Sri Krishna Janmashtami 2026 – Telugu

శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశం – భగవద్గీత — ప్రకృతి, మాయ, గురుతత్త్వం – శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమం

శుక్రవారం, సెప్టెంబర్ 4, 2026

గురు వందనం

ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః
ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః
ఓం సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మనే నమః
ఓం శ్రీ నిత్యానంద పరబ్రహ్మణే నమః
ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమః
ఓం సద్గురు శ్రీ వేదవ్యాస భట్టారకాయ నమః

గురు స్వరూపులైన మీ అందరికీ, సాధక లోకానికి, ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక ఆత్మ నమస్కారములు.

గురుదేవా! ఈ రోజు సెప్టెంబర్ 4, 2026, శుక్రవారం నాడు శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమంలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ జయంతి సందర్భంగా భగవద్గీత గురించి కొద్దిగా చెప్పుకుందాం.

బాల ముకుంద స్మరణ

ముందుగా, ఈ రాత్రి శ్రీకృష్ణ పరమాత్మను — బాలకృష్ణుని రూపంలో — స్మరించుకుందాం. అదేమిటంటే:

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ ।
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి ॥

ఇది చాలా ముఖ్యమైనది. మార్కండేయ మహర్షికి, చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుని నోటిలో పెట్టుకుని, చిరుదరహాసంతో దర్శనమిచ్చారట. ఈ రూపం అందరికీ ఎంతో ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ కలిగించే రూపం. అది ఒక లీలా విగ్రహం. ఏమిటంటే — పదునాలుగు భువనభాండాలూ తమ కుక్షిలో ఉన్నవారు, ఒక చిన్న బాలుడిగా ఆ వటపత్రం (మర్రి ఆకు) పైన నిద్రపోతున్నట్టు దర్శనమిచ్చారు.

వారి జననం గురించి ఆబాలగోపాలం — ఆసేతుహిమాచల పర్యంతం, ఇతర దేశాలలో కూడా — అందరికీ తెలుసు. నేడు కృష్ణాష్టమి, జన్మాష్టమి జరుపుకుంటున్నాం.

కృష్ణస్తు భగవాన్ స్వయమ్
కృష్ణస్తు భగవాన్ స్వయమ్ ।
— శ్రీమద్భాగవతం

అని ఉంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవంతుడు. మామూలుగా మనం శ్రీమన్నారాయణుని అవతారాలలో, దశావతారాలలో శ్రీకృష్ణావతారాన్ని చెప్పుకుంటాం. కానీ వారు దశావతారాలలో లేరు.

దశావతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన — తరువాత ముగ్గురు రాములు: భార్గవరాముడు అనే పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు — తరువాత బుద్ధుడు, కల్కి — ఈ విధంగా అవతారాలు ఉన్నాయి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అంటే — “కృష్ణస్తు భగవాన్ స్వయమ్” — వారు స్వయంభువు; స్వయంగా ఎప్పుడూ ఉండేవారే. గోలోకంలోనూ, భూలోకంలోనూ ఉండేవారే. ఒకప్పుడు మారు రూపం దాల్చినట్టు కాదు.

అవతారం అంటే నిర్గుణం నుంచి సగుణం కావడం. కానీ కృష్ణావతారంలో ఏమిటంటే — ఇది కూడా ఒక లీలా మానుష విగ్రహంగా మనకు కనబడుతూ, ఆ విగ్రహమే మళ్ళీ అంతరించిపోయినట్టు మనం వర్ణించుకుని, దానిని కృష్ణావతారంగా భావిస్తున్నాం. కానీ వారు ఎవరంటే — మనలోని వారే; మనమే; బ్రహ్మ చైతన్యమే; బ్రహ్మమే. అది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉండేదే.

వారి అవతారం సంపూర్ణ అవతారం. సంపూర్ణం అంటే అర్థం ఏమిటి? రూపాయికి ఎన్ని అణాలు? పదహారు అణాలు. ఇది ఎవరినీ తక్కువ చేసి చెప్పడం కాదు — శ్రీరామచంద్రుడు పన్నెండు కళలు. ఎందుకంటే వారు ఒక శుద్ధ జీవుడిగా అవతరించారు. కానీ ఇక్కడ మాత్రం పదహారు కళలతో సంపూర్ణ అవతారం. అందువలననే పుట్టుకతోనే అనేక మహిమలు, లీలలు చూపించారు.

అజోఽపి సన్ — “నేను ఎవరు?”

అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥
— భగవద్గీత 4.6

భగవద్గీతలో వారు ఎవరో, వారి గురించి వారే చెప్పారు. భగవద్గీత అంటే ఏమిటంటే — “నేను ఎవరు? మీరు ఎవరు? మీరు నాలా ఎలా అవుతారు?” — అనేదే భగవద్గీత.

“అజోఽపి సన్” — పుట్టుక లేనివాడినైనప్పటికీ; “భూతానామీశ్వరోఽపి సన్” — సకల భూతాలకు ప్రభువును, సృష్టికి ప్రభువును అయినప్పటికీ; “ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా” — నేను నా మాయ చేతనే ప్రకృతిని స్వాధీనం చేసుకుని “సంభవిస్తున్నాను” అన్నారు.

సంభవించుట అంటే పుట్టడం కాదు. బంగారం ఆభరణం అయింది — అంతే. బంగారం నుంచి ఆభరణం పుట్టలేదు. “సంభవామ్యాత్మమాయయా” — నా మాయ చేత.

మాయ, ప్రకృతి — ఒకటే

ఇక్కడ “ప్రకృతి”, “మాయ” అనే రెండు పదాలు వాడబడ్డాయి. ఇంకొక చోట:

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్ ।

— శ్వేతాశ్వతరోపనిషత్తు

అని ఉంది. మాయ అన్నా, ప్రకృతి అన్నా ఒకటే. మనం సాధారణంగా ప్రకృతి అంటే “నేచర్” (Nature), “ప్రకృతి మాత” అనే అనుకుంటాం. కానీ అక్కడ ఏమిటంటే:

బ్రహ్మణః సకాశాన్నానావిచిత్రజగన్నిర్మాణసామర్థ్యబుద్ధిరూపా బ్రహ్మశక్తిరేవ ప్రకృతిః ।

— నిరాలంబోపనిషత్తు

బ్రహ్మానికి సమీపంలో ఉండి, నానా విచిత్రమైన జగత్తును నిర్మించే సామర్థ్యం గల బుద్ధిరూపమైన బ్రహ్మశక్తియే ప్రకృతి. అంటే — క్రియారూపంగా ఉంటే అది బ్రహ్మశక్తి; క్రియ లేకుండా నిశ్చలంగా ఉంటే అది బ్రహ్మమే. ఈ రెండూ వేరు కానివి.

