గురుపూర్ణిమ సందేశం PRINT
గురుతత్త్వము — గురుశిష్య సంబంధము
భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి జయంతి (ఆషాఢ శుద్ధ పూర్ణిమ) సందర్భంగా గురుదేవుల ప్రవచనం
మంగళాచరణం
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః
ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః
ఓం సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మనే నమః
ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమః
ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరమహంసాయ నమః
ఓం సద్గురు భగవాన్ వ్యాసాయ నమః
గురుస్వరూపులకు, సభికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ఓం శ్రీ గురుభ్యో నమః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
నారాయణ సమారంభాం శ్రీ శివానంద మధ్యమామ్ |
శ్రీ రామానంద పర్యంతాం వందే గురుపరంపరామ్ ||
యోగీశ్వరం ప్రణమ్యాహం శ్రీ రామానంద సద్గురుమ్ |
యోగాభ్యాసం సమారంభే మోక్షసామ్రాజ్యదాయకమ్ ||
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః ||
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం |
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం |
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||
ఓం భగవతే సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః
ఓం భగవతే సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః
కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ |
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః ||
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||
కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనమ్ |
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్ ||
ఓం భగవతే సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మనే నమః
ఓం లోకోత్తర అవతారపురుష శ్రీమచ్ఛంకర భగవత్పాదాచార్యాయ నమః
ఓం పరాశరసుతాయ భగవతే వ్యాసాయ నమః
హరిః ఓం తత్సత్
భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి
ఈ దినము, అనగా భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షివారి జయంతి సందర్భంగా, మనం గురుపూర్ణిమ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. యావద్భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా భారతీయ సంస్కృతికి ఎవరెవరు ఆకర్షితులై ఉన్నారో వారందరూ — యావత్ప్రపంచమూ — ఈ గురుపూర్ణిమ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎవరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ అందరికీ కావలసినవి ఈ గురుపూజోత్సవాలు. భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షివారి జయంతి సందర్భంగా మనమందరం వీటిని ఈ విధంగా జరుపుకుంటున్నాం.
భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షివారు బ్రహ్మవిద్యా సంప్రదాయ గురువులలో ఆరవవారు.
ఓం బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః ||
ఈ బ్రహ్మవిద్యా సంప్రదాయ గురువులు ఎవరెవరంటే —
నారాయణం పద్మభవం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ |
వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యమ్ ||
నారాయణుడు, పద్మభవుడు (బ్రహ్మ), వసిష్ఠుడు, శక్తి, ఆయన పుత్రుడు పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులు, శంకరాచార్యులు, శ్రీ శివానందులు, శ్రీ రామానందులు — వీరంతా బ్రహ్మవిద్యా సంప్రదాయ గురువులు. వీరిలో వ్యాసులవారు ఆరవ గురువు.
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
అని మనందరికీ సుప్రసిద్ధమైన ఈ శ్లోకం వారి సంబంధ బాంధవ్యాలను తెలియజేస్తుంది. “వ్యాసం వసిష్ఠనప్తారం” — బ్రహ్మమానసపుత్రులైన వసిష్ఠులవారి మునిమనవడు వ్యాసమహర్షి. “శక్తేః పౌత్రమకల్మషమ్” — వసిష్ఠులవారి కుమారుడైన శక్తి మహర్షికి మనవడు. “పరాశరాత్మజం వందే” — పరాశర మహర్షివారి తనయుడు. “శుకతాతం” — శుకబ్రహ్మర్షికి తండ్రి. ఈ వంశం ఈ విధంగా ఉంది.
వ్యాసావతార వృత్తాంతం
వేదాన్ని సంరక్షించడం కోసమని మొట్టమొదట అపాంతరతముడు అనే మహర్షి వచ్చారు. మనకు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం — ఇలా పైపైన లోకాలు ఉన్నాయి. “భ్రూమధ్యే తపోలోకః” — మనలో భ్రూమధ్యంలో తపోలోకం ఉంది. ఆరవ లోకమైన ఈ తపోలోకంలో తపస్సంపన్నులైన మహాత్ములు, ఋషులు, మునులు అందరూ ఉంటారు. ఆ తపోలోకం నుంచి వచ్చినవారే అపాంతరతముడు అనే మహర్షి. విష్ణ్వంశను తీసుకొని, శ్రీమహావిష్ణువే పదిహేడవ అవతారంగా — ఆ అపాంతరతముడే — వ్యాసులవారిగా అవతరించారు.
వీరు అవతరించే ముందు జరిగిన గాథ ఇది. బ్రహ్మదేవుని వక్షస్థలం నుంచి ధర్ముడు అనే ఋషి పుట్టారు. ఆ ధర్మునికి మూర్తిదేవి యందు పుట్టినవారే నరనారాయణులు. ఈ నరనారాయణులు ఇద్దరూ బదరికాశ్రమంలో తపస్సు చేస్తుండేవారు. వారు కృతయుగంలో పుట్టి తపస్సు చేస్తున్న సమయంలో సహస్రకవచుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి, బ్రహ్మవరాన్ని పొంది, తనకు వెయ్యి కవచాలు ఉండేటట్లు వరం పొందాడు. అటువంటి రాక్షసుడు లోకకంటకుడు కావటం వల్ల అతణ్ణి సంహరించడం కోసమే ఈ నరనారాయణులు అవతరించారు.
బదరీనాథుడు అని మనం అంటాం — ఆ బదరికాశ్రమంలో వారు త్రికాలాలూ తపస్సు చేస్తూ నరుడు, నారాయణుడుగా ఉండేవారు. ఒకరు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే, మరొకరు వెయ్యి సంవత్సరాలు ఆ సహస్రకవచునితో యుద్ధంలో పోరాడి ఒక కవచాన్ని తొలగించేవారు. ఈ విధంగా మార్చి మార్చి యుద్ధం చేసి 999 కవచాలు తొలగించారు. ఇక మిగిలింది ఒక్క కవచమే; అది కూడా తొలగిస్తే తాను చనిపోతాననే భయంతో అతడు సూర్యుని దగ్గరికి వెళ్లి శరణు పొందాడు.
సూర్యుని శరణు పొందినప్పటికీ అతడు లోకకంటకుడు గనుక అతణ్ణి సంహరించాలనే ఉద్దేశంతో, విష్ణ్వంశతో పుట్టిన అపాంతరతముడు నరనారాయణులతో ఇలా చెప్పారు: “మీరు కృతయుగం నుంచి ఉన్నారు. ఇక ఈ శరీరాలను చాలించి శ్రీకృష్ణార్జునులుగా అవతరించండి. నేను పరాశరుని తనయునిగా అవతరిస్తాను.” ఆ విధంగా వారే వ్యాసునిగా అవతరించారు. తరువాత సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసుడు కర్ణునిగా అవతరించాడు. ఆ కర్ణుణ్ణి, నరనారాయణులలో నరుడైన అర్జునుడు సంహరించాడు. ఇది పూర్వగాథ. వ్యాసులవారు అవతరించడానికి కారణం ఇది.
వ్యాసులవారి నామధేయాలు
వ్యాసులవారికి అనేక పేర్లు ఉన్నాయి. వారిని కృష్ణద్వైపాయనుడు అంటారు. కృష్ణం అంటే నలుపు; యమునానది నీరు నల్లగా ఉంటుంది. పరాశర మహర్షివారు తపస్సు చేసి వస్తుండగా, యమునానదిలో యోజనగంధి — లేక మత్స్యగంధి — అనే బెస్త కన్యను చూశారు. అది కూడా కార్యకారణ సంబంధంగా జరిగినదే. ఆ ముహూర్తంలో, ఆ కాలంలో ఒక మహాయుగపురుషుడు అవతరించనున్నారని తెలుసుకొని, పరాశరులవారు ఆమెతో ప్రణయసంబంధం ఏర్పరచుకున్నారు. యమునానదిలోని ఒక ద్వీపంలో వారు కలవటం వలన, అక్కడ జన్మించారు గనుక — నల్లని నీరు గల కృష్ణయమునానదిలోని ద్వీపంలో పుట్టారు గనుక — వారికి కృష్ణద్వైపాయనుడు అని పేరు. తరువాత బదరికాశ్రమంలో తపస్సు చేశారు గనుక వారిని బాదరాయణుడు అన్నారు. ఆ యోజనగంధి, మత్స్యగంధియే సత్యవతి. సత్యవతికి పుట్టారు గనుక సత్యవతీసుతుడు, పరాశరునికి పుట్టారు గనుక పారాశర్యుడు. ఇలా అనేక విధాలుగా వ్యాసులవారికి నామధేయాలు ఉన్నాయి.
వ్యాసమహర్షి — “వ్యాసము” అంటే వ్యాప్తి చేయటం. వేదాంతసారాన్ని, వేదాలను లోకానికి వ్యాప్తం చేయడం కోసమే వారు అవతరించారు కాబట్టి వారు వ్యాసులు. వారు 28 కల్పాలలో కూడా నిరంతరం ఉంటూనే ఉంటారు. వ్యాసమహర్షి చిరంజీవులు. వారి పుట్టుక పరాశరులకు పుట్టినట్లు ఉంది కానీ, వారు అవతారం చాలించినట్లు ఎక్కడా లేదు. వారు అన్ని యుగాలలోనూ ఉంటారు.
వేదవిభజన — గ్రంథరచన
పూర్వం వేదరాశి అనేకంగా, విస్తారంగా ఉండేది. వాటన్నిటినీ వ్యాసులవారు క్రమబద్ధీకరణ చేశారు. వారికి పైలుడు, వైశంపాయనుడు, జైమిని మహర్షి, సుమంతుడు అనే నలుగురు శిష్యులు; ఐదవ శిష్యుడు రోమహర్షణుడు అనే సూత మహర్షి. ఈ శిష్యుల ద్వారా — ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయనునికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వవేదాన్ని సుమంతునికి — అప్పగించారు. వేదాలను విభజించి, వాటి సారాన్ని క్రోడీకరించి, శాఖలుగా విభజించి, క్షుణ్ణంగా క్రమబద్ధం చేశారు. తరువాత పురాణాలను చెప్పడం కోసమని ఐదవ శిష్యునిగా రోమహర్షణుడనే సూత మహర్షిని ఎన్నుకున్నారు.
ఇక్కడ ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే — వ్యాసమహర్షివారు పరమగురువులు. వారు స్వయంగా రాయటమే కాకుండా, అనేకమంది మహాత్ములైన శిష్యులలో ప్రవేశించి వారి ద్వారా కూడా రాయించారు. ఇతర ఉపాధులలోకి దూరి, వారిచేత ప్రేరణ చేయించి రాయించారు. అదేవిధంగా మహాభారత యుద్ధంలో కూడా సంజయునిలో ప్రవేశించి, సంజయుని పేరును నామమాత్రంగా ఉంచి, ఆ యుద్ధాన్ని ధృతరాష్ట్రునికి వివరించారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన యావత్ వేదాంత సందేశాన్ని భగవద్గీత రూపంలో ధృతరాష్ట్రునికి చెప్పింది కూడా వ్యాసులవారే — సంజయుని రూపంలో ప్రేరణ చేసి చెప్పించారు.
అందువల్లనే వ్యాసులవారు మహద్గురువులు, పరమగురువులు. వారు ఆ విధంగా చేయబట్టే ఇన్ని లక్షల శ్లోకాలు రాయగలిగారు, రాయించగలిగారు. ఒక మానవమాత్రుడు ఎవ్వరూ ఇది చేయలేరు. ఈ వేదసారాన్ని అనేక గురువుల ద్వారా, అనేక ఉపాధుల ద్వారా వారు ప్రేరణ చేసి రాయించారు. భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు — ఇవన్నీ వారు రచించినవే.
భారతాన్ని రాయించింది గణేశుని చేత. బదరికాశ్రమానికి — బదరీనాథ్‌కు — సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇప్పటికీ వ్యాసగుహ, గణేశగుహ ఉన్నాయి. అక్కడ వ్యాసులవారు చెప్తుంటే విఘ్నేశ్వరుడు రాశాడు. మొట్టమొదట వారు బ్రహ్మసూత్రాలు రాశారు; ఆ తరువాత భారతం, ఆ తరువాత పురాణాలు; చివరగా భక్తిపారవశ్యంతో కూడిన మహాభాగవతాన్ని రచించారు.
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||
అని శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయంలో — ఈ తత్త్వం బ్రహ్మసూత్రాల చేత ధృవీకరించబడిందని — శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే భగవద్గీతకు ముందే వ్యాసమహర్షివారు బ్రహ్మసూత్రాలు రాశారు. అలాగే పదవ అధ్యాయంలో —
మునీనామప్యహం వ్యాసః ||
“మునులలో నేను వ్యాసుణ్ణి సుమా” అని కూడా చెప్పారు. అందువలన శ్రీమద్భగవద్గీతకు ముందే వ్యాసులవారు బ్రహ్మసూత్రాలు రాశారు.
పద్దెనిమిది — సంఖ్యా రహస్యం
అంతేకాకుండా, వారు 18 అనే అంకెను ఒక సుప్రసిద్ధమైన సంఖ్యగా ఎంచుకున్నారు. 18 పర్వాలతో కూడిన మహాభారతం, 18 అధ్యాయాలతో కూడిన శ్రీమద్భగవద్గీత, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు; భారత యుద్ధంలో సైన్యం కూడా 18 అక్షౌహిణులు. అన్నిటికీ ఈ 18 అనే సంఖ్యే ప్రసిద్ధమైనది.
వీటన్నిటితో పాటు అసలైన విషయం ఏమిటంటే — సూక్ష్మశరీరానికి 17 తత్త్వాలు ఉన్నాయి. ఈ 17 తత్త్వాలపైన ఆత్మ ప్రతిబింబిస్తుంది; అది 18వ తత్త్వం. ఈ 18 తత్త్వాలతో కూడినదే ఈ మొత్తం సృష్టి అంతా. స్థూలంగా చూస్తే 25 తత్త్వాలు ఉన్నాయి. కానీ సూక్ష్మశరీరానికి ఉన్న 17 తత్త్వాలను, వాటితో కూడిన ఆత్మతత్త్వాన్ని కలిపి 18 తత్త్వాలుగా — దానిని ముఖ్యమైన సంఖ్యగా — వారు ఎంచుకున్నారు.
