జన్మరాహిత్యం

జన్మరాహిత్యమనగా నేమి? అది ఎట్లు సిద్ధించును? జన్మకు, కర్మకు గల సంబంధమేమి?

పునర్జన్మ లేకుండుటయే జన్మరాహిత్యము. పుట్టినవారు చనిపోవుట, చనిపోయిన వారు పుట్టుట అను చక్రభ్రమణంలో మనం అడ్డుకోవలసినది మరణించుట వద్ద కాని జన్మించుటవద్ద కాదు. మరణించినవారు ఏదో రూపంలో ఏదో ఒకచోట జన్మించచక తప్పదు. వారికి స్వతంత్రంలేదు. కావున పుట్టినవారు మరణించకుండా  ఉండునట్లు ఈ దేహంతో నుండగనే ప్రయత్నించవలెను. కావున జన్మరాహిత్యం సిద్ధించవలెనన్నచో ముందు మరణ రాహిత్యం పొందవలెను. ఈ ప్రయత్నము మాని ఎక్కువ మంది గ్రుడ్డిగా నాకు పునర్జన్మ లేకుండా ప్రసాదించు తండ్రీ అని దైవమును వేడుకొనుచున్నారు.

అటువంటి వారిని “జన్మరాహిత్యం ఎవరికి కావలె” నని ప్రశ్నించిన, “నాకు” అని సమాధానం వచ్చును. మరి నీవెవరు? జన్మరాహిత్యం పొందిన పిమ్మట నీవెట్లుందువు? అని ఇంకనూ ప్రశ్నించిన, మరి సమాధానము చెప్పలేడు.

సముద్రం మధ్యలో ఒక కెరటము ఏర్పడి, ఎగిసిపడి తీరము చేరునంతలో, “తండ్రీ నేను మీ నుండియే జన్మించి రానురాను పడుతూ లేసూతూ అనేక జన్మలనెత్తుచూ, బాధలననుభవించుచున్నాను. నాకు ఉపశమనము లేదా?” అని ఆ సముద్రమునే ప్రశ్నించినదనుకొందాం. అప్పుడు సముద్రము ఈ విధంగా సమాధానము చెప్పను.

“నాయనా! నీవలెనే నీతో సహా నాలో అనేక కెరటములు లేసూతూ పడుచున్నవి. వాటి వలన నాకేమి బాధ కలుగుచున్నదా? నేనేమి చచ్చిపోయి పుట్టుచున్నానా? మరి నాకు లేని బాధలు, నాకు లేని జన్మలు నీకెట్లు కలిగినవి?” అని చెపుచుండగా, ఆ ప్రశ్నవేసిన కెరటము తీరమునకు చేరి సముద్రంలో కలిసిపోయెను. ప్రశ్నవేయువారు లేకపోయెను. ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోయెను. కాని సమాధానము చెప్ప సముద్రము మాత్రము ఎల్లప్పుడూ ఉండును. దానికి ఉత్పత్తి నాశనములు లేవు. ఈ భావాన్నే గీతలో…

అజో_పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో_పి సన్

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా

(భ.గీ. 4-6)

నేను పుట్టుక లేనివాడనైనప్పటికీ, సర్వజీవులకు ప్రభువు నైనప్పటికీ, నేను ప్రకృతినే ఆధారముగా చేసికొని పుట్టుచున్నాను.

జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో_ర్జున

(భ.గీ. 4-9)

“నేను యీ విధంగా మాయతోనే జన్మలెత్తుచున్నట్లు, కర్మలు చేయుచున్నట్లు యథార్థమును ఎవరు గ్రహింతురో, వారు ఈ దేహమును (స్థూల సూక్ష్మ, కారణ దేహములను) విడిచిపెట్టి నన్నేపొంది, మరల జన్మనొంద” రని భావం.

ఘట సంవృత మాకాశం నీయమానే ఘటో యథా

ఘటో నీయేత నాకాశ స్తద్వ జ్జీవో నభోపమః

(అమృత బిందూపనిషత్ -13)

పూర్వముగల మహాకాశమే ఘటమేర్పడడంతో (కుండ) ఘటమునందలి ఆకాశము ఘటాకాశమయ్యెను. ఘటము నశించుట తోడనే మరల ఘటాకాశము మహాకాశములో కలిసిపోయి, మహాకాశమైనది. అదేవిధంగా సముద్రము నుండి కెరటమేర్పడి మరల సముద్రములో కలిసి పోయినట్లు బ్రహ్మము నుండి ఏర్పడిన జీవుడు, మరల ఉపాధి నశించిన వెంటనే బ్రహ్మస్వరూపుడగుచున్నాడు. ఇచ్చట పుట్టుట, చనిపోవుట అనునది ఉపాధికే కాని అందలి చైతన్యమునకు కాదు. ఇందలి అద్వైత ఉపమానము బాగుగానే ఉన్నా, అసలు ఉపాధి ఎట్లు కలిగినదను ప్రశ్న ఉదయించును.

