His holiness Sri Swami Ramananda Paramahamsa was born in Kalliyaserri, a small village in the Cannor district of Kerala in the year 1903. After travelling from place to place, he settled down at Dowleswaram in East Godavari District, A.P. For several years there, he did penance in a cave in the Janardhana Swami Temple. The temple is located in the Dhawalagiri hills which are infested with snakes (Pamula), so he was called as PAMULASWAMY.
After decades of vigorous Yoga Sadhana, Swamiji wanted to establish the Yoga propounded by his Guru, Sri Swami Sivananda Paramahamsa. This was the Yoga as preached by Sri Krishna in the holy Bhagavad-Gita, and it was also noted in the scriptures and shrutis.
Swamiji as a Guru
Swamiji carefully studied the Upanishads with a view to prove that his Guru’s yoga is the method taught by Sri Krishna in the Gita and that it is the Yoga for self-realization. He founded an ashram by name Sri Ramananda Yoga Jnana Ashram at Kamannavalasa in the year 1965. He founded another ashram at Bhavanipuram, Vijayawada.
His beloved disciple was Sri Antarmukhananda, our Guruji, who served his Guru for more than 14 years in the ashram and attained spiritual powers (TAPAS) from his Guru. With Swamiji’s blessings, he is now conducting the ashram as the Pitadhipathi. He has given initiation to thousands of people throughout the country. Learn more about Guruji here.
Swamiji was a good doctor and cured chronic diseases like cancer, arthritis, and psychic problems. His disciples have experienced miracles and also observed his control over the nature many times. He has showered love and affection on poor people and given them food and clothes. Swamiji strongly stressed the need for regular Yoga Sadhana to all mankind and named the Sadhana as Sada Pranayama. He wrote a number of books. The last of the series is YOGAMRUTHAM.
Swamiji attained Mahasamadhi in 1993.
బ్రహ్మర్షి సద్గురు శ్రీశ్రీశ్రీ స్వామి రామానంద పరమహంస
రాష్ట్రములన్నింట చిన్నదియే గాని, ఆధ్యాత్మిక విద్యావిషయమున అన్నింటా మిన్న కేరళ రాష్ట్రము. శ్రీ శంకర భగవత్పాదులవంటి అద్వైతాచార్యులను దేశమునకు ప్రసాదించి, అనేక యోగివర్యులకు, తపోనిష్ఠాగరిష్ఠులకు భాగవత తత్త్వ ప్రచారకులకు జన్మభూమియై వర్ధిల్లు గౌరవము కేరళమునకు దక్కినది. అట్టి పవిత్ర బ్రహ్మవిద్యా ప్రచార కేంద్రమై వెలసిన కేరళ రాష్ట్రాంతర్గత కన్ననూరు పుర సమీపమున ‘కళ్ళియాసేరి’ యను గ్రామము శ్రీ రామానంద స్వాములవారి జన్మస్థలము క్రీ. శ. 1902వ సంవత్సరమున ఒక యోగ్యతమమైన ఆధ్యాత్మిక కుటుంబమున శ్రీవారు జననమందిరి స్వామివారి శైశవ నామధేయము కుంజప్ప నంబియార్, బాల్యాపస్థనుండియే వారు ప్రాపంచిక విషయాదులందు ఉదాసీనతయు, ఆధ్యాత్మిక విద్యయందాసక్తియు