శ్రీమద్భగవద్గీత 18 అధ్యాయాలను శ్రీమన్నారాయణుడే — ఆ శ్రీకృష్ణ పరమాత్మే — మూడు రకాలుగా అందించారు: చెప్పింది వారే, విన్నది వారే, రాసింది వారే. శ్రీకృష్ణుని రూపంలో కృష్ణుడే చెప్పారు; ఆ కృష్ణ పరమాత్మే అర్జునుని రూపంలో విన్నారు; రాసింది కూడా ఆ కృష్ణ పరమాత్మే, ఆ నారాయణుడే. ఇదంతా ఏకబ్రహ్మమే అనేక ఉపాధులతో కూడుకొని జరిగినది.
వ్యాసులవారు బయటికి ఒక మామూలు మానవశరీరంగా కనిపించినప్పటికీ —
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః |
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః ||
“అచతుర్వదనో బ్రహ్మా” — నాలుగు ముఖాలు లేని బ్రహ్మ వారు. “ద్విబాహురపరో హరిః” — రెండు చేతులతో ఉన్న శ్రీమహావిష్ణువు. “అఫాలలోచనః శంభుః” — మానవశరీరంలో మూడవ నేత్రం కనబడకపోయినప్పటికీ, మూడవ నేత్రంతో కూడిన శంభుడే, ఈశ్వరుడే. “భగవాన్ బాదరాయణః” — వారే బాదరాయణుడు.
గురుపూర్ణిమ — వ్యాసుల వరం
అటువంటి వ్యాసమహర్షి జయంతిని నేడు మనమందరం ఆషాఢ శుద్ధ పూర్ణిమనాడు గురుపూర్ణిమగా, గురుపూర్ణిమోత్సవాలుగా జరుపుకుంటున్నాం. వారి జయంతినే గురుపూర్ణిమగా జరుపుకోవడానికి మరొక కారణం కూడా ఉంది — వారు వేదాలను విభజించే కార్యాన్ని కూడా ఈ పూర్ణిమనాడే ప్రారంభించారు.
అంతేకాకుండా, పూర్వం కాశీ మహానగరంలో వేదనిధి, వేదవతి అనే సద్బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వ్యాసులవారు కాశీపట్టణంలో ఇప్పటికీ మధ్యాహ్నం పూట వేరే రూపంలో సంచరిస్తుంటారని ఒక కథ ఉంది. అది తెలుసుకొని వేదనిధి మధ్యాహ్నం పూట వ్యాసులవారి కోసం కాశీలో వెతుకుతున్నారు. అలా వెతుకుతుండగా భిక్షాటన చేసుకునే ఒక ముసలివాని రూపంలో ఒక వ్యక్తి ఎదురయ్యాడు. వేదనిధి ఆయన కాళ్లు పట్టుకున్నారు.
ఆయన కోపపడి, “నన్ను ఎందుకు పట్టుకున్నావు?” అన్నారు. ఎంత చెప్పినా సరే వేదనిధి కాళ్లు విడువలేదు. విడవకపోయేసరికి ఆయన అటూ ఇటూ చూసి, “నువ్వు ఎవరికీ చెప్పొద్దు, నేనే వ్యాసుణ్ణి. నీకేం కావాలి?” అని అడిగారు. “మా ఇంటికి వచ్చి మీరు భిక్ష స్వీకరించాలి” అని వేదనిధి కోరారు. “సరే, వస్తాను” అని వచ్చి భిక్ష స్వీకరించారు. స్వీకరించిన తరువాత, అంతర్ధానం అయ్యే ముందు “మీకేం కావాలి?” అని అడిగారు. “మాకు మీ సన్నిధానం, మీ అనుగ్రహమే కావాలి” అని ఆ దంపతులిద్దరూ కోరుకున్నారు.
అప్పుడు వ్యాసులవారు ఇలా అనుగ్రహించారు: “నా జయంతినాడు — అంటే ఆషాఢ పూర్ణిమనాడు — ఎక్కడైతే భాగవత, భారత, వేదాంత రహస్యాలను, సద్గురువుల, పరమగురువుల జీవిత రహస్యాలను ఎవరైతే వివరించి చెప్తుంటారో, అక్కడ నేను ఉంటాను సుమా!”
అందుకనే నేడు మనం గురుపూర్ణిమను జరుపుకుంటున్నాం. గురుపూర్ణిమను జరుపుకోవడానికి కారణం ఇదే — వారి జయంతినాడు వేదాంత రహస్యాలను, బ్రహ్మరహస్యాలను, పరమగురువుల జీవిత చరిత్రను క్షుణ్ణంగా, విధివిధానంగా ఎవరైతే చెప్తారో అక్కడ తాము ఉంటామని వారు అనుగ్రహించారు. అందుకనే నేడు మనం ఈ గురుపూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం.
గురుతత్త్వం — బ్రహ్మవిద్యకు మూలం
ఇంతే కాకుండా, ఈ గురుపూర్ణిమ యొక్క లక్ష్యం ఏమిటంటే — బ్రహ్మవిద్యకు ప్రధానమైనది గురుతత్త్వం. గురువు అంటే ఏమిటో ప్రజలకు తెలియాలి. అది తెలియకుండా, దీనిని మామూలు సామాన్య విద్యలాగా మనం భావించకూడదు. బ్రహ్మవిద్య అనేది ముందుగా గురువుతో ముడిపడి ఉన్నది. ఈ గురుతత్త్వాన్ని తెలుసుకోవడానికి చాలా వివరాలు ఉన్నాయి. బ్రహ్మవిద్య అనేది అతి పవిత్రమైన ఒక మణిరత్నం వంటి విద్య. దానిని ఇతరులకు అందించేటప్పుడు కొన్ని నియమనిబంధనలు పాటించాలి; అవి పాటించకపోతే వారు ప్రమాదానికి గురవుతారు.
అందువల్లనే గురుగీత రూపంలో సాక్షాత్తూ ఆ శివుడే, ఆదిదేవుడే పార్వతీదేవికి ఈ తత్త్వాన్ని చెప్పారు. అందులోని కొన్ని అంశాలు నేను చెప్తాను. అంతేకాకుండా ఉపనిషత్తులలో, ఇతర గ్రంథాలలో కూడా గురుశిష్య సంబంధం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి — అవన్నీ విధివిధానాలతో, నియమనిష్ఠలతో చెప్పబడ్డాయి.
“గురు” శబ్దార్థం — మూడు గురువులు
దీనిలో ప్రధానంగా మనం తెలుసుకోవలసినది — గురువు అంటే ఏమిటి?
గుకారస్త్వంధకారః స్యాత్ రుకారస్తేజ ఉచ్యతే |
అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే ||
“గు” అంటే అంధకారం, “రు” అంటే తేజస్సు. అంధకారాన్ని పోగొట్టేది తేజస్సు; ఆ తేజస్సే గురువు.
గురువులు మూడు రకాలు. మొదటిది — శరీరరూపం ధరించిన గురువు. రెండవది — మనలో అంతర్లీనంగా, తేజోరూపంలో ఉన్న తేజోనారాయణుడు. మూడవది —
గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః |
గుణరూపవిహీనత్వాత్ గురురిత్యభిధీయతే ||
గుణరూపాలకు అతీతంగా ఉండే ఆ నిర్గుణ పరబ్రహ్మమే గురువు — ఇది పరాకాష్ఠగా చెప్పబడిన అర్థం.
ఈ మూడింటిలో మొదటి రెండు — శరీరధారియైన గురువు మరియు తేజోగురువు — వీరిద్దరికీ ఎప్పుడూ విడదీయరాని సంబంధం ఉంటుంది. ఈ తత్త్వాన్ని మనం తెలుసుకోవాలి. అందువలన గురువు అంటే అర్థం ఏమిటంటే — ఆ తేజస్సును తెలుసుకోవటమే గురుతత్త్వం. తేజస్సు ఊరకనే తెలియబడదు. శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయంలో చెప్పినట్లు —
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ||
ఈ జ్యోతిని యోగసాధన ద్వారా భ్రూమధ్యంలో దర్శించటం జరుగుతుంది. అందువల్ల గురుతత్త్వం అంటే — యోగసాధన ద్వారా తేజస్సును దర్శనం చేయడమే అసలైన గురుతత్త్వం. అందువలననే ఈ గురుపూర్ణిమ, గురుపూజోత్సవాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చింది.
గురువే సాక్షాత్ పరబ్రహ్మ
ఇక గురుశిష్య సంబంధం. గురువు బ్రహ్మవిద్యను ఉపదేశం ఇచ్చినప్పుడు, వారు మామూలుగా శరీరంతో ఉన్నప్పటికీ సాక్షాత్ పరబ్రహ్మమే. మనం చదువుకునే శ్లోకానికి అర్థం ఇదే —
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు — త్రిమూర్తులూ గురువే. ఈ ముగ్గురికంటే అతీతమైన సాక్షాత్ పరబ్రహ్మం కూడా గురువే. అందువలన గురువు మనకు బ్రహ్మవిద్యా ఉపదేశం చేశారంటే, ఈశ్వరుడే గురురూపంలో వచ్చారని తెలుసుకోవాలి.
ఈశ్వరానుగ్రహాదేవ గురుః గురోరనుగ్రహాదీశః |
గురుదర్శన హేతుర్హి పరమేశ్వర దర్శనమ్ ||
ఈశ్వరానుగ్రహం వల్లనే గురువు వచ్చారు, గురువు మనకు ఉపదేశం ఇచ్చారు. మళ్లీ గురువు అనుగ్రహం వల్లనే ఈశ్వరుడు కనబడతాడు. గురుదర్శనం అయిందంటే పరమేశ్వర దర్శనం అవుతుందని లెక్క. అంటే గురువు ఎప్పుడైతే బ్రహ్మవిద్యా ఉపదేశం చేశారో, ఎప్పటికైనా సరే పరమేశ్వర దర్శనం అవుతుంది — ఎందుకంటే గురువూ ఈశ్వరుడూ ఒకటే కనుక.
అటువంటి గురుతత్త్వాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఈ విద్యను పొందేవారు చాలా లోతుగా దీనిని పాటించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది — శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినది:
యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ |
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః ||
ఎవరికైతే పరమేశ్వరుని యందు అత్యంత భక్తి ఉన్నదో, అంతే భక్తి తన గురువు యందు కూడా ఉన్నదో — అటువంటి మహాత్మునికి ఈ బ్రహ్మవిద్యా రహస్యాలన్నీ ప్రకాశిస్తాయి సుమా అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తుంది. గురువు యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది.
అలాగే కబీర్దాస్ ఇలా అన్నారు —
గురు గోవింద దోఊ ఖడే కాకే లాగూఁ పాయ్ |
బలిహారీ గురు ఆపనే గోవింద దియో బతాయ్ ||
గురువు, గోవిందుడు ఇద్దరూ ఎదురుగా నిలబడి ఉంటే ముందుగా ఎవరికి నమస్కరించాలి? గురువుకే ముందు నమస్కారం చేస్తాను — ఎందుకంటే ఆ గోవిందుని గురించి నాకు చెప్పింది గురువే కనుక. గురువుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు.
“గురు” అంటే పెద్ద, “లఘు” అంటే చిన్న. ఈ సృష్టిలో గురువును మించినది మరొకటి లేదు. గురువు అంటే అన్నిటికంటే పెద్ద. ఎవరికంటే పెద్ద? త్రిమూర్తుల కంటే పెద్ద. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా గురువే. అందువలన —
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః ||
“న గురోరధికం తత్త్వం” — గురువు కంటే మించిన తత్త్వం మరొకటి లేదు. “న గురోరధికం తపః” — గురువు కంటే అధికమైన తపస్సు లేదు. తపస్సు అంటే అర్థం ఏమిటంటే — గురువుతో నిత్యమూ సన్నిహితంగా ఉండటం, గురువు చెప్పిన వాక్యాలను ఆచరించడం, గురుసేవ చేస్తూ ఉండటం. ఇవన్నీ చేస్తుంటేనే “న గురోరధికం తపః”. “తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి” — వారు చెప్పిన జ్ఞానం కంటే అధికమైనది లేదు. అటువంటి గురువుకు నమస్కారం.
అలాగే ఈ గురుతత్త్వం గురించి శాస్త్రాలు ఇంకా ఎన్నో చెప్తున్నాయి —
న సుఖం వేదశాస్త్రేషు న సుఖం మంత్రయంత్రకే |
గురోః ప్రసాదాదన్యత్ర సుఖం నాస్తి మహీతలే ||
అని గురుగీతలోనూ, ఇతర చోట్లా చెప్పారు. వేదశాస్త్రాలలో అనేక రకాలుగా సుఖసంతోషాల కోసం మనం సాధనలు చేస్తుంటాం. ఆ వేదశాస్త్రాలలో చెప్పబడిన సుఖాలలో గాని, మంత్రాలలో గాని, యంత్రాలలో గాని — గురు అనుగ్రహం కంటే మించిన సుఖం ఈ భూమిపైన మరొకటి లేదు అని గురుగీత చెప్తుంది.
గురుసేవ — సకల దేవతల తృప్తి
అంతేకాకుండా —
స్వకులం తారయేత్ సత్యం సద్గురోః సేవయా నరః |
తృప్తాః స్యుః సకలా దేవా బ్రహ్మాద్యా గురుతర్పణాత్ ||
ఎవరైతే గురువు చెప్పిన విద్యను ఆచరిస్తూ, గురుసేవ చేస్తూ ఉంటారో, వారు తాము తరించడమే కాకుండా తమ కులాన్ని కూడా తరింపజేస్తారు. “తృప్తాః స్యుః సకలా దేవాః” — మనం ఇప్పుడు అందరమూ చేస్తున్నది ఏమిటంటే, భగవంతుని పేరిట అనేక దేవతలను ఆరాధన చేస్తున్నాం; వారి తృప్తి కోసం, వారిని సంతోషపరచి, వారి ద్వారా అనుగ్రహం పొంది, సుఖసంతోషాలతో సంసారాన్ని గడుపుదామని అనుకుంటున్నాం. అది పరోక్షమార్గం. కానీ ఇక్కడ చెప్పింది ఏమిటంటే — ఎవరు గురువును తృప్తిపరుస్తారో, వారి వలన బ్రహ్మ మొదలుకొని సకల దేవతలూ తృప్తి చెందుతారట. అంటే అర్థం ఏమిటి? మనం దేవతలను తృప్తిపరచాలన్నా, గురువును తృప్తిపరచాలన్నా — గురుసేవే చేయాలి.