కానీ వేదాంతంలోకి — వర్ణనలోకి — వచ్చేసరికి, మన మనస్సుతో వర్ణించేటప్పుడు మాత్రం భగవంతుడు వేరు, ప్రకృతి వేరు. భగవంతుడు వేరు, ప్రకృతి వేరు. ఈ భేదాన్ని తెలుసుకుని వేరు చేయకపోవడం వల్లనే చాలామంది అద్వైతం విని కన్‌ఫ్యూజన్ (గందరగోళం) పడిపోతున్నారు.

మనం ఎక్కడ వింటున్నాం? పరాకాష్ఠలో, సాక్షాత్ పరబ్రహ్మ గురించి వింటున్నాం. వినేటప్పుడు ఏమిటంటే — “అంతా అదే కదా! అది నీవే కదా!” అని చెప్తారు. అంతా అదే; అది ఎవరో కాదు, నీవే. అయినంత మాత్రాన నీవు అది అయిపోవు.

మర్రి విత్తనం — మాయ లక్షణం

మర్రి విత్తనంలో మర్రి చెట్టు యొక్క అంకురం ఉంది కదా. ఆ అంకురాన్ని మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో పెట్టి అంతా విడదీసి చూస్తే ఏమి కనిపిస్తుంది? (సభ నుండి: “కణాలు కనిపిస్తాయి గురూజీ.”) అవును.

కాబట్టి ఈ ప్రకృతిని మనం భగవంతుని కంటే వేరుగా చూస్తేనే వేదాంతం అర్థమవుతుంది. “అంతా ఒకటే” అని మాత్రమే అంటే, మనందరం సమవర్తులమైపోయినట్టే అనుకుంటాం.

“కొంచెం కూడా అన్యంగా ఏమీ లేదు” — అంటే ఉండేది ఎవరు? నేనే.

మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥

— భగవద్గీత 7.7

నాకంటే వేరుగా కొంచెం కూడా ఏదీ లేదు. దారంలో మణులు (పూసలు) గుచ్చబడినట్టు, ఈ ప్రకృతి అంతా, ఈ జీవులందరూ నాయందు గుచ్చబడి ఉన్నారు — అన్నారు. అంటే ఈ ప్రకృతి అంతా నాయందు అంతర్భూతమై ఉంది. ఇప్పుడు అంతర్భూతమైన ఈ ప్రకృతిలోని వారమే మనం.

సర్వం ఖల్విదం బ్రహ్మ ।

— ఛాందోగ్యోపనిషత్తు

“ఇదంతా బ్రహ్మమే కదా” అని వేదాంతం, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంతా బ్రహ్మమే అయినప్పుడు — “ఇదం” అంటే ఏమిటి? ఆ “ఇదం” అనేదే ఈ ప్రకృతి. మనం చూసే ఇదంతా — ఈ జగత్తు. ఈ జగత్తు రూపంలో అది కనబడుతోంది.

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే — మనమందరం ఏకాత్మ స్వరూపులమే; ఒకే ఆత్మ స్వరూపులమే. మరి అలాంటప్పుడు మనకు భిన్నభిన్నంగా, వేరువేరు సంసారాలు ఎక్కడి నుంచి వచ్చాయి?

ఇందాక మర్రి విత్తనం గురించి చెప్పబోయాను. మర్రి విత్తనం ఉంది. ఆ విత్తనంలో మర్రి చెట్టు యొక్క అంకురం లోపల ఉంది. ఆ అంకురం కూడా స్థూలంగా చూస్తే కనబడుతుంది. కానీ మీరు లోపలికి వెళ్ళి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో అంతా విడదీసి చూస్తే అన్నీ కణాలే ఉంటాయి. అన్నీ కణాలే అయితే మర్రి చెట్టు ఎక్కడ ఉంది?

అంటే — విడమరిచి చూస్తే కనబడదు; విడమరిచి చూడకపోతే కనబడుతుంది. ఇదే అసలు మాయ యొక్క లక్షణం. విడమరిచి చూస్తే కనబడదు, కానీ స్థూలంగా, దూరం నుంచి చూస్తే కనబడుతుంది.

బంగారం, ఆభరణాలు — నిమిత్త కారణం, ఉపాదాన కారణం

మళ్ళీ ఒక ఉదాహరణ — బంగారం, ఆభరణాలు. ఈ ఆభరణాలు బంగారంతో తయారుచేయబడ్డాయి. బంగారానికీ, ఆభరణాలకీ ఏమిటి తేడా? ఏ తేడా లేదు. తేడా ఏమిటంటే — రకరకాల, వివిధ రూపాలు. ఆ రూపాలలోనే తేడా ఉంది.

మరి ఈ రూపాలకు కారణం బంగారంలోనే ఉందా? లేక బయట ఎక్కడి నుంచైనా వచ్చిందా? బంగారం ఆభరణాలుగా మారాలంటే దానికి కారకులెవరో ఎక్కడో ఉండాలి. ఆ “ఎక్కడో ఉండేది” — దానినే నిమిత్త కారణం అన్నారు.

నిమిత్త కారణం, ఉపాదాన కారణం — అని రెండు కారణాలు ఉన్నాయి. ఒక దృశ్య వస్తువు కనబడుతోంది అంటే దానిని ఎవరో చేశారు. ఎవరో చేయకపోతే అది తనంత తానుగా రాదు. కానీ చేసినవాడు కనబడడు; చెక్కిన బొమ్మే కనబడుతుంది. ఆ నిమిత్త కారణమే ప్రకృతి.

ఈ నిమిత్త కారణానికి మనం వశమై ఉన్నాం. ఈ సంసార బాధలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే — ఈ నిమిత్త కారణం యొక్క ప్రభావం (influence) వల్లనే.