గలిగియుండిరి. వారు విద్యార్థిగానున్న కాలమందు గూడ, ఏదియో కొఱవడ్డ ఒకానొక సిద్ధికై ఆరాట పడుచున్నట్లు వారి బంధువులెల్లరు గ్రహించిరి. శైశవమునందే తన్నాశ్రయించిన యీ వైరాగ్యలక్ష్మిని శ్రీవారు బహుబాగ్రత్తగా పోషించుకొనుచు వచ్చిరి. వారికి గల యీ వైరాగ్యభావన వలననే పై చదువులు సాగించుటకు అవకాశమున్నను, జన్మతః గొప్ప శ్రీమంతులై యుండియు చదువు చాలించి సర్వే డిపార్టుమెంటులో ఉద్యోగము చేపట్టిరి. ఈ ఉద్యోగావకాశము స్వామివారి జీవన దృక్పథమును సువిశాలమొనర్చుటకెంతయో తోడ్పడినది. శ్రీరామానందులవారికి శైశవము నుండియు ఆధ్యాత్మిక గ్రంథపఠన మందును, వేదాంత గోష్ఠుల యందునుగల ఆసక్తి కడుమెండు. ఒక సమయమున కాకతాళీయముగా నొక విశ్వబ్రాహ్మణ మిత్రునివద్ద లభించిన ‘సిద్దవేద’ మను గ్రంధమును శ్రీవారు ఆమూలాగ్రముగా కడుశ్రద్ధతో పఠించుట తటస్థించెను. జన్మతః సునిశితమైన వివేకబుద్ధిగల స్వామీజీని ఆ గ్రంథమున చెప్పబడిన యోగరహస్యము లెంతయో ఆకర్షించినవి. ఆ గ్రంథ విషయమును పరిశీలించుటతోడనే స్వామి అందుపదేశించిన యోగపద్ధతిని సాకల్యముగా గ్రహించి అభ్యసింప మొదలిడిరి. తదుపరి కొలది కాలమునకు యేతద్గ్రంథ కర్తయగు శ్రీస్వామి శివానంద పరమహంసల వారిని శాస్త్ర పద్ధతిని గురువుగా స్వీకరింప సంకల్పించి ‘వటకర’ అను పుణ్యక్షేత్రమున అట్టి బ్రహ్మోపదేశమును శ్రీ శివానందులవారి యొద్ద పొందిరి.
కేరళ రాష్ట్రములోని వటకర దివ్య క్షేత్రమున యిప్పటికి శ్రీ శివానందులచే స్థాపింపబడిన ‘సిద్ధసమాజ’ మను గొప్ప ఆశ్రమమొకటి గలదు. అచట వందలాది ముముక్షువులు యోగాభ్యాసపరులై ఆధ్యాత్మిక పరిశ్రమను కఠోర నియమములతో సాగించుచునే యున్నారు. శ్రీవారి గురువర్యులైన శ్రీ శివానందులవారికి స్వదేశములోను, విదేశములందును సుమారు ఐదారు లక్షల వరకు శిష్యగణమున్నది. శ్రీశివానందులవారు దక్షిణ దేశమందున్న ‘పళని’ క్షేత్ర పరిసరములలో పర్యటించు సమయమున సాక్షాత్ నర నారాయణులనదగు సిద్ధులిర్వురు ‘రాజవిద్యా రాజ గుహ్యం పవిత్రమిదముత్తమం’ అనదగు అత్యంత సనాతనమగు ఒక విశిష్ట యోగ పద్ధతిని వారికి ఉపదేశించి అదృశ్యులైరి. కేవలం భగవత్ కృపా విశేషముచే లభించిన యీ బ్రహ్మోపాసన పద్ధతిని స్వామివారు దీర్ఘవత్సరములు అరణ్య మధ్యమందుండి ఘోర తపమాచరించుచుండిరి. ‘అపర వాల్మీకి’ యా అనునట్లు వారి భౌతిక కాయమంతయు ముళ్ళపొదల చేతను, తీగలచేతను చుట్టబడియుండెను. అట్టి సమయమున ‘కలాం’ అను ఒక ఫారెస్టు ఉద్యోగి వీరి ఉనికిని గ్రహించి, బాహ్యస్మృతి లేకయున్న శ్రీ శివానందులవారికి వెలుపలికి గొనివచ్చి, ఉపచారములచే బాహ్యస్కృతి గలిగించిరి. నాటినుండి శ్రీ శివానందుల వారు లక్షలాది మానవులకు యీ ఉత్తమ యోగమార్గమును బోధించుచూ యీ భవసాగరమును తరించు ఉపాయమును జూపియుండిరి. ఇట్లు బహుకాలము బ్రహ్మవిద్య ప్రచారమున తమ జీవితము గడుపుచు చివరకు అరూప మనోనాశస్థితిని లక్షించి ‘పళని లో జీవ సమాధినందిరి. శ్రీ శివానందుల వారికి ఆంధ్రదేశమున కూడ పలు ప్రాంతములందు వేలాది శిష్యులు గలరు. అత్యంత గోష్యమును, విశిష్టమును యగు యీ యోగపద్ధతి శ్రీ శివానందులవారి శిష్య సాంప్రదాయమునందు కలదు గాని మరియెచ్చటను లభ్యముగాదు. అత్యంత ప్రాచీనమగు యీ పవిత్ర యోగపద్ధతి, వేదమువలె అపౌరుషేయమని చెప్పవచ్చును.