గురుసేవ అంటే — కొంతమంది “ఇక్కడే గురువు ఉన్నారు కాబట్టి మనం ఇంకేమీ చేయనక్కర్లేదు” అనుకుంటారు. అది కాదు.
కర్మణా మనసా వాచా నిత్యమారాధయేద్గురుమ్ |
దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ ||
“కర్మణా మనసా వాచా” — నీ చేతలలో గాని, నీ మనసులో గాని, నీ మాటలలో గాని — “నిత్యమారాధయేద్గురుమ్” — నిరంతరం గురుస్మరణతో ఉండాలి. “దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ” — గురువు ఎదుట సిగ్గు విడిచి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? గురువు అహంకారాన్ని తృప్తిపరచడం కోసం కాదు — నీలోని అహంకారాన్ని తగ్గించుకోవడం కోసమే.
ప్రణిపాతం — పరిప్రశ్న — సేవ
అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత నాలుగవ అధ్యాయంలో చెప్పారు —
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ||
అటువంటి బ్రహ్మవిద్య కోసం సద్గురువు దగ్గరికి వెళ్లి, వినయవిధేయతలతో సాష్టాంగ నమస్కారం చేస్తూ, సందర్భోచితమైన ప్రశ్నలు వేయాలి. చాలామంది ఉపదేశం తీసుకున్న వెంటనే “ఆయన నా గురువు అయిపోయారు, నేను శిష్యుణ్ణి అయిపోయాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాను, ఎప్పటికప్పుడు సందర్భం ఆలోచించకుండా ప్రశ్నలు వేస్తాను” అనుకుంటారు. కాదు — సందర్భం తెలుసుకోవాలి. చొప్పదంటు ప్రశ్నలు వేయకూడదు; పరిప్రశ్న వేయాలి.
పరిప్రశ్న అంటే అర్థం ఏమిటంటే — “నేను నిజంగా మోక్షాన్ని పొందడం కోసమే, తరించడం కోసమే సాధన నేర్చుకున్నాను, సాధన చేస్తున్నాను” — దాని కోసమే ప్రశ్న వేయాలి. అంతేకానీ, “నేను ఎంత వేగంగా శక్తి సంపాదిస్తాను? ఎంత వేగంగా మహిమలు సంపాదిస్తాను? ఎంత వేగంగా ఇతరుల దగ్గర గుర్తింపు పొందుతాను? ఎంత వేగంగా వీళ్లందరి చేత మన్ననలు పొందుతాను?” అనే విధంగా అడిగే పద్ధతి కాదు ఇది. సందర్భాన్ని అనుసరించే గురువును ప్రశ్న వేయాలి. అది కూడా గురువు తృప్తిగా, ఆహ్లాదంగా ఉన్నప్పుడు — సందర్భాన్ని తెలుసుకొని మాట్లాడాలి, ప్రశ్న వేయాలి. అలా కాకుండా ప్రశ్నలు వేయకూడదు.
ఇంకొక విషయం — గురువు యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే సేవ చేయాలి. సేవ అంటే — స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, దేహ శుశ్రూష, భావ శుశ్రూష — అని నాలుగు రకాల సేవలు చేస్తూ ఉండాలి. దగ్గర ఉండేవారు స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష చేయాలి — అంటే గురువు యొక్క పరిసరాలకు, గురువు యొక్క శరీరానికి ఈ విధంగా సేవ చేయాలి. “ఇవన్నీ మాకు అక్కర్లేదు” అనుకునేవారు ఎప్పుడూ తరించలేరు. గురువు యొక్క మనసు ప్రసన్నత పొందాలి. గురువు ప్రసన్నులైతే అన్నీ ప్రసన్నమవుతాయి; అందరు దేవతలూ ప్రసన్నులవుతారు.
అంటే మనం శరీరధారియైన గురువునే నెత్తిన ఎత్తుకోవాలని కాదు అక్కడ అర్థం. శరీరధారియైన గురువును గౌరవిస్తూనే, వారు ఏ సాధన చేశారో అదే సాధనను మనం కూడా చేస్తూ తరించాలి.
తత్త్వజ్ఞానం — మనోనాశం — వాసనాక్షయం
ఈ బ్రహ్మవిద్య యోగవిద్యతో కూడుకున్న బ్రహ్మవిద్య. యోగవిద్య అనేది సాధన; దీనితో పాటు బ్రహ్మవిద్య. బ్రహ్మవిద్యలో — తత్త్వజ్ఞానం, మనోనాశనం, వాసనాక్షయం — ఇవి మూడూ అవసరమని ఇదివరకే చెప్పాను. ఈ మూడూ పూర్తిగా సిద్ధించనిదే మోక్షం పొందలేరు.
కొంతమంది ఏమనుకుంటారంటే — “గురువుగారు ఉపదేశించారు, నేను గంటల తరబడి సాధన చేస్తాను; నాకు ఈ శ్లోకాలు, ఇవన్నీ అవసరం లేదు. నాకు సాధన మీదే మనసు ఉంది.” నిజమే, సాధన చెయ్యి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే — నీవు అనేక జన్మల నుంచి వచ్చావు; నీ సంస్కారం ఏమిటో, నువ్వు ఎలా ఉన్నావో, భావికాలంలో నీకు ఉండే ప్రమాదాలు ఏమిటో — అవన్నీ నాశనం కావాలనుకుంటే శాస్త్రజ్ఞానం తెలియాలి. శాస్త్రజ్ఞానం అంటే గురువు చెప్పిన మాటలు వినాలి. అవన్నీ తెలుసుకుంటేనే గాని ప్రయోజనం లేదు.
కొంతమంది సాధకులు “నేను తేజస్సును చూస్తున్నాను” అంటారు. చూడవచ్చు, సరే; అది మంచిదే, శుభసూచకమే. అంతమాత్రాన మోక్షానికి వెళ్లిపోతామని మాత్రం ఎప్పుడూ కలగనవద్దు. ఎందుకంటే ఇది అద్వైత శాస్త్రం. అద్వైత శాస్త్రం అంటే — సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్త్వం (Omniscience, Omnipresence, Omnipotence) — ఈ మూడు గుణాల స్థితికి నీవు వెళ్లాలి. నీకు సర్వజ్ఞత్వం సిద్ధించి ఉండాలి; అలాగే సర్వవ్యాపకత్వం — నువ్వు సర్వవ్యాపకమైన వస్తువుగా చేరాలి; సర్వశక్తిమత్త్వం — సకల శక్తి, అంటే ప్రకృతిశక్తి అంతా నీకు స్వాధీనమై ఉండాలి. ఈ మూడూ స్వాధీనమై, నీవు ఆ స్థితికి వెళ్తేనే మోక్షం. అంతేగాని, “ఏదో ప్రకాశం చూశాను, నాకు గురువు అవసరం లేదు” అనుకుంటే అది చాలా ప్రమాదం.
గురువాక్య పాలనం
మీరందరూ — నేను చెప్పేది నా అనుభవమే చెప్తున్నాను — ఎప్పుడూ గురువును అంటిపెట్టుకొని ఉండాలి; వినయవిధేయతలు ఉండాలి.
గురుమూర్తిం స్మరేన్నిత్యం గురునామ సదా జపేత్ |
గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యం న భావయేత్ ||
“గురుమూర్తిం స్మరేన్నిత్యం” — గురుస్మరణ చేస్తూ ఉండాలి. “గురునామ సదా జపేత్” — ఎప్పుడూ గురునామజపం చేస్తూ ఉండాలి. “గురోరాజ్ఞాం ప్రకుర్వీత” — గురువు చెప్పినట్లు వినాలి. కొంతమంది గురువు మాటను ధిక్కరిస్తున్నట్లు వాళ్లకే తెలియదు. గురువు ఒక మాట ఎందుకు చెప్పారని అడగనక్కర్లేదు — “You have to obey”, అంతే.
అయితే, గురువు గురువు అన్నారని — గురువుకు కూడా నియమనిబంధనలు ఉంటాయి. అద్వయతారకోపనిషత్తులో చెప్పారు —
ఆచార్యో వేదసంపన్నో విష్ణుభక్తో విమత్సరః |
యోగజ్ఞో యోగనిష్ఠశ్చ సదా యోగాత్మకః శుచిః ||
బ్రహ్మవిద్యా ఉపనిషత్తుల ప్రకారం, అందరూ గురువులు కారు. ప్రతిదానికీ ఏదో ఒక విద్య చెప్తే గురువు అని కాదు. గురువులలో నిషిద్ధ గురువులు ఉన్నారు, బోధ గురువులు ఉన్నారు, బ్రహ్మగురువులు ఉన్నారు — ఇలా ఆరేడు రకాల గురువులు ఉన్నారు. ఈ బ్రహ్మవిద్యా సంప్రదాయ ప్రకారంగా, గురువు వేదాన్ని సరిగా చెప్తున్నారా, సాధనను సరిగా చెప్తున్నారా, లేక అతిక్రమిస్తున్నారా అనేది ఋషిమండలి అంతా పైనుంచి చూస్తూనే ఉంటారు. కాబట్టి గురువు కూడా ఎక్కడా అతిక్రమించడానికి వీలులేదు. అటువంటి, అతిక్రమించని గురువు చెప్పినట్లు శిష్యుడు తప్పనిసరిగా వినాలి.
కర్మణా మనసా వాచా నిత్యమారాధయేద్గురుమ్ |
దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ ||
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదమ్ |
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా ||
“ధ్యానమూలం గురోర్మూర్తిః” — ఎప్పుడూ గురుధ్యానం చేస్తూ ఉండాలి. “పూజామూలం గురోః పదమ్” — గురుపాదమే పూజకు మూలం. “మంత్రమూలం గురోర్వాక్యం” — గురువు చెప్పిన మంత్రమే మంత్రం. మంత్రం అంటే ఏకాక్షర మంత్రం; ఇన్ని మంత్రాలు కావు.
ఏకాక్షర మహామంత్రం
సప్తకోటి మహామంత్రాః చిత్తవిభ్రమకారకాః |
ఏక ఏవ మహామంత్రో గురురిత్యక్షరద్వయమ్ ||
అని గురుగీత, ఇతర గ్రంథాలు కూడా చెప్తున్నాయి. “సప్తకోటి మహామంత్రాః” — ఎన్ని మంత్రాలు ఉన్నప్పటికీ, “చిత్తవిభ్రమకారకాః” — అవన్నీ చిత్తభ్రమను కలిగించేవే. “ఏక ఏవ మహామంత్రః” — మహామంత్రం ఒక్కటే ఉంది. “గురురిత్యక్షరద్వయమ్” — “గు”, “రు” అనే రెండక్షరాలే. ఆ “గురు” అంటే అర్థం — అంధకారాన్ని పోగొట్టే ప్రణవం, ఓంకారం, ప్రాణాయామం, యోగం. అదే గురుమంత్రం, ఏకాక్షర మంత్రం.
అటువంటి ఏకాక్షర మంత్రాన్ని ప్రదానం చేసిన మహాగురువును మనం అగౌరవపరిచామనుకోండి — దానికి చాలా చాలా దోషాలు ఉన్నాయి; అవన్నీ తరువాత చెప్తాను. ముందుగా గురువు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి — “కర్మణా మనసా వాచా నిత్యమారాధయేద్గురుమ్, దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ.”
సర్వ సమర్పణ భావం
తరువాత —
శరీరమర్థం ప్రాణం చ సద్గురుభ్యో నివేదయేత్ ||
శరీరం, అర్థం (ధనం), ప్రాణం — ఇవన్నీ సద్గురువుకు నివేదించాలి. శిష్యునికి తనదంటూ ఇంకేమీ మిగలకూడదు; అంతా గురువే, సర్వమూ. అయితే “శరీరం, అర్థం, ప్రాణం” అంటే ఆయనకు ధనం కావాలనో, ఈ ప్రాణం కావాలనో కాదు — దానికి సిద్ధపడి ఉండాలి, అంతే. అంతేగాని ఆయనకు ఏమీ అక్కర్లేదు.
గురవో బహవః సంతి శిష్యవిత్తాపహారకాః |
తమేకం దుర్లభం మన్యే శిష్యహృత్తాపహారకమ్ ||
అని గురుగీత చెప్తుంది. శిష్యుల ధనాన్ని అపహరించే గురువులు అనేకమంది ఉంటారు; కానీ శిష్యుల హృదయాన్ని అపహరించేవారు చాలా అరుదు. శిష్యుని హృదయం భౌతిక ప్రపంచం మీద ఉంది, ధనం మీద ఉంది. మరి ఆ మనసును ఇక్కడ అర్పించాలంటే ఏం చేయాలి? ఏ ధనం మీద మనసు ఉందో, ఆ ధనాన్ని కూడా అర్పించగలగాలి — అదే దాని అర్థం. అంతేగాని శిష్యుని ధనం తీసుకొని, “ఏమైపోతేనేం, నాకు అనవసరం” అనే విధంగా చెప్పింది కాదు. ఎప్పుడూ గురువు యొక్క బాగోగులను చూస్తూ ఉండాలి. గురుసేవ అంటే గురువు యొక్క భావశుశ్రూషలోకి వెళ్లాలి.
గురుపరీక్ష — నాలుగు మెట్లు
సేవలలో రకాలు ఉన్నాయి. నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నది, తరువాత నేను అనుభవించింది చెప్తాను, వినండి.