యా మా సా మాయా

ఈ మాయ ఎటువంటిది అంటే:

యా వస్తుతో న విద్యతే సా మాయా ।

— సర్వసారోపనిషత్తు

వస్తుతః చూస్తే అది కనబడదు; కానీ అది ఉంటుంది. అందరికీ అర్థమయ్యేటట్టుగా, పండితులు కాని వారు కూడా “ఏమిటిది — మాయ!” అంటారు చూశారా. మాయ అంటే ఉన్నట్టే ఉంటుంది, కానీ లేదు. దానికి స్వతస్సిద్ధమైన ఉనికి (existence) లేదు; కానీ అన్నిటికీ ఉనికిని ఇచ్చేది అదే. “యా వస్తుతో న విద్యతే” — వస్తుతః అది లేదు. దానిని ఇంకా సరళంగా — “యా మా సా మాయా” — ఏది లేదో అదే మాయ — అన్నారు.

అటువంటి మాయ యొక్క ప్రభావం వల్లనే మనందరం సంసారంలో ఈ బాధలు అనుభవిస్తున్నాం.

ప్రకృతేః క్రియమాణాని — “నేనే కర్తను” అనే భ్రమ

ఎలా అనుభవిస్తున్నాం? భగవద్గీతలో — మనం విచక్షణ (వివేకం) చేయకపోవడం వల్లనే ఈ బాధలన్నీ వచ్చాయి అన్నారు. మూడవ అధ్యాయంలో:

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥

— భగవద్గీత 3.27

మనకు జరిగేదంతా ప్రకృతే చేయిస్తోంది. కానీ అది చేస్తోందన్న సంగతి మరచిపోయి, తెలుసుకోలేక, విచారణ చేయక, “నేనే కర్తను” అని అనుకుంటున్నాం. అందువలననే ఈ బాధలను అనుభవిస్తున్నాం.

మరి “నేనే కర్తను” అనే భావం ఎందుకు వచ్చింది? విమర్శించుకోకపోవడం (పరిశీలించుకోకపోవడం) వల్లనే. అన్నిటినీ నడిపించేది ఏది? ఆ ప్రకృతే. ప్రకృతి తప్ప ఇంకెవ్వరూ చేయడం లేదు — నువ్వు చేయడం లేదు, నేను చేయడం లేదు, ఎవరూ చేయడం లేదు; ప్రకృతి చేసింది.

జీవుడు, ఈశ్వరుడు — రెండు ఉపాధులు

కాకపోతే ప్రకృతిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అంటే — మనం జీవులం; ఈశ్వరుడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఒక ఉపాధి ఉంది, ఒక ఆధారం (basement) ఉంది — అది అవిద్యోపాధి (ఈశ్వరునికి మాయోపాధి — శుద్ధసత్త్వం). ఈ జీవుడికి ఉన్న ఉపాధి మలినోపాధి. ఈశ్వరుడికి అవిద్యోపాధి, జీవుడికి మలినోపాధి అన్నారు.

నిజానికి ఈశ్వరుడూ, జీవుడూ ఒక్కరే. కానీ ఈ అవిద్య వలన — అంటే ఈ మాయ వలన — ఇద్దరూ వేరయ్యారు. ఇద్దరూ వేరైపోయాక, ఆయనకున్న ఉపాధి శుద్ధ సత్త్వం; మనది మలినోపాధి. ఇప్పుడు మనం బాధను దేని ద్వారా అనుభవిస్తున్నాం? మలినోపాధి ద్వారా. ఈ మలినోపాధితో అనుభవించడం వల్లనే మనకు ఈ సంసారమంతా వచ్చింది అన్నారు.

తత్త్వవిత్తు మహాబాహో — గుణకర్మ విభాగం

అందుకే:

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ॥

— భగవద్గీత 3.28

జ్ఞాని ఏమి చేస్తారంటే — గుణాలనూ, కర్మలనూ వేరుచేసి చూస్తారు. ఒక కర్మ జరిగింది అనుకోండి — ఆ కర్మకు కారకులెవరు? ఒక గుణం. ఆ గుణం చేత కర్మ జరుగుతోంది. ప్రకృతిలో ఉండే గుణాలు మూడు — సత్త్వ, రజస్, తమో గుణాలు.

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ॥

— భగవద్గీత 7.14

ఏడవ అధ్యాయం. ఈ మాయ గుణమయమైనది; “మమ మాయా దురత్యయా” — నా మాయను దాటడం కష్టం — అంటున్నారు. “మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే” — నన్ను ఎవరైతే శరణువేడి, ఆరాధిస్తారో వారే నా మాయను దాటుతారు అన్నారు.

మాయను దాటి నన్ను కొలవడం కాదు; నన్ను కొలిస్తేనే మాయను దాటుతావు. మాయను దాటి కొలిచేది కాదు.

యజమాని, కుక్క — ఒక ఉదాహరణ

దీనికి చాలా కాలం క్రితం ఒక ఉదాహరణ చెప్పాను. ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని ఇంట్లో ఒక పెద్ద బలిష్ఠమైన కుక్క ఉంది. ఆ యజమానిని మనం కలవాలి. కలవడానికి వెళ్తే ఈ కుక్క ఏం చేస్తుంది? మీద పడి కరుస్తుంది.

దానితో పోట్లాడి యజమానిని కలుస్తామా? లేక ఆ యజమానితో — “బాబూ, మీ కుక్కకు ఒకసారి చెప్పండి; నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను” — అని ఒక్క మాట సింపుల్‌గా అడుగుతామా? కుక్కతో మాత్రం పోట్లాడవద్దు. “బాబూ, అది మీరు పెంచిన కుక్కే, మీ అధీనంలో ఉన్న కుక్కే. మీరు ఒక్క మాట చెప్తే నేను మీ దగ్గరకు వస్తాను” — అనాలి. మనం చేయవలసింది అదే — “మామేవ యే ప్రపద్యంతే” — నన్ను ఎవరైతే కొలుస్తారో, ఆరాధిస్తారో వారే మాయను దాటుతారు.