శ్రీ శివానందుల ద్వారా యీ యోగవిద్యను గ్రహించినదాది శ్రీ స్వామి రామానందులవారు ప్రాపంచిక విషయములందు వైముఖ్యము గలిగి ఏకాంతము నిచ్చగించుచూ, ఉద్యోగమునకు రాజీనామానిచ్చిరి. వారి అన్న గారు కొంత కుటుంబ బాధ్యతను తనకప్పగింప సంకల్పించినారని గ్రహించి శ్రీవారు యేరికిని జెప్పక కట్టుబట్టలతో స్వజనమునకు, స్వస్థానమునకు దూరముగా నేగు ఉద్దేశ్యముతో ఇంటినుండి బయల్వెడలిరి. ‘యదహరేవ విరజేత్ తదహరేవ ప్రప్రజేత్’ (జాబాలోపనిషత్-4) ప్రమాణము ననుసరించి అఖండ వైరాగ్య భావన గలుగుటయే సన్మ్యాసాశ్రమమునకు నాందిగానెంచి శ్రీస్వామి వారు తిరుపతి క్షేత్రమునకు విచ్చేసిరి. అచ్చట తాను ధరించిన చొక్కా, కోటు దేవస్థానపు కాపలావానికిచ్చివేసి, ధనము చెల్లించి దేవదర్శనము చేయ నిచ్చగింపక, వేంకటేశ్వరుని దర్శింపకయే కొండదిగి వచ్చిరి. తదనంతరము మళయాళ స్వామి వారిని దర్శించు నిమిత్తము ‘యేర్పేడు’ వ్యాసాశ్రనమునకు విచ్చేసిరి. ఆశ్రమమున కెదురుగా నున్న చెట్టు క్రింద ఆహారాదులు వర్జించి యోగనిష్ఠులైయున్న శ్రీవారిని మళయాళస్వాములవారు ఉచితరీతిని సత్కరించి తమ ఆశ్రమమునందే నివసింపగోరిరి. కాని తీవ్ర వైరాగ్యానేశముచే వివశులైయున్న శ్రీస్వామీజీ యచటగూడ నుండ నిచ్చగింపక పండరీపురము చేరిరి. అచట వారము రోజులు స్థానికాహారములగు జొన్నరొట్టె, వేరుశనగ, తేనీరులను సేవించుచు గడిపిరి. తదుపరి నాసిక్ ప్రాంతమున నున్న పంచవటి క్షేత్రమున పదిరోజులు నిరాహారులై యోగనిద్రలో గడిపిరి. అచట ప్రదేశము తపస్సుకనువుగానున్నను, అహార పానీయాదుల అసౌకర్యము వలన ఆ స్థానమును గూడ విడచి బొంబాయి మీదుగా అహమ్మదాబాద్ వఱకు ప్రయాణించిరి. అచట ఆహార పదార్ధములు శ్రీవారి దేహతత్త్వమునకు సరిపడక తీవ్రమగు జ్వరముతోను, కడుపు నొప్పితోను బాధనొందిరి. అనారోగ్యముతో బొంబాయి తిరిగివచ్చి ‘బాణగంగా వద్ద పరివ్రాజకులకై యేర్పడిన సత్రపు గదులలో ఆరు మాసములు జబ్బుతో గడిపిరి. శరీరము స్వస్థత చిక్కగనే మఱల తపస్సు కనువగు ప్రదేశమును వెదుకుచూ, విజయవాడ మీదుగా విజయనగరము పఱకు కాలినడకన ప్రయాణించిరి. అటనుండి గోదావరి నదీ తీరమున ఏదైననొక ప్రశాంత ప్రదేశము లభ్యమగునేమోయను ఉద్దేశ్యముతో తిరిగి ధవళేశ్వరమునకు విచ్చేసిరి. కొంతకాలము