గురువు దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకున్న తరువాత గురువు పరీక్ష చేస్తారు. పరీక్ష అంటే — “ఇతనికి శ్రద్ధాభక్తులు ఉన్నాయా? నిజంగా మోక్షం కోసమే ఇతను సాధన తీసుకున్నాడా?” అని చూస్తారు. మొదటి మెట్టులో — శిష్యుడు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే “ఓ, మావాడు” అని బాగా పొంగిపోయి, చాలా ప్రేమగా వేదాంతం చెప్తూనే ఉంటారు.
కొన్నాళ్లు పోయిన తరువాత, రెండవ మెట్టులో — మిగతా శిష్యులు వస్తున్నప్పుడు గురువు ఇతణ్ణి పట్టించుకోకుండా ఉంటారు; వాళ్లతో తిరుగుతుంటారు, వాళ్లతో మాట్లాడుతుంటారు, ఇతణ్ణి పట్టించుకోరు. పట్టించుకోకపోయేసరికి “అదేంటి, గురువుగారు మొట్టమొదట నన్ను బాగా పొగిడారు, నన్ను బాగా చూశారు; మరి ఇప్పుడు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు” అనుకుంటాడు. అలా కొన్నాళ్లు గడుస్తాయి. గురువు “నువ్వెవరు?” అన్నట్లు పట్టించుకోకుండా ఉంటారు.
ఇక మూడవ మెట్టుకు వెళ్లేసరికి — “వీడు నేను ఎన్ని చేసినా సరే మంచి సక్రమ పద్ధతిలో నడుస్తున్నాడు, సాధన కూడా చేస్తున్నాడు, విడిచిపెట్టలేదు కదా” అనే ఉద్దేశంతో గురువు ఇక శిష్యుణ్ణి దూషించడం మొదలుపెడతారు. ఇది మూడవ మెట్టు; ఇది అతి దుర్లభమైన మెట్టు. మొదటి రెండు మెట్లు కొంత పర్వాలేదు; కానీ మూడవ దాని దగ్గరికి వెళ్లేసరికి గురువు శిష్యుణ్ణి ఎప్పుడూ దూషిస్తూనే ఉంటారు. “గురువుగారు నన్ను ఈ విధంగా దూషిస్తున్నారు” అని వెళ్లిపోయాడా — ఇక అంతే. కానీ అయినా సరే విడిచిపెట్టకుండా ఉంటే — గురువు ఒక పక్కనుంచి ఒక కంట కనిపెడుతూనే ఎన్ని రకాలుగానో శిష్యుణ్ణి దూషిస్తూనే ఉంటారు.
ఆ మూడవ మెట్టును గాని దాటాడంటే, ఇక సర్వకాల సర్వావస్థలలోనూ గురువు శిష్యుణ్ణి తన గుండెలో పెట్టుకుంటారు. అది నాలుగవ మెట్టు. నాలుగవ మెట్టుకు వెళ్లేవారు అరుదు; మూడవ మెట్టులోనే చాలామంది విఫలమవుతారు. మొదటి రెండు మెట్లలో కొంతమంది సాధకులు నెగ్గవచ్చు. ఇవన్నీ సాధనలో ఉండే ఒడిదుడుకులు.
నేటి కాలం — పూర్వపు గురుకులవాసం
ఇవన్నీ కాకుండా — “మా గురువుగారు చెప్పిందే సరైన మార్గమా? ఇంకా గొప్పవి ఏవైనా ఉన్నాయా? అంతకంటే గొప్పవి ఉన్నాయా?” అని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఏ గురువునూ నమ్మరు. ఈ మోడరన్ టెక్నాలజీ వచ్చిన తరువాత YouTube లోనూ, మిగతా వాటిలోనూ చూసి, అన్ని రకాల గురువులనూ తాకి, అందులో తమకు నచ్చినది తెచ్చుకొని, తమకు నచ్చిన సాధనలు నేర్చుకుంటారు. గురువును కూడా తామే పరీక్ష చేసుకొని, ఆయన నచ్చితే అప్పుడు ఆచరణలో పెడతారు. అలాంటి స్థితిలో ఉన్నారు ఇప్పటి శిష్యులు.
కానీ పూర్వం గురుకులవాసం ఉండేది. గురువు దగ్గర ఉండి చిరకాలం సేవ చేసిన తరువాత, కొన్నాళ్లకు ఒకానొకప్పుడు గురువుకు అనుగ్రహం కలిగి అప్పుడు సాధనను ఉపదేశం చేసేవారు. ఒకానొకప్పుడు గురువు తాము చెప్పకుండా తమ సతీమణికి చెప్పి, “నువ్వు వాడికి చెప్పేసెయ్” అని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అటువంటి స్థితి నుంచి ఇప్పుడు — గురువు దగ్గరికి శిష్యుడు వెళ్లటం కాకుండా, శిష్యుని దగ్గరికి గురువు వచ్చేటట్లుగా వాతావరణం కల్పించుకుంటున్నారు. కొంతమంది గురువులు కూడా “మీరు ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు, గురువుగారు మీ దగ్గరికే వస్తారు, ఆయనే అన్నీ చెప్తారు” అని చెప్తున్నారు. ఎప్పుడూ అలాంటి అహంకారం పడవద్దు. గురువు ఒకానొక సందర్భంలో శిష్యుని దగ్గరికి వచ్చినప్పటికీ, సాధన చేయవలసింది శిష్యుడే; గురువు కాదు గనుక — ఎప్పుడూ గురువుకు సాగిలపడి ఉండాలి.
సద్గురు లక్షణాలు
ఆ విధంగా గురువు యొక్క తత్త్వాన్ని అర్థం చేసుకోకపోతే కష్టం. గురువులు అనేక రకాలు ఉన్నారు. యోగి వేమన ఇలా చెప్పారు —
కల్ల గురుడు గట్టు నెల్ల కర్మంబులు |
మధ్య గురుడు గట్టు మంత్రచయము |
ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యంబు |
విశ్వదాభిరామ వినురవేమ ||
కొంతమంది గురువులు అనేక కర్మలు చెప్తారు — వేదోక్త కర్మలను, వాటి ద్వారా పొట్టపోషణ కోసం తయారుచేస్తూ, ఋగ్యజుస్సామాథర్వణ వేదాలలో ఉండే మంత్రాలన్నిటినీ నేర్చుకొని వాళ్లకు చెప్తూ, ఆ విధంగా పొట్టపోషణ కోసం అనేక రకాలు చెప్తున్నారు — “కల్ల గురుడు గట్టు నెల్ల కర్మంబులు.” “మధ్య గురుడు గట్టు మంత్రచయము” — మధ్యముడైన గురువు మంత్రాలు చెప్తారు. ఏమిటి మంత్రాలు? అనేక రకాలు — ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సప్తకోటి మహామంత్రాలు. ఈ మంత్రాలకు కూడా కొంత శక్తి లేకపోలేదు; కానీ మోక్షాన్ని ఇచ్చేది ఏకాక్షర మంత్రమే — ఓంకారం, ప్రణవం, ప్రాణాయామం. “ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యంబు” — ఉత్తమమైన గురువు యోగాన్ని చెప్తారు; యోగాన్ని చెప్పేవారే ఉత్తములు.
అయితే ఈ యోగం మళ్లీ సరైనదా కాదా అన్న సందేహాలు ఉంటాయి. దానికి మనకు కూడా కొంత జ్ఞానశక్తి ఉండాలి; లేకపోతే ఎవరు మంచి గురువులు, ఎవరు చెడ్డ గురువులు అని ఎంచుకునే శక్తి మనకు ఉండదు. అందుకనే శాస్త్రాలు గురువుకు ఉండవలసిన లక్షణాలను, శిష్యునికి ఉండవలసిన లక్షణాలను కూడా చెప్పాయి —
ఆచార్యో వేదసంపన్నో విష్ణుభక్తో విమత్సరః |
యోగజ్ఞో యోగనిష్ఠశ్చ సదా యోగాత్మకః శుచిః ||
“వేదసంపన్నః” — ఆయనకు వేదజ్ఞానం తెలిసి ఉండాలి. వేదజ్ఞానం అంటే వేదమంత్రాలు, వేదపనసలు కాదు; వేదాలలో చెప్పబడిన ఉపనిషత్సారాన్ని తెలుసుకున్న ఆచార్యుడు. “విష్ణుభక్తః” — సర్వాత్ముడైన విష్ణువు, పరమేశ్వరుని యందు భక్తి కలిగి ఉండటం. భక్తి కలిగి ఉండటం అంటే — అంతర్లీనంగా ఆ అంతర్జ్యోతిని దర్శనం చేసుకుంటూ, యోగసాధనతో కూడుకొని ఉండటం. ఎనిమిదవ అధ్యాయంలో చెప్పినట్లు —
భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ |
స తం పరం పురుషముపైతి దివ్యమ్ ||
ఆ విధంగా విష్ణువు యందు భక్తి కలిగి ఉండేవాడు. “విమత్సరః” — ఎప్పుడైతే తాను అంతర్లీనంగా ఆ అంతర్జ్యోతితో ఆనందిస్తూ ఉంటాడో, బయటి వ్యక్తులపైన జుగుప్స, ఈర్ష్య — అవేవీ ఉండవు. “యోగజ్ఞో యోగనిష్ఠశ్చ సదా యోగాత్మకః శుచిః” — ఈ మూడు గుణాలు చాలా ముఖ్యం; ఇవే అర్హతలు (qualifications). “యోగజ్ఞః” — అనేక యోగాలు ఉన్నాయి; ఆ యోగాలలో ఉత్తమమైనది అంతఃకరణశుద్ధిని కలిగించే యోగం. ఆ యోగాన్ని తెలుసుకొని, “యోగనిష్ఠః” — దాని యందు ఎప్పుడూ నిష్ఠతో తాను కూడా సాధన చేసుకుంటూ, “సదా యోగాత్మకః” — ఎప్పుడూ తన అంతఃకరణను శుద్ధం చేసుకుంటూ ఉండే గురువు ఉండాలి. అటువంటి లక్షణాలు ఉన్నవాడే గురువు అనిపించుకుంటాడు.
మిగతావారిలో యోగం అంటే తెలియకుండానే గురువు అనిపించుకున్నవారు ఉన్నారు. సరే, వారి గురించి విమర్శ మనకు కాదు. మనకు కావలసింది — సద్గురువులు. సద్గురువులు అంటే సత్ పదార్థాన్ని తెలియజేసేవారు; వారే గురువులు.
భక్తులు — శిష్యులు
మరి శిష్యుడు అంటే ఏమిటి? అందరూ శిష్యులు అనిపించుకోరు. భక్తులు, శిష్యులు అని రకాలు ఉన్నారు. గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నవాళ్లందరూ శిష్యులు కారు; వాళ్లందరూ మొదట భక్తులు మాత్రమే. భక్తులు అంటే — విద్యను తీసుకున్నారు, ఆచరిస్తున్నారు; కానీ గురువు మనసులోకి ఇంకా దూరలేదు. వారు గురువును తృప్తిపరచలేదు; గురువు యొక్క మన్ననను, ప్రసన్నతను — వారి సేవ ద్వారా గాని, భక్తితో కూడిన ప్రవర్తన ద్వారా గాని — పొందలేదు. వాళ్లందరూ భక్తులు మాత్రమే.
తరువాత కొన్నాళ్లకు బాగా సాధన చేసి, సేవ చేసి, అన్ని రకాలుగా గురువును తృప్తిపరచినవారు శిష్యులు అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన ఆ మూడు నాలుగు మెట్లకు ఎప్పుడైతే వెళ్తారో, వారు శిష్యులు అవుతారు. అటువంటివారి గురించి వివేకచూడామణిలో ఆదిశంకరాచార్యులవారు చెప్పారు —
మేధావీ పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణః |
అధికార్యాత్మవిద్యాయాం ఉక్తలక్షణలక్షితః ||
బ్రహ్మవిద్యను పొందడానికి మంచి మేధాశక్తి ఉండాలి. “మేధావీ పురుషో విద్వాన్” — అతనికి శాస్త్రజ్ఞానం యొక్క సారం తెలిసి ఉండాలి. “ఊహాపోహ విచక్షణః” — ఏది ఊహ, ఏది అపోహ, ఏది సరైనది, ఏది కాదు అనే విచక్షణజ్ఞానం కూడా ఉండాలి. “అధికార్యాత్మవిద్యాయాం” — అటువంటివాడే ఆత్మవిద్యకు అధికారి.
కాబట్టి ఉపదేశం తీసుకున్నవాళ్లందరూ “మేము శిష్యులు అయిపోయాం, గురువుగారు నాకు బంధింపబడ్డారు, నేనేదో కొంత దక్షిణ ఇచ్చేసి కొనేశాను” — అలాంటివి అనుకోకండి. బ్రహ్మవిద్యా సంప్రదాయ గురువుల తత్త్వాలు వేరు. నేడు ఈ యుగంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి కాబట్టి, పదిమందికి ఈ విద్యను తెలియజేయాలి కాబట్టి, గురువులు బయటకు రావలసి వస్తుంది. కానీ గురువులు ఎప్పుడూ బయటకు రారు; గురువుల దగ్గరికే అందరూ వెళ్లాలి. ఆ విధంగా సద్గురువులను తెలుసుకోవాలి — “కల్ల గురుడు గట్టు నెల్ల కర్మంబులు, మధ్య గురుడు గట్టు మంత్రచయము, ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యంబు.”
గురువును నొప్పించకూడదు
అదేవిధంగా గురువును ఎప్పుడూ నొప్పించకూడదు —
నరుని పుడమిలోన నింద చేసిననేమి |
మంచివాడటంచు మెచ్చనేమి |
గురుని నొప్పించక గురి తప్పకుండరా |
విశ్వదాభిరామ వినురవేమ ||
ఆ మహానుభావులు, మహాయోగపురుషులు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. ఈ ధర్మాలు పాటిస్తేనే గాని మన విద్య రాణించదు. యోగసాధన కొంత బాగా చేయవచ్చు; కానీ మిగతా ధర్మాలు పాటించకపోతే వాళ్లు రాణించలేరు. కొంతమందికి శాస్త్రజ్ఞానంలో మంచి పట్టు ఉండవచ్చు; కానీ సాధన ఉండాలి, గురువు యందు భక్తి ఉండాలి.