ప్రకృత్యైవ చ కర్మాణి — ఆత్మ అకర్త

దీనినే ఇంకా లోతుగా చెప్పడానికి భగవద్గీతలో పదమూడవ అధ్యాయంలో కూడా చెప్పారు. చేసేదంతా ప్రకృతి అని మనం చెప్తున్నాం. కానీ మనం ఏమంటున్నామంటే — “భగవంతుడే చేస్తున్నాడు” అంటున్నాం, లేదా “మనమే చేస్తున్నాం” అంటున్నాం. చూశారా — మధ్యలో ఉన్న ప్రకృతిని మరచిపోతున్నాం. “చేస్తే అంతా ఆయనే చేస్తున్నాడు” అంటాం, లేకపోతే “నేనే చేస్తున్నాను” అంటాం; కానీ మధ్యలో ఉన్న ప్రకృతిని మరచిపోతున్నాం. అందుకే ఇంకోచోట ఏం చెప్పారంటే:

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ॥

— భగవద్గీత 13వ అధ్యాయం

ఈ ప్రకృతే అన్నీ చేస్తోంది; ఆత్మ అకర్త — అంటే అది ఏమీ చేయడం లేదు — అని ఎవడు తెలుసుకుంటాడో, వాడే నిజంగా తెలుసుకున్నవాడు (చూసినవాడు). మామూలుగా తెలుసుకోవడం కాదు — “ప్రకృతే చేసింది, ఆత్మ చేయడం లేదు” అని ఎవడు గ్రహిస్తాడో వాడే తెలుసుకున్నవాడు అన్నారు.

మరి ఇంత ప్రయత్నమూ, పురుష ప్రయత్నమూ, ఇదంతా దేనికి? మాయను దాటడానికే కదా! సంసార బంధం నుంచి తప్పించుకోవడానికే కదా! దీనికి ఏ సాధన చేయాలి? దీనిని పక్కకు నెట్టి పైకి వెళ్ళాలా? దీనిని అణగదొక్కి పైకి వెళ్ళాలా? లేక పైన ఉన్నవాడిని పట్టుకుని దీనిని అణచాలా? దీని గురించే మొత్తం భగవద్గీతలో ఎక్కడికక్కడ చెప్పారు — ప్రకృతి వేరు, నేను వేరు అని.

అధిష్ఠానం — కర్మకు ఐదు హేతువులు

ఇంకొకచోట, పద్దెనిమిదవ అధ్యాయంలో ఏం చెప్పారంటే:

అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ॥

— భగవద్గీత 18.14

ఒక పని జరగాలంటే ఐదుగురు బాధ్యులు ఉంటారట. ఆ ఐదుగురు బాధ్యులను చూడండి — పరమాత్మ మనకు విడదీసి చెప్తున్నారు.

“అధిష్ఠానం” — ఇక్కడ అధిష్ఠానం అంటే శరీరం. “తథా కర్తా” — శరీరంలో ఉండే జీవుడు. “కరణం చ పృథగ్విధమ్” — వివిధ ఇంద్రియాలు. “వివిధాశ్చ పృథక్చేష్టాః” — చేష్టలు, అంటే మన ప్రాణాలు, పంచ ప్రాణాలు. పంచ ఇంద్రియాలు — అంటే దశేంద్రియాలు అనుకోండి — పంచ ప్రాణాలు, లోపల ఉండే జీవుడు, ఈ శరీరం. వీటితో పాటు “దైవం చైవాత్ర పంచమమ్” అన్నారు — అంటే ఇంద్రియాల అధిదేవతలు కూడా దీనికి కారకులట. ఒక పని జరిగిందంటే ఈ ఐదూ లేనిదే ఏమీ జరగదు.

ఈ ఐదూ వేరు; ఆత్మ వేరు. లోపల ఉండే పరమాత్మ వేరు.

ఇంద్రియాధి దేవతలు

ఈ ఇంద్రియాధి దేవతల గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలి. దీనికి ఒక చిన్న హాస్య కథ కూడా ఉంది. తెలియనివాడు ఒకడు దొంగతనం చేశాడట. దొంగతనం చేశాక కోర్టుకు తీసుకెళ్ళారట. “దొంగతనం చేశావు, నీకు శిక్ష” అంటే — “నాకేం సంబంధం లేదు; చేసింది చెయ్యి” అన్నాడట!

ఇంద్రియాలకు ఐదుగురు దేవతలు ఉన్నారు. ఈ ఐదుగురు దేవతలు ఒక్కొక్క ఇంద్రియానికి అధిపతులు. వారి వలన కూడా మనం ఈ పనులు చేస్తున్నాం. మనకు తెలియకుండానే కొన్నికొన్ని అలా చేస్తుంటాం, తప్పులు చేస్తుంటాం. “ఇదేమిటి, నాకు తెలియకుండా నేను ఎందుకు చేశాను?” అని మనకు మనమే ఆశ్చర్యపోతుంటాం. దీనికి ఇంద్రియ దేవతల ప్రభావం కూడా ఉంది.

దిగ్వాతార్కప్రచేతోఽశ్వి ।

“దిక్” — దిక్కులు. దిగ్దేవతకు శబ్దం — అంటే చెవి. “వాత” — గాలి; స్పర్శకూ, చర్మానికీ అధిదేవత వాయుదేవుడు. “అర్క” — సూర్యుడు; కన్నుకు సూర్యుడు. “ప్రచేతస్” — అంటే వరుణదేవుడు; నాలుకకు, రుచికి. అందుకే నాలుక దగ్గర లాలాజలం ఊరుతూనే ఉంటుంది — ఆయన ప్రభావం అది. ఆయన ప్రభావం ఎక్కువ ఉన్న కొంతమంది ఎప్పుడూ తింటూనే ఉంటారు. “అశ్వి” — అశ్వినీ దేవతలు; ముక్కుకు, సువాసనకు.

కాబట్టి ఈ ఐదుగురు దేవతలు కూడా మనం చేసే పనులకు కారకులు. శరీరం, లోపల జీవుడు, తరువాత ఇంద్రియాలు, ఇంద్రియాధి దేవతలు, పంచ ప్రాణాలు — వీరందరూ కలిపి “పంచైతే తస్య హేతవః” — ఈ ఐదే దానికి హేతువులు.

శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ॥

— భగవద్గీత 18.15

ఇదంతా పద్దెనిమిదవ అధ్యాయం. మనం ఈ మాయకు ఎంతగా లోబడి ఉన్నామో చూడండి. “శరీరవాఙ్మనోభిః” — త్రికరణాల ద్వారా, అంటే మనస్సు చేత గానీ, వాక్కు చేత గానీ, శరీరం చేత గానీ — “యత్కర్మ ప్రారభతే నరః” — మనిషి ఏ కర్మలు చేస్తున్నాడో, “న్యాయ్యం వా విపరీతం వా” — పాజిటివ్ గానీ నెగటివ్ గానీ, మంచి పని గానీ చెడ్డ పని గానీ, విహిత కర్మ గానీ నిషిద్ధ కర్మ గానీ — చేయరానిది చేసినా, చేయవలసినది చేసినా — వీటన్నిటికీ “పంచైతే తస్య హేతవః” — ఇప్పుడు చెప్పిన ఈ ఐదే హేతువులు; వీరే కారకులట. కానీ ఈ ఐదు కారకాలు తెలియక మనిషి ఇలా బంధింపబడుతున్నాడు.

సంసారం ఎలా వచ్చింది?

సంసారం ఎలా వచ్చింది అంటే — “పూర్వజన్మలో కర్మ చేశాం, ఆ కర్మఫలం అనుభవిస్తున్నాం” అని మనం సింపుల్‌గా ఒక స్ట్రెయిట్ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నాం. కానీ మనలో వివేకం ఉండి కూడా కొన్నికొన్ని చేస్తుంటాం. అలా చేయడానికి కారణం ఏమిటంటే — వీటి ప్రభావం (influence) ఎక్కువగా ఉండడం.

ఇవన్నీ మనమే, మనమే, మనమే అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉన్నాం, ఈ శరీరం (body) ఉంది; “శరీరమే నేను” అంటున్నాం. శరీరమే నేను అన్నంత మాత్రాన అజీర్ణం (indigestion) ఎందుకు వస్తుంది? పేగులో ఏదో తేడా ఉంది. పేగులో తేడా ఉండబట్టే అజీర్ణం కలుగుతోంది. ఆ అజీర్ణానికి ఏదో కారణం ఉంది — దానిని సరిదిద్దాలి (rectify చేయాలి). అంతేకానీ “నేనే” అంటే అది పోతుందా?

కాబట్టి వీటన్నిటికీ కారణం ఈ పంచ హేతువులు. వీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ప్రకృతిని మనం విడదీసి తెలుసుకోవాలి. పరమాత్మ ఎప్పుడూ ప్రకృతి వేరు అనే చెప్తున్నారు.

నాదత్తే కస్యచిత్పాపమ్

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ॥

— భగవద్గీత 5.15

మనం ఏమిటంటే అంతా భగవంతుడికి అర్పిస్తున్నాం — “ఈశ్వరార్పణమస్తు”. తప్పుడు పనులు చేసి కూడా “ఈశ్వరార్పణమస్తు” అంటాం కదా! “నాకేం తెలుసు, నాకు తెలియదు” అంటాం. మళ్ళీ దీనికి కౌంటర్‌గా — “ఇది నేను చేయలేదు, అంతా పంచ హేతువులే చేశాయి; నేనేమీ చేయలేదు, అవే చేశాయి కదా; నాకు పుణ్యపాపాలతో సంబంధం లేదు” అని అనుకుంటారేమో.

“అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః” — లోపల జ్ఞానం ఉంది; కానీ అజ్ఞానం దానిని ఆవరించి, చుట్టుముట్టింది; అందువల్ల జీవులు మోహంలో పడి బంధింపబడుతున్నారు — అన్నారు.

ఈ “అజ్ఞానం” అనే పదం గురించి అందరూ ముందుగా అడుగుతారు — “లోపల ఉన్నది జ్ఞానమే అయితే అజ్ఞానం ఎలా వచ్చింది?” అని. దీనికి శాస్త్రీయంగా (scientific‌గా) ఆలోచించాలి. ప్రతిదానినీ గుడ్డిగా కాకుండా, శాస్త్రీయంగా ఆలోచించాలి.

మనస్సే బంధం, మనస్సే మోక్షం — శక్తి స్థాయి

మనస్సే అన్నిటికీ బంధం, మోక్షం. మనస్సే బంధమూ, మోక్షమూ అయితే — ఏదో మనస్సుతో మోక్షం పొందవచ్చు కదా! ఏ మనస్సు బంధమో, ఏ మనస్సు మోక్షమో?

తక్కువ శక్తి బంధం; ఎక్కువ శక్తి మోక్షం (Less energy is bondage; more energy is mokṣa — liberation). అంటే — భేదం శక్తి స్థాయిలోనే (difference in the level of energies).

ఈ “శక్తి” (ఎనర్జీ) అనే భావనను మన గురుదేవులు తీసుకువచ్చారు. వీటన్నిటికీ — ఈ మాయ, మాయ, మాయ అంటున్నారు చూశారా, ఈ ప్రకృతి అంటున్నారు చూశారా — ఈ ప్రకృతి గురించి రమణ మహర్షి ఒక వివరణ ఇచ్చారు.

చిజ్జడ గ్రంథి — రమణ మహర్షి వివరణ

దేహో న జానాతి సతో న జన్మ దేహప్రమాణోఽన్య ఉదేతి మధ్యే ।
అహంకృతిగ్రంథివిబంధసూక్ష్మశరీరచేతోభవజీవనామా ॥

— సద్దర్శనం (రమణ మహర్షి — కావ్యకంఠ గణపతి ముని సంస్కృత అనువాదం)

రమణ మహర్షి చెప్పిన “సద్విద్య”కు వారి శిష్యులు కావ్యకంఠ గణపతి ముని గారు ఈ విధంగా రచన చేశారు.

“దేహో న జానాతి” — ఈ శరీరం జడం. “సతో న జన్మ” — లోపల ఉండే ఆత్మ పూర్తిగా చైతన్యం; దానికి జన్మ లేదు. మనం చేస్తున్న పనులకు ఈ రెండిటికీ సంబంధం లేదు. ఇందాక ఐదు హేతువులని చెప్పారు చూశారా — ఇక్కడ ఇంకా సూక్ష్మంగా రెండుగా తీసుకువస్తే: దేహం ఒక జడం. జీవుడు లేకపోతే ఈ దేహం ఏం చేస్తుంది? మనస్సు లేకపోతే ఈ దేహం ఏం చేస్తుంది? కాబట్టి ఇది జడం. అదేమో సత్పదార్థం. దానికీ కర్మలకూ సంబంధం లేదు; దీనికీ సంబంధం లేదు.

