“జగజ్జ్యోతి శ్రీ స్వామి శివానంద పరమహంస సిద్ధవిద్యా అభ్యాసాలయం”
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల మండలంలో ఒక చిన్న పల్లెటూరు. కేవలం కొద్ది వందల సంఖ్యలో ప్రజలు. అంటే పంచాయితీ కూడా కాదు. కుగ్రామం అంటే తక్కువని కాదు. ఎన్నో లక్షలలో ఉన్నాయి. మరి దీనిని గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏముంది? ఉంది. చాలానే ఉంది. అక్కడి ప్రజలలో అత్యధికులు సిద్ధ విద్యార్థులే. యోగసాధన తీవ్రంగా చేస్తున్నారు.
నిజానికి వీళ్ళెవరూ బడా భూస్వాములు కారు. పెద్దగా చదువుకున్నవారు కాదు. రాజకీయాల్లో వీళ్ళ పాత్ర శూన్యం. రెక్కల కష్టం మీద బ్రతుకులీడ్చవలసిన వారే. అయితే వారి జీవితాలు ఒక్కసారిగా మార్పు చెందాయి.
బ్రహ్మర్షి గురుపరంపరలో శ్రేష్ఠులైన శ్రీగురూజీ వారి నుండి సిద్ధవిద్యోపదేశాన్ని పొందారు. క్రమం తప్పకుండా నిత్య సాధన మొదలుపెట్టారు. ధూమపానం, మద్యమాంసాలను శాశ్వతంగా విడిచిపెట్టారు.
వీరి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే ఈమధ్య కాలంలో ఆ కుగ్రామంలో ఒక వింత జరిగింది. తమకున్న స్వల్ప ఆదాయం లోనే ప్రతివారు ఎంతోకొంత సమర్పించి, కొంత ధనాన్ని పోగుచేశారు. వారి సామూహిక సాధనకు వీలుగా ఉండేలా ఒక పెద్ద ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నారు. సుమారు రెండు ఎకరాల భూమిని సమకూర్చారు. వారి దినభత్యాలనుండి పోగుచేసి, మందిరం కింద వెచ్చించినది ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అక్షరాలా పాతిక లక్షల పైమాటే. వీరిలో ఎంతో మంది తలా ఏభై, అరవై వేల రూపాయల చొప్పున సమర్పణగా ఇచ్చారు. కొందరు వారికున్న కొద్ది భూమిని అర్పించారు. ఒక భవ్యమైన దివ్య మందిరాన్ని సృష్టించారు.
ఇది ఎవరికీ చెందినది కాదు. అందరిదీ. తమ ప్రియతమ గురుదేవులైన “శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ” పీఠాధిపతులు పరమపూజ్య శ్రీ గురూజీ వారి పవిత్ర హస్తాలతో, శ్రీ స్వామి శివానంద పరమహంస వారి జన్మ దినోత్సవం సందర్భంగా ఆ భవ్యమందిరాన్ని ప్రారంభింపజేశారు. తాము తరించి, ఇతరులను కూడా తరించేలా చేశారు.
భుశుండావతారులు శ్రీ స్వామి శివానంద పరమహంసల వారితో పాటు, వారి నిరంతర శిష్యాగ్రణులైన వశిష్ఠావతారులు శ్రీ స్వామి రామానంద పరమహంసల వారి, కపిలావతారులు శ్రీ స్వామి నిత్యానంద పరమహంస వారి నిలువెత్తు చిత్రపటాలను వేల ధనాన్ని వెచ్చించి, ఆవిష్కరింపజేసిన విధానం అపూర్వం. ఈ సంవత్సరం అందరికీ తెలిసిందే.
కర్కశ కరోనా విషరక్కసి చైనా నుండి వచ్చింది. విలయతాండవం చేస్తోంది. కరువు,కాటకాలను సృష్టించింది. ఈ గ్రామ ప్రజలవంటి అనేకమంది దినసరి వేతన కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది.
కానీ ఈ గ్రామ ప్రజలు తల్లడిల్లలేదు. ప్రభుత్వాలపై నిష్కారణ ఆరోపణలు చేయలేదు.
చీమలదండులా తమకున్న దానిలో సర్దుకున్నారు. పైగా తమ కష్టార్జితంలో సోదరశిష్యులందరకూ ఎంతో కొంత చేయాలనుకున్నారు. అది వారి ప్రియగురుదేవుల చేతులమీదుగా, సిద్ధయోగ పరమపిత శ్రీ స్వామి శివానంద పరమహంస వారి జన్మ దినోత్సవం సందర్భంగా జరగాలనుకున్నారు. సోదరశిష్యులందరూ రావాలనుకున్నారు.