ఆ ఉపాధి కలుగుటకు చిత్తమే కారణమనియూ, చిత్తము నుండియే జన్మభావము కలుగుచున్నదనియూ, చిత్తము నశించినచో జీవుడు బ్రహ్మస్వరూపుడు అగునని యూ శ్రుతుల ప్రమాణము.

చిత్తం సంజాయతే జన్మ జరా మరణ కారణమ్

(ముక్తికోపనిషత్ 2-6)

చిత్తము నుండియే జన్మ, వార్దక్య, మరణములు సంభవించుచున్నవి. అట్టి చిత్తమను సంసార వృక్షమునకు రెండు బీజములు కలవు. అందు ఒకటి నశించినచో రెండవది కూడ వెంటనే నశించును.

ద్వేబీజే చిత్త వృక్షస్య ప్రాణస్పందన వాసనా

ఏకస్మింశ్చ తయోః క్షీణే క్షిప్రం ద్వే_పి నశ్యతః

(ముక్తికోపనిషత్ 2-7)

ప్రాణస్పందన, వాసనలు యీ రెండు పరస్పర సంబంధము కలవి. ప్రాణవాయువు స్పందన వలన మనసు చలించి బైటకు వచ్చుటచే ఇంద్రియముల ద్వారా దర్శన శ్రవణాదులు ఏర్పడి, వాసనలేర్పడుచున్నవి.

‘దర్శన శ్రవణా ఇతి వాసనాః’

(శృతి)

వాసనలేర్పడుట వలన మనసు ఇంకనూ బహిర్ముఖమై, చిత్తచాంచల్యము కలుగజేయును. ప్రాణస్పందన ఎక్కువగా ఉండును.

క్రియానాశాచ్చింతానాశో చింతానాశాత్ వాసనా

క్షయః వాసనాపి క్షయో మోక్షః సజీవన్ముక్తిరుచ్యతే

(శృతి)

మనసు, బైటకు రాకుండా లోపలనే ఉన్నచో, దృశ్యచింతన తగ్గును. దృశ్య చింతన తగ్గినచో వాసనలు తగ్గును. వాసనలు తగ్గుటయే మోక్షమని చెప్పబడుచున్నది.

అయితే మనసును అంతర్ముఖము చేయవలెనన్న ప్రాణవాయువు వశము కావలెను. అది యోగుల వలననే సాధ్యము.

‘యోగేనాంతర్ముఖీ బుద్ధిస్తతో నాశయతే తమః’

(కఠోపనిషత్ శ్రీ ఆదిశంకరుల భాష్యం)

కావున చిత్తమను వృక్షమునకు గల రెండు బీజములలో ప్రాణ స్పందనయే ప్రధానమైనది కనుక ప్రాణవాయువు నరికట్టినచో చిత్త చాంచల్యము పోవును. అప్పుడు జన్మ, జరా, మరణ భయములు అంతరించిపోవును. ఆ పరమాత్మ పక్షి స్వరూపుడై (పక్షములనగా రెక్కలు) ద్విపాద, చతుష్పాద జంతువులు మొదలుగా ప్రతీ జీవియందు ప్రవేశించుచుండును.

పురశ్చక్రే ద్విపదః పురశ్చక్రే చతుష్పదః

పురశ్చ పక్షీ భూత్వా పురః పురుషావిశేత్

(బృహదారణ్యకోపనిషత్ 4-5-18)

పక్షులకు రెక్కలవలె జీవులలో ప్రాణాపానములను రెక్కలతో శ్వాసక్రియ జరుగుతున్నది. పక్షి ఎగురకుండా చేయవలయునన్న రెక్కలను కట్టివేయవలెను. అటులనే యీ దేహము నుండి ఇంకొక దేహమునకు జీవుడు ఎగురకుండా మనలోగల ప్రాణాపానములను రెక్కలను, ప్రాణాయామము ద్వారా కట్టివేసినచో, యీ జీవుడు చనిపోకుండా తనలోగల పరమాత్మ యందే ఐక్యమగును. అనగా మరణరాహిత్యం ద్వారా జన్మరాహిత్యం సిద్ధించుచున్నది.