“దేహప్రమాణోఽన్య ఉదేతి మధ్యే” — మధ్యలో ఎవరో ఒకరు పుడుతున్నారట. ఎక్కడ? ఆ సత్పదార్థానికీ, ఈ జడ పదార్థానికీ మధ్యలో ఒకరు పుడుతున్నారు. దాని పేరు చిజ్జడ గ్రంథి. చిత్ అంటే సత్త్వం (చైతన్యం), జడం అంటే శరీరం. ఈ రెండిటికీ మధ్యలో పుడుతున్నాడు — దాని పేరు చిజ్జడ గ్రంథి.

ఈ చిజ్జడ గ్రంథి వలననే అహంకారమని, గ్రంథి అని, బంధమని, సూక్ష్మ శరీరమని, మనస్సని, భవమని, జీవుడని — ఏడు పేర్లు వచ్చాయి. ఈ ఏడు పేర్లూ ఎవరికి వచ్చాయి? లేనివాడికి వచ్చాయి చూశారా! ఆయనకు (ఆత్మకు) లేదు, దీనికి (దేహానికి) లేదు — మధ్యలో ఎవడో ఒకడు వచ్చాడట. అదే మాయ. మాయ అంటే ఇంతగా విశ్లేషించాలి. మాయ అంటే మామూలు మాటలు కాదు.

ఆత్మ విచారణ — శక్తి, జ్ఞానం

ఆ మాయను తొలగించడానికి ఒకే ఒక ఔషధం — విచారణ; ఆత్మ విచారణ. ఆత్మ విచారణకు కావలసిన శక్తి కావాలి. శక్తికి యోగం చేయాలి. ఆత్మ విచారణకు జ్ఞానం కావాలి. ఈ రెండూ ఉంటేనే ఆ చిజ్జడ గ్రంథి భేదింపబడుతుంది. అందువలననే దీనినంతా క్లుప్తంగా “మెంటల్ ఎనర్జీ” (మానసిక శక్తి) అన్నారు మన గురుదేవులు.

గురుదేవుల సమాధి — శక్తి క్షేత్రం

మన గురుదేవులు అంటే మామూలుగా కాదు. నేను అదే చెప్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది ఏమిటంటే — వారి సమాధి ఇక్కడే ఉంది. ఆ సమాధిలోకి వెళితే, ఎవరైనా సరే ఎక్కువసేపు సాధన చేస్తారు. (ఒక శిష్యుని ఉద్దేశించి) “నాయనా అరవింద్, నువ్వు ఎన్ని గంటలు చేశావు?” (“ఉదయం… గంటలు, గురూజీ.”) అలా అక్కడ చేస్తూ వచ్చినవాళ్ళందరూ ఎక్కువసేపు చేస్తారు. ఎందుకు? అక్కడ వారి వైబ్రేషన్స్ (స్పందనలు), ఆ శక్తి ఆ సమాధిలో ఉంది.

సమాధిలోని ఆ శక్తి రుచి చూస్తే మీకు తెలుస్తుంది — మీరందరూ చూసినవాళ్ళే. కానీ గేటు దాటితే అది పలచబడిపోతుంది (dilute అయిపోతుంది).

నేను అంటున్నది ఏమిటంటే — ఇటువంటిది మన గురువుగారి సమాధి. “మన గురువుగారు” అని గొప్ప చెప్పడం కాదు — ఇది మక్కా, జెరూసలేం — వాటన్నిటికంటే పవిత్రమైనది. పవిత్రమైనది అంటే — అది శుద్ధ శక్తి (pure energy). నువ్వు అక్కడికి వెళితే, ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే అక్కడ పరిష్కారం (solution) వస్తుంది. ఇవన్నీ జరుగుతుంటాయి.

య ఇమం పరమం గుహ్యమ్ — గురువుగారి ఔన్నత్యం

అటువంటి గురువుగారు ఎవరు? భగవద్గీతను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు.

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥

— భగవద్గీత 18.68

పద్దెనిమిదవ అధ్యాయం. “పరమం గుహ్యం” — గుహ్యం అంటే రహస్యం; పరమ రహస్యమైన ఈ విద్యను “మద్భక్తేష్వభిధాస్యతి” — ఎవరైతే నా భక్తులకు చెప్తారో, “భక్తిం మయి పరాం కృత్వా” — నాయందు పరమమైన భక్తి కలిగి, “మామేవైష్యత్యసంశయః” — సందేహం లేదు (no doubt), అతడు నన్నే చేరుతాడు.

అంటే మన గురువుగారు ఎవరై ఉంటారు? అది వారి ఔన్నత్యం. వారు ఎంత గొప్ప యోగి, ఎంత గొప్ప జ్ఞాని అనేది అర్థం చేసుకుని చెప్పవలసిన బాధ్యత ఎవరిది? వారు చెప్పిన సాధన చేసి అనుభవించేవాళ్ళదే. వారు చెప్పిన విద్యను, ఆ రహస్యాన్ని — శ్రీకృష్ణ పరమాత్మ, వారు ఒక్కటే అని — రుజువు చేసే బాధ్యత ఎవరిది? మనది. ఎంతవరకు? మనం ఎంత సాధన చేస్తే అంతవరకే.

అది తెలిసి కూడా — కొంతమంది దూరాల నుంచి వచ్చారు. వచ్చినవాళ్ళు “ఆహా! గురువుగారి సమాధి దొరికింది, లోపల ఎక్కువసేపు కూర్చోవాలి” అనుకుంటారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారు ఒకాయన — “మళ్ళీ ఇంకెప్పుడు ఈ అవకాశం దొరుకుతుంది?” అని బాగా సాధన చేసుకున్నాడు. అలాగ ఉండాలి. (అవకాశాన్ని వదులుకోకండి.)