“నరుని పుడమిలోన నింద చేసిననేమి” — మిగతావాళ్లందరూ “వీడు చెడ్డవాడు” అని అనుకున్నా పర్వాలేదు. “మంచివాడటంచు మెచ్చనేమి” — “ఆయన మంచివాడు” అని ఎంతమంది మెచ్చుకున్నా పర్వాలేదు. కానీ “గురుని నొప్పించక గురి తప్పకుండరా” — గురువును బాధించకుండా, గురి తప్పకుండా ఉండాలి. గురువును ఎప్పుడూ నమ్ముకొని ఆ విధంగానే ఉండాలి సుమా అని చెప్పారు.
అంతేకాకుండా, శరీరధారియైన గురువు నుంచి లోపలి తేజోగురువు దగ్గరికి తీసుకువెళ్లారు మళ్లీ యోగి వేమనగారే —
కండ్లు మింటగట్టి గురునందు చేర్చిన |
గురుడు చిత్కళలను కండ్లకిచ్చు |
ఉన్నతావునున్న ఊరకే వచ్చురా |
విశ్వదాభిరామ వినురవేమ ||
ఈ విధంగా గురువు అంటే శరీరధారియైన గురువు, తరువాత అంతర్లీనంగా ఉన్న తేజోగురువు — ఈ రెండింటినీ సంబంధించి చెప్తున్నారన్నమాట. “కండ్లు మింటగట్టి గురునందు చేర్చిన” — మన కళ్లను పైకి నిలపాలి. పైన పెట్టాలని ఎందుకు అంటున్నామంటే — మన సాధనలో ఉత్తరోత్తరా ఆ బ్రహ్మాండాన్ని అనుభవించాలంటే ముందు కళ్ల ద్వారానే, పైకి వెళ్లి, దానిని అనుభవించాలి. అందువలన అలా చేస్తూ ఉంటే — “గురుడు చిత్కళలను కండ్లకిచ్చు” — ఆ తేజోగురుడు కళ్లలోకి చిత్కళలను ఇస్తాడు. అంటే కళ్లలోంచి ఆ ప్రకాశం కనబడుతూ ఉంటుంది. ఆ ప్రకాశం కనబడుతుంటే, ఆ ప్రకాశాన్ని మళ్లీ తనలో తానే చూసుకుంటాడు — “స్వయమేవాత్మనాత్మానం”, “స్వయమేవ ఆత్మారామే సుఖం వసేత్” అన్నారు. తనను తాను చూసుకునే విధంగా గురువు ఈ మార్గాన్ని ఇస్తాడు.
“ఉన్నతావునున్న ఊరకే వచ్చురా” — మనం ఎక్కడ ఉన్నాం? మన జీవుడు ఇప్పుడు ఈ హృదయం దగ్గర ఉన్నాడు. జీవుడు ఇక్కడే ఉంటే మనకేమీ రాదు; ఇక్కడినుంచి పైకి వెళ్లాలి. పైకి వెళ్లాలంటే గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి.
గురువే తారకుడు
అందుకని —
కులం ధనం బలం శాస్త్రం బాంధవాః సోదరా ఇమే |
మరణే నోపయుజ్యంతే గురురేకో హి తారకః ||
గురుతారక తత్త్వం ఎంతటిదంటే — గురువు ఎంతగా రక్షిస్తాడంటే — నీ కులం నిన్ను రక్షించలేదు, బలం రక్షించలేదు, ధనం రక్షించలేదు, బంధువులు రక్షించలేరు, నీ శాస్త్రజ్ఞానం కూడా రక్షించలేదు. “మరణే నోపయుజ్యంతే గురురేకో హి తారకః” — ఆ మరణ సమయంలో, ఆ ఆపదలో కూడా నిన్ను రక్షించేది నీ గురువే. అంతటి ఉత్తమోత్తమ స్థానం గురువుకు ఉన్నది.
అటువంటి గురువును ఎలా చూడాలి? అంతగా చూడాలి —
మునిభిః పన్నగైర్వాపి సురైర్వా శాపితో యది |
కాలమృత్యుభయాద్వాపి గురూ రక్షతి పార్వతి ||
మునులు శపించుగాక, పాములు కరచుగాక, సర్పదోషాలు ఉండుగాక, దేవతలే శపించుగాక — “కాలమృత్యుభయాద్వాపి గురూ రక్షతి పార్వతి” — కాలమృత్యువు నుంచి కూడా గురువే రక్షిస్తాడు, ఓ పార్వతీ! అంతటి శక్తి గురువుకు ఉన్నది. అది మామూలుగా కనబడదు —
నరవద్ దృశ్యతే సాక్షాత్ శ్రీగురుః పాపకర్మిణామ్ |
శివవద్ దృశ్యతే సాక్షాత్ శ్రీగురుః పుణ్యకర్మిణామ్ ||
అని గురుగీతలో చెప్పారు. గురువు నరునిగా కనిపించినప్పటికీ, నరునిగానే ఎవరైతే చూస్తారో — వాడు పాపకర్ముడు. “శివవద్ దృశ్యతే సాక్షాత్ శ్రీగురుః పుణ్యకర్మిణామ్” — సాధన చేస్తూ అంతర్లీనంగా వెళ్తున్నప్పుడు, తనకు జ్ఞానోదయం కలుగుతుండగా గురువు శివునిగా కనబడతాడు; విష్ణువుగా కనబడతాడు; కృష్ణునిగా కనబడతాడు. ఎంత విశ్వాసం, ఎంత సాధన ఉంటే, గురువు అంతగా కనబడతాడు. లేకపోతే సామాన్య గురువుగా, మామూలు మానవునిగా చూస్తాడు. ఈ విధంగా మనిషి దృష్టి అతని సాధనను బట్టి ఉంటుంది.
తొందరపాటు తగదు
అందువల్ల సాధన దొరికినంత మాత్రాన ఎవ్వరూ ఒంటరిగా (individual గా) ముందుకు వెళ్లలేరు. నీవంతా గురుసాన్నిధ్యంలో పెరగాలి. ప్రతి సన్నివేశంలో, ప్రతి దృష్టిలో కూడా నీ సాధన యొక్క మెట్లు ఉంటాయి.
కొంతమంది “నేను ఈ సాధన చేస్తున్నాను, ఇలాగే కిందకీ పైకీ చేస్తున్నాను కదా, మరి నేను ఇంకెప్పుడు, ఎలా వెళ్తాను? ఇదేనా ఉంది, ఇంకేమైనా ఉందా?” అంటారు. ఇది అంత వేగంగా అయ్యే పని కాదు. మీరు ఇప్పుడే స్కూల్లో చేరారు — చదవండి. మామూలు భౌతిక విద్యలలోనే ఎన్నో సంవత్సరాలు చదివితేనే గాని, స్కూలు వదిలిపెట్టిన తరువాత మరికొంత ప్రయత్నం చేస్తేనే గాని ఉద్యోగం దొరకదు. కానీ “ఇప్పటినుంచే ఉద్యోగం దొరుకుతుందా? నాకు సిద్ధులు కలుగుతున్నాయా? నేను ఇంకా పైకి వెళ్లి ప్రదర్శిస్తానా?” అనే విధంగా చాలామంది అనుకుంటారు.
ఇది బ్రహ్మవిద్య. బ్రహ్మవిద్య అనేది చాలా గొప్ప విద్య; చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అతి విలువైన మణిరత్నం — బ్రహ్మవిద్యా సంప్రదాయ గురువుల ద్వారా వచ్చింది. అర్హులైన కొంతమందికి ఇవ్వడం జరిగింది. దానిని నిలుపుకోవాలి; నిలుపుకోకపోతే చాలా ప్రమాదం వచ్చిపడుతుంది.
గురునింద — శాస్త్ర హెచ్చరికలు
హుంకృత్య త్వంకృత్య గురుం నిర్జిత్య వాదతః |
అరణ్యే నిర్జలే దేశే భవతి బ్రహ్మరాక్షసః ||
గురువును “నీవు” అని, హుంకరించి, వాదంలో జయించి — ఎవరైతే ఇలా ఉంటారో, వారు నీళ్లు లేని అరణ్యప్రదేశంలో బ్రహ్మరాక్షసునిగా పుడతారు. ఇవన్నీ ఎవరినో భయపెట్టడానికి కాదు; శాస్త్రం అలా చెప్తుంది.
యస్తు జ్ఞాత్వా మహాదేవి గురునిందాం కరోతి చేత్ |
స యాతి నరకం ఘోరం యావచ్చంద్రదివాకరౌ ||
అని ఇంకా గురుగీతలోనే ఉంది. ఈ విధంగా గురుతత్త్వాన్ని తెలిసి కూడా ఎవరైతే గురువును నిందిస్తారో, వారు సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఘోరమైన నరకాన్ని అనుభవిస్తారు.
ఇవన్నీ ఎవరినీ భయపెట్టడానికి కాదు. మంచి పవిత్రమైన బ్రహ్మవిద్యను పదిలంగా కాపాడుకుంటే — గురువుకు ఉన్నంత ప్రేమతత్త్వం ఈ సృష్టిలో ఎవరికీ ఉండదు. తల్లిదండ్రులైనా సరే ఒకానొకప్పుడు తృణీకరించవచ్చు; కానీ గురువు మాత్రం ఎప్పుడూ తృణీకరించడు. గురువు యొక్క తత్త్వం శాంతత్వం — శాంత స్వభావం. ఆ శాంత స్వభావాన్ని ఎవరైతే గ్రహిస్తారో, వారే దానిని శుద్ధం చేసుకోగలరు, దానిని ఏకీకృతం చేసుకోగలరు.
లేనివాళ్లు — రాక్షస ప్రవృత్తి కలిగినవారు కూడా కొంతమంది ఈ విద్యను తీసుకొని దానిని దుర్వినియోగం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటివాళ్లు నిషిద్ధ గురువులు అవుతారు, నిషిద్ధ శిష్యులు కూడా అవుతారు. కొంతమంది నిషిద్ధ గురువుల దగ్గరే ఉపదేశం తీసుకొని ఉన్నారు; అటువంటివాళ్లు నిషిద్ధ శిష్యులు అవుతారు. అంటే గురువును మన్నించకుండా, గురువుకు చేయవలసినది చేయకుండా ప్రవర్తించినవాళ్లు —
నిషిద్ధగురుశిష్యస్తు దుష్టసంకల్పదూషితః |
బ్రహ్మప్రళయపర్యంతం న పునర్యాతి మర్త్యతామ్ ||
నిషిద్ధ గురువుల దగ్గర ఉపదేశం తీసుకున్నా, లేదా తానే నిషిద్ధ గురువుగా మారినా — అలాంటివాళ్లందరికీ బ్రహ్మప్రళయం వరకు మళ్లీ మానవజన్మ దొరకదన్నారు. అంటే ఎంత ప్రమాదమో ఈ విధంగా చెప్తున్నారు.
అలాగే గురుతత్త్వం గురించి —
గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః |
ఏకాక్షరప్రదాతారం యో గురుం నాభినందతి |
తస్య శ్రుతం చ జ్ఞానం చ స్రవత్యామఘటాంబువత్ ||
గురువే పరమధర్మం, గురువే పరమగతి. ఏకాక్షర మంత్రాన్ని ప్రదానం చేసిన గురువును ఎవరైతే అవహేళన చేసి, అశ్రద్ధ చేసి, అవమానిస్తారో, లేక గౌరవించరో — వారు విన్న జ్ఞానం గాని, చేసిన తపస్సు గాని, పచ్చికుండలో నీరు కారిపోయినట్లు కారిపోతుంది సుమా!
ఇవన్నీ శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. హెచ్చరించడానికి కారణం ఏమిటంటే — “జాగ్రత్తగా ఉండు సుమా! పవిత్రమైన అటువంటి ధనాన్ని నువ్వు స్వీకరించావు; దానిని పదిలపరుచుకో.” లేకపోతే అటువంటి గురువును అవమానపరిచినవాళ్లకు —
శ్వానయోనిశతం గత్వా చండాలేష్వభిజాయతే ||
నూరు కుక్కజన్మలు ఎత్తిన తరువాత, ఆ నూరు జన్మల తరువాత చండాలునిగా పుడతాడని కూడా ఉంది — గురువును అగౌరవపరిచి నిందించినందుకు. “ఇలాంటి బాధలు, శాపాలు ఉంటే ఈ విద్య తీసుకోవడమే మానేస్తాను” అనుకునేవారు కూడా ఉన్నారు.
ఎప్పుడూ గుర్తుంచుకోండి — మనం తరించడానికి గురు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం కావాలి. అందువల్ల గురువు ప్రత్యక్ష దైవం. అందుకనే —
న గురోరధికం కశ్చిత్ న గురోరధికం తపః |
శివశాసనతః శివశాసనతః శివశాసనతః ||
అని ముమ్మాటికీ మూడుసార్లు చెప్పారు — “ఓ పార్వతీదేవీ, నా మాటను ధిక్కరించినవాళ్లకు ఇక గతి లేదు; ఇది ముమ్మాటికీ శాసనం, శాసనం” అని చెప్తున్నారు.
ప్రశ్నించే విధానం — నా అనుభవం
అందువల్ల — దీనిని అవకాశంగా తీసుకొని గురువు శిష్యుణ్ణి భయపెట్టడం అని కాదు అక్కడ అర్థం. దీనిని సక్రమ పద్ధతిలో తీసుకోవాలి. శిష్యునికి స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కు ఉపదేశం పొందేవరకు మాత్రమే. పొందిన తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి; సందర్భాన్ని చూసుకొని, తెలుసుకొని మాట్లాడాలి. అంతవరకు తెలియకుండా ప్రశ్నలు వేశాం — సరే.
