యోగసారం బైబిల్, ఖురాన్‌ల‌లో కూడా ప్ర‌ధాన సాధ‌న‌గా చెప్ప‌బ‌డిన‌ది. ఈ యోగసాధ‌న .. చేయుట‌కు అత్యంత సుల‌భ‌మైన‌ది, సుఖ‌త‌ర‌మైన‌ది, ఇదియే యుగ‌యుగ‌ముల నుండి వ‌చ్చుచున్న ఋషిప్రోక్త‌మైన‌ది. సైన్స్ ప‌రంగాను, వైద్య పరంగాను నిరూపిత‌మైన‌ది. ఈ అంత‌ర్ముఖ యోగ‌సాధ‌న ఉప‌దేశం పొందిన మొద‌టి రోజు నుండియే ఫ‌లిత‌మిచ్చున‌ది. అనేక దీర్ఘ‌కాలిక రోగ‌ములు అన‌తి కాల‌ములోనే ఉప‌శ‌మించుచున్న‌వి. ఇది స‌ర్వ రోగ నివారిణి, స‌ర్వ‌రోగ వినాశిని. ఆచ‌ర‌ణ‌కు సుల‌భ‌మైన‌ది, వెంట‌నే ప‌లిత‌మిచ్చున‌ది య‌గుట‌చే ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా విస్తారంగా ప్ర‌చారం గావింప‌బ‌డిన‌ది. ప్ర‌స్తుత పీఠాధిప‌తి శ్రీ అంత‌ర్ముఖానంద స్వామి అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల‌లో ప‌ర్య‌టించి, వేలాది మందికి అంత‌ర్ముఖ యోగ‌విద్య‌ను ఉప‌దేశించుట‌యే దీనికి నిద‌ర్శ‌నం. స‌ద్గురు శ్రీ స్వామి రామానందుల వారి వ‌ద్ద ఉప‌దేశ‌మునొంది నేటికి 47 సంవ‌త్స‌రముల అనుభ‌వంతో శ‌రీర‌ములోని సుషుమ్నా మ‌రియు మెద‌డు భాగ‌ములో ఏయే మార్పులు సంభ‌వించుచున్న‌వో స‌నాత‌న ధ‌ర్మ‌మున‌కు మూల స్తంభ‌ముల‌గు ప్ర‌స్థాన‌త్ర‌య గ్రంథ‌ముల‌ను ఉటంకించుచూ అన్ని త‌ర‌గ‌తుల వారికి సందేహ నివృత్తి క‌లుగ‌జేయు విధంగా అంత‌ర్ముఖానంద ఛానెల్‌లో విశ‌ద‌ప‌ర‌చ‌బ‌డియున్న‌ది. 1900 పైచిలుకు వీడియోల‌లో పొందుప‌ర‌చ‌బ‌డియున్న‌ది. ఈ విద్య‌ను 10 సంవ‌త్స‌ర‌ములు పైబ‌డిన‌వారెవ‌రైనా ఉప‌దేశ‌ము పొంద‌వ‌చ్చును. జాతి, కుల‌, మ‌త‌, ప్రాంతీయ భేద‌ము లేకుండా ఈ విద్య‌కు అంద‌రు అర్హులు. అయితే ..ధూమ‌పానం, మ‌ద్య‌పానం, మాంసాహార‌ముల‌ను త్య‌జించిన వారై ఉండ‌వ‌ల‌యును. ప్ర‌స్తుతం కామ‌న్న‌వ‌ల‌స‌, ఆశ్ర‌మంలో ఈ విద్యను ఉప‌దేశం పొందవ‌చ్చును.

1) శ్రీ స్వామి రామానంద సిద్ధ‌యోగ జ్ఞానాశ్ర‌మం

      కామ‌న్న‌వ‌ల‌స - 535578,

      బాడంగి మండ‌లం, విజ‌య‌న‌గ‌రం జిల్లా.

2) భ‌వానిపురం, విజ‌య‌వాడ‌

3) సుగ‌ర్లాండ్ – హోస్ట‌న్ – టెక్సాస్‌, అమెరికా