అందరికీ అన్నశాంతి జరగాలనుకున్నారు. ఒకపక్క మూడు తుఫానులు భయపెడుతుంటే, ఎప్పటిలాగే శ్రీ గురూజీ దానిని అదుపులో పెడతారు, పరవాలేదు అన్న దృఢవిశ్వాసంతో, అంతకుమించి ఆ అనుగ్రహానికి పాత్రులు కావాలనే దృఢతర సంకల్పంతో వీరు చేసినదేమిటో తెలుసా. మండలం రోజుల పాటు ఐదేసి వత్తులతో ప్రతి వ్యక్తి నేతిదీపాలను వెలిగించారు. అందరూ కలిసి సామూహిక యోగసాధన చేశారు.
దివ్య మందిరప్రవేశం శ్రీ గురూజీవారి పాదస్పర్శతోనే మొదలవ్వాలని, వారెవరూ లోనికి ప్రవేశించకుండా ముందు రోజులన్నీ మందిరం బయట చుట్టూ చేరి, సామూహికంగా యోగం చేశారు.
దారి పొడుగునా ప్రతి మలుపులోను మార్గదర్శక చిత్రపటాలను ఉంచారు. సిద్ధసమాజ సంప్రదాయబద్ధంగా శ్వేత వస్త్రాలను ధరించి, శ్రీ గురుదేవులతో పాటు తోటి సోదరులకు సాదర ఆహ్వానాన్ని అందించిన విధానం చిరస్మరణీయం.
ఇంతవరకు ఏనాడూ, ఎంతటి పరిస్థితులలోనూ ఉత్సవాల సందర్భంలో ఆశ్రమాన్ని వీడి, బయటకు అడుగుపెట్టని శ్రీ గురూజీని కరిగించి, కదిలించి, ఆ గ్రామంలో శ్రీ స్వామి శివానంద పరమహంస వారి జన్మ దినోత్సవం సందర్భంగా ధూపదీపనైవేద్యాలతో మరల పూజ జరిపించారు. నిరంతర యోగసాధనకు అవాంతరాలు, అసాధ్యాలు లేవని నిరూపించారు.
శ్రీ గురుదేవులతో పాటు తోటి సోదరశిష్యులకు వారు చేసిన భక్తి పూర్వక స్వాగత సత్కారాలు అనిర్వచనీయం. విందుభోజనాన్ని ఏర్పాటు చేసింది కాక, ప్రతి సోదరునికీ చేతులు కడిగిన విధానం, శిష్యకోటి స్వరూపంగా వారు గురుపూజ చేస్తున్నారని వెల్లడి చేసింది. ఆదర్శాన్ని చూపింది. మనసుల్ని కరిగించే పూర్వాచారాన్ని పునఃప్రతిష్ఠించింది.
‘మీకెందుకు ఈ మందిరాన్ని నిర్మించుకోవాలనే సంకల్పం కలిగింద’ని అడిగినపుడు, “నిత్యం అందరమూ కలిసి, సామూహికంగా సాధన చేసుకోవడానికి సరిపడా ఎవరి ఇల్లూ అనుకూలంగా లేదు, అందుకని” అని సవినయంగా చెప్పిన విధానం ఎన్నో ఆదర్శాలను కనుపట్టేలా చేసింది.
“ఇంతటి కార్యానికి మిమ్మల్ని నడిపించినదెవరు” అనే అజ్జానజనితమైన నా ప్రశ్నకు వారి మౌనంతో కూడిన చిరునవ్వే సమాధానం అయింది.
ఔను. నిజమే. అక్కడ నాయకులు లేరు. అందరూ కార్యకర్తలే. స్వయంసేవకులే. అందరిదీ ఒకటే మనసు.
ఇతర ప్రపంచంలో ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలే అనేక కారణాల వలన పరస్పర కలహాలతో నశిస్తుంటే, వీరు మాత్రం అందరమూ కలవటానికి మార్గం ఏది అని వెతికి, అందరమూ ఒకే గురువు శిష్యులం, అన్నదమ్ముల అనుబంధం కంటే ఎక్కువైనది ఆత్మ సోదర సంబంధం అని నిర్ణయించుకుని, దీన్ని పరస్పర అంగీకారంతో, సమన్వయంతో నిర్వహిస్తున్న విధానం అందరికీ ఆచరణీయం.
వీరి భక్తి అనన్య సామాన్యం.
దానిని దర్శించే అవకాశాన్ని ఇచ్చిన శ్రీ గురూజీకి అనేక కృతజ్ఞతాభివందనాలు. అభినందనీయులైన వీరి గురించి ఇతరులు కూడా తెలుసుకోవాలి కదా అని మనసులోని మాటగా చెపుతున్నాను.
అన్నట్లు ఆ ఊరిపేరు చెప్పలేదు కదూ. కామన్నవలస శ్రీ స్వామి “రామా”నంద “పురం” గనుక, ఈ గ్రామం “హనుమంతుపురం”. ఎచ్చర్ల మండలం, శహపురం ప్రక్కన. ఇక ఆ మందిరం పేరు “జగజ్జ్యోతి శ్రీ స్వామి శివానంద పరమహంస సిద్ధవిద్యా అభ్యాసాలయం”
స్వస్తి