నేను గురువుగారిని ఒకే ఒక్క రోజు ప్రశ్నలు వేశాను. వారి దగ్గర 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ప్రశ్నలు వేయలేదు. కాకపోతే నాలో ఉండే ప్రశ్నలు ఏమిటో వారికి తెలుసు గనుక, ఎప్పుడు ఏది అవసరమో అదే చెప్పేవారు. ఒకే ఒక్క రోజు మాత్రం వారు నాకు ప్రశ్నలు వేసే అవకాశం ఇచ్చారు. మామూలుగా నేను ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పడం — అలా ఒకే రోజు, ఒకే పూటలో వెయ్యి ప్రశ్నలు నా చేత వేయించారు. ఆ వెయ్యి ప్రశ్నలకూ — గోడకు బంతి కొడితే తిరిగి వచ్చినట్లుగా — వెంటవెంటనే సమాధానాలు చెప్పేవారు. దానితోనే నేను మౌనం దాల్చాను. ఇక నేను వారిని అడగవలసిన ప్రశ్న లేదు — ఎందుకంటే నాకు ఏం కావాలో వారికి తెలుసు.
తొందరపడవద్దు. కొంతమంది ఏమనుకుంటారంటే — “నా నేచర్ ఇంతే, నా స్వభావం ఇంతే; నా మనసులో ఏదుంటే అది అడిగేస్తాను” అంటారు. నీ మనసు ఏమిటి, నీ స్వభావం ఏమిటి, అడిగేయడం ఏమిటి? అలాంటి స్వభావం ఉంటే మార్చుకో, మార్చుకో. అడిగేసినంత మాత్రాన నువ్వు గొప్పవాడివి కావు; నీ స్వభావమే తప్పు. అది అడిగేయడం గొప్పతనం కాదు. నీ మనసులో ప్రశ్న ఉంటే, లోపల నువ్వే సాధన చేసుకొని శాంతంగా ఆలోచిస్తే నీకు సమాధానం దొరుకుతుంది. దొరకలేదా — అప్పుడు సందర్భాన్ని అనుసరించి ప్రశాంతంగా గురువును ప్రశ్నిస్తే సమాధానం చెప్తారు.
సాధనా రహస్యాలు — గురువు వద్దనే తాళం
సాధనలో అనేక రహస్యాలు ఉన్నాయి, అనేక మెట్లు ఉన్నాయి. ఈ యోగవిద్యను మిగతా యోగాలన్నిటికంటే నేరుగా (direct గా) చెప్పేస్తున్నారు కాబట్టి “మనకు ఇంకేమీ లేదు” అనుకోవద్దు. ఇది ప్రథమం మాత్రమే — దీక్ష (initiation) మాత్రమే. ఇది చేస్తూ ఉండగా దీనికి అనేక సాధనా రహస్యాలు ఉంటాయి. అవన్నీ గురుప్రసన్నత మీదనే బయటపడతాయి. గురువు చెప్దామన్నా చెప్పలేరు; గురువు ప్రసన్నులయ్యేటట్లుగా (please అయ్యేటట్లుగా) శిష్యుడు ప్రవర్తించాలి.
గురువుగారు ఒక విషయం చెప్పేవారు — “డాక్టర్, గురువు ఇచ్చిన విద్య — ఇచ్చిన తరువాత కూడా దాని తాళం నా దగ్గరే ఉంటుంది, తెలుసా?” అన్నారు. ఏమిటి ఆ తాళం అంటే — గురువు ఇచ్చిన విద్యను శిష్యుడు సరిగ్గా ఆచరిస్తున్నాడా లేదా అనేది చూసి, ఆయన ప్రసన్నులై తృప్తి చెందిన తరువాతనే కొన్ని రహస్యాలను బయటకు చెప్తారు. లేకపోతే అక్కడే దాచుకుంటారు.
అష్టసిద్ధులు కలుగుగాక — కానీ గురువు దగ్గర అవి పనికిరావు.
అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహ ||
నీవు సిద్ధి పొంది అద్వైతాన్ని పొందవచ్చు; కానీ గురుసన్నిధిలో మాత్రం గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. శిష్యుడు ఎప్పుడూ శిష్యుడే.
దీనికి మన గురుసంప్రదాయంలోనే ఒక ఉదాహరణ ఉంది. మన పరమగురువులైన శ్రీ శివానంద పరమహంసవారు మంగళూరు వెళ్లినప్పుడు, మన గురువుగారి సహాధ్యాయులైన భగవాన్ నిత్యానంద పరమహంసవారు కూడా అదే మంగళూరులో ఉండేవారు. కొన్ని సంఘటనల వలన గురువుకు కోపం వచ్చి శిష్యుని శక్తిని లాగేశారు. లాగేసిన తరువాత నిత్యానందులవారు శక్తిహీనులైపోయారు. అటువంటి సందర్భంలోనే ఆ నిత్యానందులవారిని తమ ఒడిలో పెట్టుకొని, “నాయనా, నాకేం కోపం లేదు” అని మళ్లీ తిరిగి రక్షించారు. అలాంటి సందర్భాలు ఉంటాయి.
సద్యఃఫలం — ప్రదర్శన పనికిరాదు
అందువల్ల ఎక్కడా తేలికగా తీసుకోవద్దు. ఇది మిగతా విద్యలకంటే గొప్ప విద్య — ఎందుకంటే దీనితో అన్నీ కలుగుతాయి. ఇది సద్యఃఫలితం — వెంటవెంటనే ఫలితాలు కలుగుతుంటాయి. అంతమాత్రాన “ఏదో పైకి వెళ్లిపోయి ఏదో పరీక్ష (test) చేద్దాం” అనుకోవద్దు. నువ్వు ఎంతగా ప్రదర్శిస్తావో, అంతగా ఇంకా కిందకే వెళ్తావు. ప్రదర్శన ఏమాత్రం పనికిరాదు. ఏమీ తెలియనివాళ్లలాగే ఉండాలి.
అద్వయం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్ ||
అని ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు — అద్వైత స్థితిని పొంది కూడా జడునివలె లోకంలో ప్రవర్తించాలి. ఇవన్నీ హెచ్చరికలు.
సాధన కూడా ఎంతటిదంటే — వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఎంత ఫలితాన్ని అంటే, మీకు మొదటి శ్వాస నుంచే ఫలితాన్ని ఇస్తుంది.
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః ||
నిరంతరం మనలో ఈ కఫం అనేది మృత్యురూపంలో పేరుకుపోతూనే ఉంటుంది. దానిని శుభ్రం (clean) చేసుకోవాలనుకుంటే మన కర్తవ్యం ఈ సాధన చేయటం. మనకు అతి సన్నిహితంగా — బంధువులందరికంటే సన్నిహితంగా — ఉండేది ఏమిటి? మన మృత్యువే. అది ఎక్కడ ఉంది? మన శ్వాసలో. శ్వాస కిందకు వెళ్తే మృత్యువు; పైకి వెళ్తే “తమసో మా జ్యోతిర్గమయ” — పైకి వెళ్తే జ్యోతి కలుగుతుంది. అంటే గురువు ఇచ్చిన విద్య నీలోనే ఉంది. నువ్వు సరిగ్గా సాధన చేశావా — మృత్యువును దాటి నువ్వు బ్రహ్మస్వరూపుడవు అవుతావు. వదిలిపెట్టి దుర్వినియోగం చేశావా — నిన్ను పాతాళంలోకి తీసుకువెళ్తుంది సుమా అని శాస్త్రాలు అనేక రకాలుగా చెప్తున్నాయి.
నిషిద్ధ గురువు దగ్గర ఎక్కడా సాధన తీసుకోవద్దు. నిషిద్ధ గురువుకు బ్రహ్మప్రళయ పర్యంతం మానవజన్మ దొరకదని శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటివాళ్లు నూరు కుక్కజన్మలు ఎత్తిన తరువాత చండాలునిగా జన్మిస్తారని కూడా చెప్పబడి ఉన్నది.
సులభుడైన గురువు
ఇవన్నీ హెచ్చరికలు, warnings ఇస్తున్నప్పటికీ — ఇది అత్యంత సులభతరమైన విద్య.
చక్షుర్గమ్యం గురుం త్యక్త్వా శాస్త్రగమ్యం తు యః స్మరేత్ |
హస్తస్థముదకం త్యక్త్వా ఘనస్థమభివాంఛతి ||
ఎదురుగా ఉండే గురువును విడిచిపెట్టి, “శాస్త్రంలో గురువు ఇక్కడున్నాడో అక్కడున్నాడో తెలుసుకుందాం” అనుకోవటం ఎటువంటిదంటే — అరచేతిలో ఉన్న నీటిని తాగడం మానేసి, మేఘంలో ఉన్న నీటిని తాగుదాం అనుకోవటం వంటిది. మేఘంలో నీరు ఉంది, సరే; కానీ అరచేతిలో ఉన్న నీరు తాగడం మానేసి మేఘంలోని నీటి కోసం ప్రయత్నం చేసేవాడి వంటివాడు అతడు. గురువును సద్వినియోగం చేసుకోవాలి.
అలాగే సులభంగా లభించిన గురువును వదిలిపెట్టటం — ఎదురుగా ఉన్న ధనాన్ని తీసుకోవటం మానేసి, భూమిలో ఉన్న నిక్షేపాలను తవ్వడానికి ప్రయత్నం చేసేవాడితో సమానం సుమా. గురువు అత్యంత సులభుడు.
అయితే గురువుకు కోపం రాకుండా చూసుకోవాలి —
శివే రుష్టే గురుస్త్రాతా గురౌ రుష్టే న కశ్చన ||
శివుడు — బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు — మనకు అతి ప్రధానమైన, గొప్పవారు. అటువంటి శివునికి కోపం వచ్చినా సరే గురువు అభయహస్తంతో రక్షిస్తాడట. “శివే రుష్టే గురుస్త్రాతా” — శివునికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు. “గురౌ రుష్టే న కశ్చన” — గురువుకు కోపం వస్తే ఎవరూ రక్షించలేరు. ఎందుకు? ఆయన సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు. దాని అర్థం ఏమిటంటే — ఆయనకు అసంతృప్తి కలిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు; బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఏమీ చేయలేరు.
అందువలన ఇటువంటి నియమనిబంధనలతో కూడిన ఈ బ్రహ్మవిద్యను సద్వినియోగం చేసుకోవాలి. ఈ బ్రహ్మతత్త్వాన్ని, గురుతత్త్వాన్ని — నిరంతరం గురుస్మరణతోనే ఉండాలి. గురుస్మరణ అంటే — రూపాన్ని స్మరించాలి, సాధన చేస్తూ ఉండాలి; తరువాత ఎప్పటికప్పుడు గురువుతో మాట్లాడుతూ, సంభాషిస్తూ (interact అవుతూ) ఉండాలి; తన పురోగతి (progress) ఎంతవరకు ఉందో తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు — జన్మజన్మల నుంచి సాధించలేనిది, ఈ జన్మలోనే అనేక సాధనలు చేసినప్పటికీ సాధించలేనిది — అతి తక్కువ కాలంలో, అతి శీఘ్రంగా మీరు సాధించగలరు.
రాజవిద్య — ప్రత్యక్షావగమం
ఇటువంటి బ్రహ్మవిద్య సద్యఃఫలితాన్ని ఇస్తుంది.
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||
“సుసుఖం కర్తుమ్” — చేయడానికి సులభం, కానీ అత్యంత ఫలితాన్ని ఇచ్చేది ఇది. ఇది చాలా సులభమైనది; వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. వెంటనే ఫలితం అంటే అర్థం ఏమిటంటే — మన శ్వాస కిందకు వెళ్లిపోతున్నది. ప్రతి ఒక్కరికీ ఉపదేశం ఇచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నారు — మొట్టమొదట శ్వాసను పైకి లాగడం కష్టమవుతుంది. ఎందుకంటే అంతవరకూ జీవుడు కిందకే వెళ్లిపోతున్నాడు. ఆ కిందకే వెళ్తున్న మార్గంలో — మీరు ఉపదేశం పొందలేదనుకోండి — జీవుడు అలాగే పోతాడు; మిగతావాళ్లందరూ అలాగే పోతున్నారు. ఇప్పుడు మనం వ్యతిరేక దిశలో నడిపించి దానిని శుభ్రం చేయడానికి వెళ్తున్నాం. అందువల్ల ఆ ఫలితాన్ని మొట్టమొదటే తెలుసుకుంటారు గనుక — “అయ్యో! నేను ఈ విధంగా కిందకు, అధోగతికి పాలవుతున్నాను; ఇటువంటి అమృతవిద్యను నా గురువుల ద్వారా పొందాను, కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి” అని గ్రహించాలి. ఏదో బజారులో దొరికిన విద్య కాదు ఇది.
ఇది ఎటువంటిదంటే — “హస్తస్థముదకం త్యక్త్వా ఘనస్థమభివాంఛతి” అని చెప్పడమే కాకుండా —
హస్తస్థం కౌస్తుభం త్యక్త్వా అన్యరత్నం గవేషతే ||
చేతిలో ఉన్న కౌస్తుభమణిని విడిచిపెట్టి బయట రత్నాల కోసం ప్రయత్నం చేసేవాడి వంటివాడు. కౌస్తుభమణి మనలోనే ఉంది; అటువంటి కౌస్తుభమణి రత్నాన్ని గురువు ఇచ్చాడు. దానిని జాగ్రత్తగా నిరంతరం ఉపయోగించుకోవాలి.
జ్ఞానం — కర్మఫల త్యాగం
ఇలా చేసుకుంటుంటే సాధనలో తర్ఫీదు కావటమే కాకుండా, మన మనసు మారాలి; జ్ఞానపరంగా తెలుసుకోవాలి. ఈ శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే — మనం ఎన్నో జన్మల నుంచి అజ్ఞాన స్థితిలో అనేక సంస్కారాలతో, అనేక కర్మలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. వాటన్నిటినీ మనం దగ్ధం చేయాలి. దగ్ధం చేయాలంటే మనకు జ్ఞానం కావాలి. ఒక పక్క జ్ఞానం కావాలి; మరొక పక్క — ఇప్పుడు కర్మఫలాన్ని అనుభవిస్తూ, మళ్లీ భవిష్యత్తులో కర్మఫలం అంటకుండా ఉండటం కోసం — మనసును గనుక నిగ్రహించాలి.