గోదావరి నదీ తీరమున ప్రశాంత వాతావరణమున యోగనిష్ఠ యందు గడిపి, తదుపరి ధవళేశ్వరము వద్ద శిథిలావస్థలోనున్న యొక మందుకొట్టులో స్థానమేర్పరచుకొని రోజులో చాలా భాగము దేహస్మృతి దప్పి యోగనిద్రయందు గడిపెడివారు. ఆ తరువాత పొలములో కుటీరములు నిర్మించుకొని కొంతకాలము, రోడ్డుపై నుండు తూములపై పరుండి మఱి కొంతకాలము నానా వృక్షఛాయల నింక కొంతకాలము గడుపుచు వచ్చిరి. కొన్ని రోజులు ధవళేశ్వర ప్రాంతములో చీకటి కోనలుగానున్న గుళ్లలో యోగనిద్రాపరవశులై గడపెడివారు. అంధకారమయమైన ఆలయ గర్భములలో గండుచీమలు, బాధాకరములగు కీటకములు అనేకములుగా నున్నను వాటిని స్వామి సరకుగొనకుండెడివారు. తదుపరి జనార్ధన స్వామి ఆలయము వెనుకనున్న గుహలో పుట్టపై పరుండి యెనిమిది మాసములు ఏకదీక్షతో తపమాచరించిరి. అచటి సర్పములు వీరికి సుమంతయు అపకారమొనర్పలేదు సరికదా అవి వారి దేహముపై పారాడుచు చరలాటము లాడుచుండెడివట. వీరిని ఆ ప్రాంతపు ప్రజలిప్పటకీ ‘పాములస్వామి’ యని సంబోధించుట యలవాటు. స్వామివారు, పాపికొండలలో పట్టపగలే క్రూరమృగములు నంచరించు దుర్గమారణ్య మధ్యమున నలుబది యొక్క రోజులు కఠోర తపంబాచరించిరి. ధవళేశ్వరముననున్నప్పుడు వీరివలన బ్రహ్మోపదేశమందిన డా. కె. రంగారావు గారు (పిఠాపురం మెడికల్ ఆఫీసరు), వారి కుటుంబము, జమిందారులు ముత్తంగి అయ్యన్నగారు, ఇతరులనేకులు వీరియందు చూపు శ్రద్ధాభక్తులు కడుంగడు శ్లాఘనీయములు.
శ్రీ స్వామీజీ శిష్యగణమునందలి వాత్సల్యమును పురస్కరించుకొని కొత్తగూడెమునందును, కృష్ణాతీరమందలి విజయవాడ భవానీపురమందును, విజయనగరము జిల్లా బాడంగి సమీపములో కామన్నవలస యందునూ మూడు ఆశ్రమములు వెలయించిరి. ఎక్కువ కాలము శ్రీవారు మౌనదీక్షయందే గడుపుచున్నను, అప్పుడప్పుడు ముముక్షు జనులను కటాక్షించు సంకల్పముతో శ్రుతి స్మృతి యుక్తముగా ఆధ్యాత్మిక ప్రసంగములు చేయుచు, వారి వాగామృతధారలచే శ్రోతల మనోమాలిన్యమును క్షాళనము చేయుచుండెడివారు. స్వామివారు ‘యోగామృతము’, ‘వేదాంత రహస్య విచారిణి’ ‘బ్ఞానబోధిని’ ‘యోగ-జ్ఞాన ప్రకాశిక’, ‘జ్ఞానసూత్రము’ మరియు ‘భగవద్గీత వ్యాఖ్యానము’ లను ఉద్గ్రంధములను గూడ రచించియున్నారు.
Source:
Yogam Dhyanam Jnanam by Swamy Antarmukhananda.