గురుతత్త్వం — గురువు ఎప్పుడూ ఉంటారు

ఇదంతా ఏమిటంటే — ఈ గురుతత్త్వం అనేది. మనలోని ఈ చిజ్జడ గ్రంథి — మన అజ్ఞానపు ముడి — విడివడాలంటే గురు కటాక్షం కావాలి.

గురు కటాక్షం అంటే — ఇప్పుడు గురువుగారు సమాధి చెందారు కదా; “గురువుగారు శారీరకంగా ఉంటే బాగుండేది” అని కొంతమంది అనుకుంటారు. గురువుగారు ఎప్పుడు లేరు? ఎప్పుడూ ఉన్నారు! మనం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతాం; కానీ గురువుగారు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే — శ్రీకృష్ణ పరమాత్మ, వారు ఒక్కటే అని చెప్పడానికి:

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ॥

— భగవద్గీత 7.26

ఇంతకుముందు ఎవరెవరు ఏ జన్మలు ఎత్తారో అది నాకు తెలుసు; ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ నాకు తెలుసు; పుట్టబోయేవారి గురించి కూడా నాకు తెలుసు — అన్నారు. అంటే నేను ఎప్పుడూ ఉండేవాడిని. ఎప్పుడూ ఉండేవాడిని ఎలా ఉంటాను? — అనేదే ప్రశ్న. నేను చైతన్య రూపంలో, తేజో రూపంలో ఉన్నాను.

న తత్ర సూర్యో భాతి — వెలిగించే వెలుగు

ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి; నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ నక్షత్రాలకు మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు (self-luminous) అని అనుకుంటారు. కాదు, కాదు!

న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోఽయమగ్నిః ।
తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ॥

— ముండకోపనిషత్తు

అని ముండకోపనిషత్తు చెప్తోంది. “న తత్ర సూర్యో భాతి” — సూర్యుని నుంచి వచ్చే వెలుతురును మనం సూర్యుడే అనుకుంటున్నాం. కానీ సూర్యుడిని కూడా ఒకడు వెలిగిస్తున్నాడట; అక్కడ సూర్యుడు వెలగలేడట. “న చంద్రతారకం” — చంద్రుడు గానీ నక్షత్రాలు గానీ అక్కడ వెలగవు. “నేమా విద్యుతో భాంతి” — ఈ మెరుపులు కూడా అక్కడ వెలగవు. “కుతోఽయమగ్నిః” — ఇక ఈ అగ్ని కాంతి సంగతి ఎక్కడ? “తమేవ భాంతమనుభాతి సర్వం” — ఇవన్నీ దాని నుంచే వెలుగుతున్నాయి. “తస్య భాసా సర్వమిదం విభాతి” — దాని కాంతితోనే ఇదంతా ప్రకాశిస్తోంది.

ఆ వెలిగించే వెలుగు ఎక్కడ ఉంది? మనలోనే ఉంది!

ఇక్కడ సైన్స్ ఏమిటంటే — అటు నుంచి వెలుతురు వస్తోందని అనుకుంటున్నాం. అటు నుంచి వెలుతురు వచ్చిందని నువ్వు ఎలా చెప్పగలిగావు? నీ వెలుతురు వెళ్ళనిదే దానిని ఎలా పోల్చగలవు? నీ వెలుతురు వెళ్ళనిదే అటు నుంచి వస్తోందని ఎలా చూడగలవు, చెప్పగలవు? కాబట్టి అన్నిటికీ ముందు ఇటు నుంచి అటు వెళ్ళాలి.

ఇప్పుడు రెటీనాలో ఒక వస్తువు కనబడుతుంది. రెటీనాలో వస్తువు కనబడితే ఏమనుకుంటాం? బయటి దృశ్యం వచ్చి రెటీనాపై పడిందని మన సైన్స్ చెప్తుంది. కానీ రెటీనా పనిచేయడం మానేస్తే? దృశ్యం దానిపై పడినా కనబడుతుందా? కనబడదు. కనబడాలంటే ఏం కావాలి? రెటీనాలో ఏదో శక్తి ఉండాలి. అది మనలో ఉండే ఆ శక్తి, ఆ తేజస్సు. అది బయటికి వెళితేనే ఇవన్నీ కనబడతాయి. ఇన్నిటినీ వెలిగించేది ఎక్కడ ఉంది? మనలోనే ఉంది.

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ॥

— భగవద్గీత 15.6

పదిహేనవ అధ్యాయం. మొదట (ఉపనిషత్తులో) సూర్యచంద్రులు మొదలైనవాటన్నిటికీ కాంతినిచ్చేది అదే అని చెప్పారు. ఇక్కడ నేరుగా వచ్చేశారు — అది ఎక్కడ ఉంది? “తద్ధామ పరమం మమ” — నా పరంధామ స్థానం. అది ఎక్కడ ఉంది? బయట ఎక్కడో లేదు; మన లోపలే ఉంది. మన లోపల ఉన్నదే సూర్యచంద్రులను వెలిగిస్తోంది; అగ్నిని గానీ, వీటన్నిటినీ వెలిగించే ఆ వెలుతురే పరమాత్మ. అదే నీవై ఉన్నావు.

మాయ — సూర్యుని కప్పే మబ్బు

దానికీ నీకూ మధ్య ఆటంకంగా వచ్చేదే మాయ. ఈ ఆటంకం రావడం వల్లనే అది ఎక్కడో ఉంది అనుకుంటున్నాం. దాని కర్తవ్యం ఏమిటి? ఆయనను ప్రార్థించడమో, లేక ఆ జ్ఞానాన్ని సంపాదించడమో — ఏదో చేస్తే అప్పుడు ఇది తొలగిపోతుంది. తొలగకపోతే ఇదే విజృంభిస్తుంది.

ఎలా విజృంభిస్తుంది? తెల్లవారగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉదయించినప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడు? కాంతి ఉండదు; ఎర్రగా ఉంటాడు; పెద్ద బింబం, కాంతి తక్కువ. ఇవన్నీ దేని వల్ల? మన భూమి వాతావరణం గుండా ఆయన పైకి దూసుకువస్తున్నాడు. “దూసుకురావడం” అనేది మనం చెప్పుకోవడానికే — యథార్థంగా ఆయన అక్కడే ఉన్నాడు; మనమే తిరుగుతున్నాం. కానీ ఆ బాల సూర్యుడిని మంచు గానీ, ధూళి కణాలు గానీ — ఇవన్నీ కప్పాయి; కాంతి లేదు. ఆ ధూళి ఇంకా ఎక్కువైతే ఆయనను చూడలేము కూడా.