జన్మరాహిత్యం

‘అపాన ప్రాణయోరైక్యం చిదాత్మానం సమాశ్రయ’

(అన్నపూర్ణోపనిషత్ 5-4)

అపాన ప్రాణములు ఐక్యమైనవారు చిదాత్మ స్వరూపులే యగుదురు.

నతస్య ప్రాణా ఉత్క్రామంతి  అత్రైవ సమవలీయంతే

(సుబాలోపనిషత్ 3-2)

యోగి, ప్రాణములు బైటకు పోకుండా, తన భ్రూమధ్యములో ఐక్యమై మరణం లేకుండా తద్వారా జన్మరాహిత్యము నొందుచున్నాడు.

జన్మకూ కర్మకూ గల సంబంధమేమి?

జన్మనెత్తినచో కర్మ చేయక తప్పదు. కర్మ చేసినచో కర్మ ఫలమనుభవింపక తప్పదు. కర్మఫలానుభవమునకై మరల జన్మించక తప్పదు. ఇచ్చట ఒక దృష్టాంతమును తీసుకొనెదము. ఒకరు కర్మను చేయుట అనునది ఒక Website ను Open చేయుటవంటిది. కర్మ చేసిన తరువాత దాని ఫలాన్ని అనుభవించడానికి జన్మలెత్తవలసి వచ్చునట్లు గానే, Website ఉండునంతవరకు దానిని Operate చేయుట తప్పనిసరి. అవసరము లేదనుకుంటే Website ను ఓపెన్ చేసిన వ్యక్తియే మరల దానిని లేకుండా (Close) చేయాలి. లేనిచో Website మిగిలి ఉండుట వలన దాని నిర్వాహణ అనివార్యమవుతుంది. అదే విధంగా ఉపాధి (అంతఃకరణము) ను దగ్దం చేసుకొనకుండా చనిపోయినచో మరల జన్మల నెత్తక తప్పదు. కావున కర్మ చేయువాడే అంతఃకరణము లేదా ఉపాధి (Website) ను ఇచ్చటనే, ఈ జన్మలోనే దగ్ధము (Close) చేసుకొనినచో మరల జన్మింపనవసరము ఉండదు.

ప్రసన్నం జ్ఞాయతే జ్ఞానం జ్ఞానాన్నిర్వాణ మృచ్ఛతి

(కూర్మ పురాణం)

యోగాగ్నితో పాపపంజరమును శేషము లేకుండా దగ్ధము చేసుకొని, జ్ఞానమునొంది, ఆ జ్ఞానము ద్వారా జనన మరణ రహిత నిర్వాణమునొందెదరని భావం.

◆◇◆

శ్రీ యోగివేమన వారి అద్వైతము :

పుట్టువారెవ్వరు పుట్టకుందురెవరు ?

పుట్టి గిట్టనట్టి పురుషులెవరు ?

పుట్టి పుట్టనట్లు బోధించి చూడరా

విశ్వదాభిరాము వినురవేమ                                        (శ్రీయోగి వేమన పద్యం)

పుట్టువారెవ్వరు ?

జీవుడు, బ్రహ్మము ఒకటే అయినపుడు మరి పుట్టు వారెవ్వరూ ఉండరు.

‘న జాయతే మ్రియతే వా కదాచిత్’

(భ.గీ. 2-20)

‘న కశ్చిత్ జాయతే జీవః’

(గౌడపాద కారిక 2-48)

పుట్టకుందురెవ్వరు?

అజ్ఞానము ఆవహించియుండు నంతకాలము జన్మ పరంపర తప్పదు.

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్

కారణం గుణసంగో_స్య సదసద్యోని జన్మసు

(భ.గీ. 13-21)

పుట్టిగిట్టనట్టి పురుషులెవరు ?

పుట్టని వాడైనప్పటికీ పుట్టినట్లు భావించినచో గిట్టక తప్పదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ

(భ.గీ. 2-27)

పుట్టి పుట్టనట్లు బోధించి చూడరా!

కలకనువాడు సత్యము. కల అసత్యము. కలలో యున్నచో పుట్టినట్లు, కలనుండి మేల్కొంచినచో తాను పుట్టనట్లు గ్రహించువాడే జ్ఞాని. దీనినే సద్గురువులు బోధింతురు.

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో_ర్జున

(భ.గీ. 4-9)

పుట్టనివాడే పుట్టినట్లు, కర్మ చేసినట్లు అగుపడిననూ ఈ యథార్థము నెరిగినవారే పునర్జన్మ లేకుండా నన్నే పొందుదురు.