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ ||
అని భగవద్గీత ఐదవ అధ్యాయంలో చెప్పారు. అందువల్ల నిత్యజీవిత కార్యక్రమంలో మీరు ఏ కర్మ చేసినప్పటికీ దాని ఫలితం మీకు అంటకుండా ఉండాలనుకుంటే, ఈ యోగసాధన చేయాలి. ఈ యోగసాధనే గురుమంత్రం. ఈ గురుమంత్రాన్ని సదా జపించాలి — “గురునామ సదా జపేత్, గురోరన్యం న భావయేత్” — గురుమంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ, గురువును అన్యంగా భావించకూడదు.
భజ గురు రామం భజ గురు రామం భజరే మనసా |
అజ హరి హరులకు అంతరంగ గురు గోప్యధనం విదితం మనసా ||
ఓ మనసా! ఆ గురుడు లోపల ఉన్నాడు; ఆయనే ఆత్మారాముడు. “భజ గురు రామం” — ఆ ఆత్మగురువును, ఆత్మారాముణ్ణి నువ్వు నిరంతరం భజన చెయ్యి. భజన చెయ్యి అంటే — లోపల ఆ విధంగా ధ్యానం చెయ్యి, సాధన చెయ్యి. “అజ హరి హరులకు అంతరంగ గురు గోప్యధనం” — త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా ఈ అంతరంగ గురువే గోప్యమైన ధనం.
అందువల్ల ఇంతవరకు మనం బయట అనేక రకాలుగా ఆరాధనలు చేశాం. ఆ ఆరాధనలన్నీ ఇంతవరకు ఒక రకమైన తృప్తిని ఇచ్చాయి — సరే, సరే. కానీ మోక్షమార్గాన్ని ఇచ్చేది అంతర్లీనమైన గురువిద్య. గురువు లేనిదే ఇది గుడ్డివిద్య అన్నారు. ఎందుకు?
ఆచారకోటి దానం చ గిరికాంచనమేవ చ |
ఆత్మతత్త్వం వినా నాస్తి ముక్తిర్నాస్తి గురుం వినా ||
మీరు ఎన్ని ఆచారాలు పాటించినా, కోటి దానాలు చేసినా, కొండంత బంగారాన్ని దానం చేసినా — ఆత్మతత్త్వం లేనిదే, గురువు లేనిదే ముక్తి లేదు అని గురుగీతలో చెప్పారు.
ఈ విధంగా సాధన చేస్తూ ఉండాలి; గురువు ద్వారా శాస్త్రసారాన్ని గ్రహిస్తూ ఉండాలి. మన సాధనను, గురువు చెప్పిన సాధనాసారాన్ని మనం ఏకీకృతం చేసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి. అలాంటప్పుడే మన మనసు —
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
అని ఆదిశంకరాచార్యులవారు చెప్పినట్లు ఉంటుంది.
ఆదిశంకరుల గురుభక్తి
ఆదిశంకరాచార్యులవారు గురువుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే — గురుపాదుకా స్తవంలో ప్రతి చరణంలోనూ —
ప్రాతరేవ హి మానసా భావయే గురుపాదుకామ్ ||
“నేను పొద్దున్నే లేచి ఆ గురుపాదుకలను స్మరిస్తాను.” గురుపాదుకలు అంటే బయట పాదుకలు ఉన్నాయి; లోపల గురుపాదస్థానం ఉంది. అక్కడ నిరంతరం గురువు పాదాలను నేను స్మరించుకొని సాధనకు వెళ్తాను సుమా — అని అద్వైత స్థాపన చేసిన ఆదిశంకరాచార్యులే చెప్పారు.
అలాగే గుర్వష్టకంలో ఏం చెప్పారు —
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే |
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
నీవు ఇన్ని సాధించు — వేదశాస్త్రాలు పఠించు, విదేశాలలో, స్వదేశాలలో కీర్తి పొందు, రాజువై అనేక రాజ్యాలను సంపాదించుకో, అందమైన భార్య ఉండవచ్చు, ధనం సంపాదించు — ఎన్ని ఉన్నప్పటికీ, “మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే” — మనసు గురుపాదపద్మాల యందు లగ్నం కానప్పుడు, “తతః కిం తతః కిం” — ఇంకేమి ప్రయోజనం? అని ఆదిశంకరాచార్యులంతటివారు చెప్పారు. ఈ ప్రపంచంలో ఆయనంత భక్తులు లేరు, ఆయనంత గురువు లేరు; ఆయనంత శిష్యులు లేరు, ఆయనంత గురువు లేరు. అటువంటి ఆదిశంకరాచార్యులు ఆచరణాత్మకంగా (practical గా), ప్రామాణికంగా చెప్పారు.
మన గురుదేవుల ఆచరణ
మన గురుదేవులు స్వామి రామానంద పరమహంసవారు అద్వైత స్థితిని పొందినప్పటికీ, ఇక్కడ గురుపీఠాన్ని స్థాపించి దానిని ఎంతగా ఆరాధించారంటే — నేను ప్రత్యక్షంగా చూశాను, చెప్తున్నాను — వారు ఇక్కడ మంచం దగ్గర పడుకొని లేచేటప్పుడు, కళ్లు మూసుకొనే తలుపు తెరిచి, ఇలా వెళ్లి, అక్కడ కళ్లు తెరిచి, ఆ గురురూపాన్ని ఒక్కసారి స్మరించుకొని, నమస్కారం చేసుకొని, అప్పుడు బయటకు వెళ్లేవారు. అయితే గురురూపం వారి మనసులో లేదా? ఉంది. అయినప్పటికీ ప్రత్యక్షంగా తమ గురుస్వరూపాన్ని ఎలా చూశారో, దానినే వారు లోతుగా ఆ విధంగా చూసేవారు.
వారు సమాధి పర్యంతం — 91 సంవత్సరాలు జీవించి, సమాధి పొందడానికి రెండు రోజుల ముందు వరకు, ఆ రోజు ఉదయం వరకు కూడా — గురుస్మరణ, గురుస్తోత్రం చేశారు. వారు ఎప్పుడూ చెప్పే గురుస్తోత్రం ఇది —
యావదుపాధి పర్యంతం తావచ్ఛుశ్రూషయేద్గురుమ్ ||
దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పచనం యథా |
జ్ఞానాగ్నిదగ్ధదేహస్య న చ శ్రాద్ధం న చ క్రియా ||
“యావదుపాధి పర్యంతం తావచ్ఛుశ్రూషయేద్గురుమ్” — తన ఉపాధి (శరీరం) ఉన్నంతవరకు గురువును సేవించాలి; అంటే గురుస్మరణ చేస్తూ ఉండాలి. అంతేగాని, “నేను ఒకసారి ఉపదేశం తీసుకున్నాను, గురువును వదిలేశాను, నాకు అంతా దొరికిపోయింది” — అది ఎప్పుడూ జరగదు. దానికి ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. గురువును విడిచిపెట్టారంటే ప్రతిఫలం అనుభవించవలసిందే. గురువుతో ఎప్పుడూ సత్సంబంధాలు ఉంచుకోవాలి. అది లేకుండా ఏమాత్రం తృణీకరించినా సరే — ఇది బ్రహ్మవిద్య, మరచిపోవద్దు.
మిగతా విద్యలన్నిటిలో ఎలాగైనా మీరు రాణించవచ్చు. కానీ ఇది జన్మజన్మలకు సంబంధించినది. ఈ జన్మలో మనం సిద్ధి పొందినా పొందకపోయినా, మన మరుజన్మలో కూడా గురువుగారు మనతో వస్తారు. ఈ రూపంలో కాకుండా ఇంకే రూపంలోనైనా వచ్చి, ఎక్కడివరకు మనకు ఆ విద్యను బోధ చేశారో అక్కడినుంచి ఆ బోధను కొనసాగిస్తూ ఉంటారు. అందువలన గురుతత్త్వాన్ని నిరంతరం స్మరణ చేసుకోవాలి. ప్రాణాయామ విద్య అంటే ఇది భౌతికమైన విద్య కాదు; ఇది మన ఆత్మజ్ఞానాన్ని కలిగించే అంతర్లీనమైన విద్య.
గురువక్త్రస్థితా విద్యా
దీనితో పాటు ఈ గురుతత్త్వాన్ని, గురుభక్తిని —
గురువక్త్రస్థితా విద్యా గురుభక్త్యా చ లభ్యతే ||
అని చెప్పారు. ఇది ఊరకనే రాదు. విద్య గురుముఖం నుండే కావాలనుకుంటే, అది గురుభక్తి చేతనే లభిస్తుంది.
మన గురువుగారు ఒక మాట చెప్పేవారు — కొంతమంది ఈ వేదాంత పాఠాలను (lessons) పోస్టు ద్వారా పంపించి, అన్నీ నేర్చుకున్న తరువాత ఉపదేశం ఇస్తాం అంటారు. ఒకరోజు గురువుగారు నన్ను అడిగారు — “డాక్టర్, ‘గురువక్త్రస్థితా విద్యా గురుభక్త్యా చ లభ్యతే’ — విద్య గురుముఖం నుండి, గురుభక్తి ద్వారానే దొరుకుతుంది; ఈ గ్రంథాల ద్వారా గాని, ఈ పాఠాల ద్వారా గాని దొరికేది కాదు.” ఇదంతా గురుసన్నిధానంలోనే.
గురుసన్నిధానం అంటే మామూలు విషయం కాదు — అది వైకుంఠం కంటే అధికమైనది. అందుకే “నిర్లజ్జో గురుసన్నిధౌ” అని చెప్పారు — గురుసన్నిధానంలో లజ్జ ఉండకూడదు.
గురువు ఎదుట అసత్యం పలకరాదు
ఇంకొక విషయం —
గురోరగ్రే న వక్తవ్యమసత్యం చ కదాచన ||
గురువు దగ్గర ఎప్పుడూ అబద్ధం రాకూడదు. చాలామందికి అది బాగా అలవాటు. వాళ్లు అబద్ధాలు ఆడుతున్నట్లు కూడా వాళ్లకు తెలియదు — ఎందుకంటే అది వాళ్లకు అలవాటైపోయింది. ఒకసారి ఏదో పరీక్ష చేయడానికో, దేనికో “ఏమిటి?” అని అడిగారనుకోండి — “అబ్బే, అదేమీ లేదు” అంటారు. ఎప్పుడైతే అబద్ధం ఆడావో, నీ పని అంతే. గురువు ఏమీ అనుకోరు.
నువ్వు బ్రహ్మహత్యల వంటి ఘోరమైన పాపాలు ఎన్ని చేసినప్పటికీ, గురువు దగ్గర నువ్వు ఒప్పుకున్నావనుకో (confess అయ్యావనుకో), గురువు దగ్గర నువ్వు చెప్పావనుకో, వ్యక్తీకరించావనుకో — ఆ పాపాలు పోతాయి. అంతేగాని, “గురువుగారు నన్ను తక్కువగా చూస్తారేమో” అనుకొని చెప్పకుండా దాచుకొని ఇవన్నీ చేశావంటే — అది నీ దుర్లక్షణమే. “గురోరగ్రే న వక్తవ్యమసత్యం చ కదాచన” అన్నారు.
“గురోరాజ్ఞాం ప్రకుర్వీత” — “కుర్వీత” కాదు, “ప్రకుర్వీత” — గురువు చెప్పినది తప్పనిసరిగా, సంపూర్ణంగా పాటించాలి. అది పాటించటం గురువు కోసం కాదు, నీ కోసం. గురువుగారు చెప్పినది ఒక్కోసారి అసందర్భంగా కనిపించవచ్చు. కనిపించినప్పటికీ, దానిని నీవు ఆలోచించకుండా చేయాలి — ఆలోచించకుండా చేయాలి. తరువాత కొన్నాళ్లకు గురువు ఎందుకు చెప్పారో తెలుస్తుంది. వారు ఏ స్థానంలో, ఏ స్థాయిలో చెప్పారో — ఆలోచించకుండా చేస్తే కొన్నాళ్లకు నీకు అర్థమవుతుంది, గురువుగారు ఎందుకు చెప్పారో.
నియమపాలనం — ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒకటే
ఇవన్నీ బ్రహ్మవిద్య యొక్క నియమనిబంధనలు. ఇవేమీ పాటించకుండా అసలు యోగవిద్య దొరకడమే కష్టం. ఇప్పుడు ఏది యోగవిద్యో, ఏది ప్రధానమైనదో, ఏది అప్రధానమైనదో తెలుసుకోలేని పరిస్థితిలో ఈ లోకం ఉంది. అయినా సరే, కంఠశోష అయ్యేటట్లుగా “ఇది శాస్త్రప్రమాణబద్ధంగా ఉంది, శాస్త్రీయంగా (scientific గా) ఉంది” అని చెప్పినప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నప్పుడు కూడా ఇంకా నియమాలు పాటించాలి — నియమాలు చాలా పాటించాలి. పాటిస్తే ఇది చక్కగా ముందుకు రాణిస్తుంది.
ఈ గురుతత్త్వాన్ని ఇంకా చాలా రకాలుగా చెప్పారు; ఉపనిషత్తులలో కూడా అనేక రకాలుగా ఉన్నది. ఆదిశంకరాచార్యులవారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఏం చెప్పారు —
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||
అని చెప్తూ —
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
నీకు అన్ని విద్యలకూ గురువే. ఏ విద్య అయినా — ప్రాపంచికమైనా, అప్రాపంచికమైనా; లౌకిక విద్య అయినా, అలౌకిక విద్య అయినా — అన్ని విద్యల సారమూ గురువు దగ్గరే ఉంది. “గురవే సర్వలోకానాం” — జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలు అన్నిటిలో ఉండేది గురువే. “భిషజే భవరోగిణామ్” — నీ సంసార రోగాన్ని హరింపజేసే అసాధారణ వైద్యుడు గురువే. “నిధయే సర్వవిద్యానాం” — నీకు అన్ని నిధులూ గురువు దగ్గరే ఉన్నాయి. “దక్షిణామూర్తయే నమః.”
“ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే” — అంటే మొదట మనం ఈ గురుతత్త్వాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మూడుగా భావిస్తాం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నాం; ఆయనను ఈశ్వరుడు అంటాం. ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా వస్తాడు అంటే — గురురూపంలో వస్తాడు. గురురూపంలో వచ్చినవాని తత్త్వం తెలుసుకోవాలంటే నీ లోపల చూడాలి; యోగసాధన చేయాలి. యోగసాధన చేసి ఆ తేజోదర్శనం చేస్తే — ఈశ్వరుడు ఆయనే, ఎదురుగా ఉండే గురువు ఆయనే, నీ ఆత్మ ఆయనే. ఆ ముగ్గురూ ఒకటే అని తెలుసుకునే స్థాయి వరకు మనం ఈ సాధన చేస్తూ ఉండాలి.
యోగాగ్ని — చిత్తశుద్ధి
మనసును చాలా శుద్ధం చేసుకోవాలి. మనసు శుద్ధంగా లేకపోతే ఏమవుతుందంటే — అది రాగద్వేషాలకు అలవాటుపడిపోయింది గనుక సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటుంది. అది శుద్ధం కావాలనుకుంటే నిరంతరం యోగాగ్ని చేత శుద్ధి చేయాలి —
యోగాగ్నిర్దహతి క్షిప్రమశేషం పాపపంజరమ్ ||
మనలోని పాపాన్ని హరింపజేసే యోగాగ్ని చేత మనసు శుద్ధమైతే, దాని ద్వారా మనకు జ్ఞానం ప్రకాశిస్తుంది. అందులో జ్ఞానం అంటే — కేవలం “నేను తేజస్సును చూశాను” అంటే సరిపోదు. నీకు సర్వజ్ఞత్వం కావాలి, సర్వవ్యాపకత్వం కావాలి, సర్వశక్తిమత్త్వం కావాలి. ఈ మూడూ కలిస్తేనే నువ్వు ఈశ్వరస్వరూపుడవు అవుతావు. ఏదో కొంత కలిగినంత మాత్రాన కాదు.
వీటన్నిటికీ రెండు కావాలి — నిరంతర యోగసాధన, నిరంతర గురుస్మరణ. నిరంతరం యోగసాధన ఉంటే సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్త్వం, సర్వవ్యాపకత్వం — అన్నీ నీవే అవుతాయి. అవే Omnipresent, Omnipotent, Omniscient. ఈ మూడు లక్షణాలు ఉంటేనే మోక్షం పొందుతారు. ఏదో ఒక స్థాయిలోకి వెళ్లినంత మాత్రాన ఇవి పొందినట్లు కానే కాదని అన్ని శాస్త్రాలూ హెచ్చరిస్తున్నాయి.
శాస్త్రమే ప్రమాణం
అందుకనే భగవద్గీత పదహారవ అధ్యాయంలో చెప్పినట్లు —
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||
ప్రతిదీ శాస్త్రప్రమాణబద్ధంగా ఉండాలి. శాస్త్రప్రమాణం అంటే ఏమిటి? అది బ్రహ్మవిద్యా సంప్రదాయ గురువుల ద్వారా వచ్చినదా? వారు చెప్పిన నియమనిష్ఠలలో ఉన్నదా? వారు చెప్పిన సూత్రాలలో ఉన్నదా? అలా ఉంటే అది సరైనది; లేకపోతే —
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసంధీయతామ్ ||
అని ఆదిశంకరాచార్యులవారు చెప్పారు. ఈ ప్రమాణబద్ధంగా లేనివారితో వాదించవద్దు, వారిని విడిచిపెట్టుకో అన్నారు.
అందువల్ల ఈ శాస్త్రం గురువుల ద్వారానే నేర్చుకోవాలి. గురువుల ద్వారా నేర్చుకోవాలి అంటే శ్లోకాలు నేర్చుకోవడం మాత్రమే కాదు. కొంతమందికి సాధన మీద మంచి మనసు ఉంటుంది; అలాంటప్పుడు “శాస్త్రం ఎందుకు?” అని కాదు. నువ్వు సాధన చేసినప్పటికీ, భవిష్యత్కాలంలో ఏ గురువును ఎంచుకోవాలి, ఈ గురువు సరైనవారా కాదా అనేది — ముందు శాస్త్రప్రమాణం ద్వారా తెలుసుకొని, సాధన ద్వారా నీకు నీవే నిర్ధారించుకోవాలి. లేకపోతే నువ్వు గంతులు వేస్తూనే ఉంటావు; నీ మనసు నమ్మదు, నమ్మదు. దానికే గురుగీత చెప్తుంది —
మధులుబ్ధో యథా భృంగః పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ |
జ్ఞానలుబ్ధస్తథా శిష్యో గురోర్గుర్వంతరం వ్రజేత్ ||
ఒక తుమ్మెద తనకు తేనె దొరికేంతవరకు ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు వెళ్తూనే ఉంటుంది. అలాగే జ్ఞానం దొరికేంతవరకు శిష్యుడు ఒక గురువు నుంచి మరొక గురువు దగ్గరికి చేరవచ్చు. అయితే “ఇది అనుమతి (permission) ఇచ్చారు కదా” అని కాదు అక్కడ అర్థం. సాధన ద్వారా, గురువుతో ఉన్నప్పుడు, ఎవరు సద్గురువు అని నిర్ణయించే శక్తిసామర్థ్యాలు నీకు కలిగితే అప్పుడు నువ్వు నిర్ణయించుకోవచ్చు. లేకపోతే — కొంతమంది రత్నాలు దొరికిన తరువాత కూడా వాటిని గాజుపెంకులుగా భావించేవారు ఉన్నారు.
చూడాలా — శిఖిధ్వజ వృత్తాంతం
అదే యోగవాసిష్ఠంలోని చూడాలా-శిఖిధ్వజోపాఖ్యానం. ఆ కథ ఏమిటంటే — చూడాల అనే మహారాణి చిన్నప్పటినుంచే, పెళ్లి కాకముందే, గురువు ద్వారా యోగరహస్యాలను తెలుసుకొని యోగసిద్ధిని పొందింది. ఆ తరువాత శిఖిధ్వజుడు అనే రాజును పెళ్లి చేసుకుంది. ఆయన రాజ్యం ఏలుతుండగా ఆమె భర్తతో చెప్పింది: “నాథా! నేను ఈ యోగరహస్యాలు, ఈ విద్య నేర్చుకున్నాను. నువ్వు కూడా నేర్చుకో.” అప్పుడు ఆయన, “నువ్వు నా భార్యవు; నీకేం తెలుసులే? నువ్వు చెప్పేది నాకేం అర్థమవుతుందిలే? అంతా నీకేం తెలుసులే?” అని తృణీకరించాడు.
సరే — కొన్నాళ్లకు ఆయనకే వైరాగ్యం కలిగి, రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజ్యాన్ని భార్యకు అప్పజెప్పి, తాను అరణ్యంలోకి వెళ్లిపోయాడు. 18 సంవత్సరాలు జపమాల తిప్పుతూ అనేక రకాల జపాలు, మంత్రాలు చేస్తూ ఉన్నాడు. ఆయన అలా మంత్రాలు చేస్తూ ఉండగా, భర్త ఎలా ఉన్నాడో చూడటానికి ఆమె వెళ్లింది. నేరుగా వెళ్లలేదు — కుంభుడు అనే ఒక చిన్న బ్రాహ్మణ బాలుని మారువేషంలో వెళ్లి పరీక్ష చేసింది.
పరీక్ష చేసి, “ఇదంతా నువ్వు నేర్చుకున్నావా?” అని అడిగితే, ఆయన, “నేను అన్నీ నేర్చుకున్నాను, కానీ నాకేమీ సిద్ధి పొందినట్లు కనబడట్లేదు” అన్నాడు. “ఎందుకు కనబడట్లేదు? నీకు ఇదంతా బాహ్యంగానే ఉంది; నీకు త్యాగం లేదు, కాబట్టి కనబడలేదు” అని చెప్పింది. “నాకు త్యాగం లేదా? నా భార్యను విడిచిపెట్టాను, నా రాజ్యాన్ని విడిచిపెట్టాను; ఇంకేం విడిచిపెట్టాలి?” అన్నాడు. “కాదు, ఇంకా విడిచిపెట్టవలసింది ఉంది.” “ఇంకేముంది నాకు? ఇక్కడ దండకమండలాలు ఉన్నాయి, నా ఆసనం ఉంది; అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే అవి కూడా విడిచిపెట్టేస్తాను” అని — “ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తాను” అని — ఒక హోమం తయారుచేసి, దండకమండలాలను, ఆసనాన్ని అగ్నికుండంలో పడేశాడు. తాను కూడా దూకబోయేసరికి — “ఆగు, ఆగు! నేను ఎవరో కాదు, నీ భార్య చూడాలనే” అని చెప్పింది.
“నేను 18 సంవత్సరాల క్రితమే నీకు ఈ యోగవిద్యను, ఈ బ్రహ్మవిద్యను అంతా చెప్పాను. నీకు అర్థం కాలేదు. నువ్వు ఆ రత్నాన్ని కూడా గాజుపెంకులాగా భావించి, 18 సంవత్సరాలు ఈ విధంగా అనుభవించవలసి వచ్చింది.” ఆ తరువాత ఆ యోగరహస్యాలను భర్తకు చెప్పింది. ఆయన సాధన చేసి సిద్ధి పొందాడు. కొన్నాళ్లు పోయిన తరువాత, ఆయన అరణ్యంలో తపస్సు చేసి సిద్ధి పొందిన తరువాత, ఆమె మళ్లీ వచ్చి సూక్ష్మశరీరంతో ఆయనలోకి ప్రవేశించి, ఆయనలో లోపల ఏమాత్రమైనా కదలిక ఉందా లేదా అని పరీక్ష చేసి, ఆ కదలికను తీసుకువచ్చి, బయటకు తీసుకువచ్చింది. ఇద్దరూ బాహ్యస్మృతిలోకి వచ్చిన తరువాత మరి పదకొండు వేల సంవత్సరాలు ఈ రాజ్యాన్ని ఏలినట్లు యోగవాసిష్ఠంలో కథ ఉంది.
బ్రహ్మవిద్యను తక్కువగా అంచనా వేయవద్దు
అందువల్ల బ్రహ్మవిద్యను తక్కువగా అంచనా (underestimate) వేయవద్దు. బ్రహ్మవిద్య అంటే మామూలు విద్య కాదు; ఎన్ని జన్మలు తపస్సు చేసినా సరే దొరకని విద్య ఇది. కొంతమంది పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పేవారు — ఇలా అనకూడదు, వారందరినీ క్షమించమని కోరుతున్నాను — అంతటి ప్రవచనాలు చెప్పి, భక్తిప్రపత్తులతో పదిమందిని బాగుచేద్దాం అనుకునేవారికి కూడా ఈ అంతర్లీనమైన, సూక్ష్మాతిసూక్ష్మమైన, రహస్యమైన బ్రహ్మవిద్య దొరకలేదు, దొరకలేదు. దొరకకపోవడానికి కారణం — ఈ కాలం అలాంటిది దాపురించింది. కొన్నాళ్లు అలాగే వచ్చింది; ఇప్పుడు కాలం వస్తోంది.
వీటన్నిటికీ — బ్రహ్మవిద్యా సంప్రదాయ విషయంలో ఆ ఋషిమండలి ఎప్పుడూ ఊరుకోదు. వారు పైనుంచి చూస్తూనే ఉంటారు. ఈ విద్యను ఎక్కడెక్కడ ఏ విధంగా వ్యాప్తం చేయాలో, ఆ విధంగా వ్యాప్తం చేయడానికి వారంతా ఒక సంకల్పంతోనే అన్నీ చేస్తుంటారు. అందులో మనమందరం — ఇటువంటి బ్రహ్మవిద్య దొరికిందంటే — కోట్లాది మందికంటే మనం చాలా చాలా అదృష్టవంతులం. ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని దురహంకారం చేత దుర్వినియోగం చేసుకోవద్దు; వ్యక్తిగత అభిమానంతో, సంఘంలో ప్రదర్శన కోసం దీనిని ఎప్పుడూ దుర్వినియోగం చేయవద్దు.
ఏకత్వం — ప్రేమతత్త్వం
మీరు ఎప్పుడూ ఏకత్వంతో ఉండండి. మోక్షం అంటే ఎవరికి వారు విడివిడిగా పొందేది కాదు. ఉన్నది ఏకవస్తువు; మనం అనేక వస్తువులుగా ఉన్నాం. అనేక వస్తువులలో ఒక వస్తువుగా ఉన్న మనం ఏకవస్తువులో కలిసేటప్పుడు, అందులో మనం కలిసిపోతాం. కానీ వ్యక్తిగతంగా ఈ శరీరంతో అని కాదు. నీవు పైకి వెళ్తున్న కొద్దీ సర్వాత్మకుడవు అవుతావు; అందరి ఉపాధులలోనూ నీవే ఉంటావు. అందువల్ల అందరిలో ప్రేమతత్త్వం దొరుకుతుంది. ఆ ప్రేమతత్త్వం కలిగినప్పుడు రాగద్వేషాలన్నీ వాటంతట అవే (automatic గా) మటుమాయం అవుతాయి.
అందువలన యోగసాధన చేసేవారికి ప్రేమతత్త్వం కావాలి. ప్రేమతత్త్వం ఎప్పుడైతే వచ్చిందో, తాను తరిస్తాడు; ఇతరులను కూడా తరింపజేస్తాడు.
ఈ విధంగా మన గురుదేవులు పలికించిన ఈ మాటలను, బ్రహ్మర్షి భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి జయంతి — గురుపూర్ణిమ — సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినవారందరికీ, ఈ అవకాశం కలిగించిన గురుదేవులకు, పరమగురుదేవులకు — అందరికీ నా శతసహస్రకోటి వందనాలు సమర్పించుకుంటూ, విన్నవించుకుంటున్నాను.
ఓం శ్రీ గురుభ్యో నమః