అందువలన ఈ మాయ మొదట చాలా భీకరంగా ఉంటుంది; చూడనివ్వకుండా చేస్తుంది. కానీ దానిని కాస్త తొలగించగలిగామా — తొలగించడం అంటే అర్థం ఏమిటి? దీని ఉపాయం భగవద్గీతలో ఐదవ అధ్యాయంలో చెప్పారు:

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ॥

— భగవద్గీత 5.16

ఈ జ్ఞానం రెండు రకాలు — కల్పిత జ్ఞానం, అకల్పిత జ్ఞానం. ఈ కల్పిత జ్ఞానానికి చాలా వివరణ ఉంది. ప్రస్తుతానికి మనం తెలుసుకోవలసినది ఏమిటంటే — భగవద్గీత చెప్తోంది: సూర్యుడిని మేఘం వచ్చి కప్పుతుంది. ఇప్పుడు సూర్యుడిని చూడాలనుకుంటే, ఏ మేఘమైతే కప్పుతోందో ఆ మేఘం తొలగిపోవాలి. ఏ వాయువు అయితే మేఘాన్ని తీసుకువచ్చిందో —

వాయునా నీయతే మేఘః పునస్తేనైవ నీయతే ।
మనసా కల్ప్యతే బంధో మోక్షస్తేనైవ కల్ప్యతే ॥

— వివేకచూడామణి 172 (శ్రీ శంకర భగవత్పాదులు)

అని వివేకచూడామణి చెప్తోంది. అంటే వాయువు చేతనే మేఘాలన్నీ వచ్చాయి; అది సూర్యుని పని కాదు.

అనుగ్రహం — పురుష ప్రయత్నం

భగవంతుడా — ఇక్కడే చిన్న తేడా ఉంది. “ఏం చేసినా ఆయన అనుగ్రహం ఉంటే చాలు, అనుగ్రహం ఉంటే చాలు” అంటారు. అనుగ్రహం అంటే ఆయన పక్షపాతి కాదు — అది కూడా గ్రహించాలి. అనుగ్రహం పక్షపాతం కాదు. నీ పురుష ప్రయత్నాన్నే అనుగ్రహంగా మార్చుకోవాలి. నీ పురుష ప్రయత్నాన్నే అనుగ్రహంగా మార్చుకోవాలి.

మేఘాన్ని గాలి తీసుకువచ్చింది; అది సూర్యుడిని కప్పింది. ఇప్పుడు సూర్యుడిని చూడాలంటే ఏం చేయాలి? మేఘాన్ని తొలగించాలి. దేని ద్వారా? వాయువు ద్వారానే. మరి ఇప్పుడు చేయవలసిన సాధన ఏమిటి? వాయువు (శ్వాస) ద్వారానే మనకు ఈ మబ్బు, కఫం మొదలైనవన్నీ వచ్చాయి. ఆ వాయువు ద్వారానే మళ్ళీ మనం వాటిని తొలగిస్తే సూర్యుడు కనిపిస్తాడు — “తేషామాదిత్యవజ్జ్ఞానం” — అక్కడ ఎంత చక్కని పదం వాడారు! ఆ జ్ఞానం సూర్యునిలా ప్రకాశిస్తుందట. ఇదంతా ఐదవ అధ్యాయం — ఎంత చక్కగా చెప్పారు!

బంధం — నిరంతరం కప్పుతూనే ఉంటుంది

ఇవన్నీ విశ్లేషిస్తే — మన బంధం అంటే “ఎవరో పూర్వజన్మలో…” లేక “నేను ఎప్పుడో చేశాను…” — ఇవన్నీ కాదు. శాస్త్రీయంగా రుజువు చెయ్యి. నీ లోపల ఏదో జరుగుతోంది — దానిని తొలగించు. అది జరగడం అంటే ఎప్పుడో చేసిన కర్మ కాదు; నిరంతరం (continuous‌గా) నీలో అది కప్పుతూనే ఉంది. నువ్వు నిరంతరం దానిని తొలగించాలి.

ఇప్పుడు పశుపక్ష్యాదులు — ఇవన్నీ ఏం అనుభవిస్తున్నాయి? కర్మఫలాన్ని అనుభవిస్తున్నాయి — అంతే. కర్మఫలాన్ని తొలగించుకునే అవకాశం వాటి జన్మకు లేదు. కానీ మానవుడు కూడా పశువుల్లాగే ఆ కర్మను అనుభవిస్తే? కొంతమంది పెద్దలు “ఏమీ అక్కరలేదండీ, అనుభవిస్తే కర్మ పోతుంది” అంటారు. కర్మను అనుభవిస్తే పోతుంది అంటే — మరి దానికి అంతం ఎక్కడ? (Then where is the end for it?) కర్మ అనుభవిస్తున్నాడు — అంతం ఉందా? అంతం లేదు.

ఒక కల కంటున్నాడు. ఆ కలలో కర్మలు అనుభవిస్తూనే ఉన్నాడు; కలలు కంటూనే ఉన్నాడు. దీనికి అంతం ఏమిటి? “అనుభవిస్తే పోతుంది” అంటే — కల అలా సాగుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి? లే! మేలుకో!

అహం బ్రహ్మేతి విజ్ఞానాత్కల్పకోటిశతార్జితమ్ ।
సంచితం విలయం యాతి ప్రబోధాత్స్వప్నకర్మవత్ ॥

— అధ్యాత్మోపనిషత్తు 50

“అహం బ్రహ్మేతి విజ్ఞానాత్” — “నేనే బ్రహ్మాన్ని” అనే విజ్ఞానం చేత. విజ్ఞానం అంటే అనుభవపూర్వక జ్ఞానం. అనుభవపూర్వక జ్ఞానం అంటే — ఏదైతే అడ్డంగా ఉందో దానిని తొలగించిన తరువాత మిగిలే జ్ఞానం. ఆ జ్ఞానం చేత, “కల్పకోటిశతార్జితమ్” — శతకోటి కల్పాలలో కూడబెట్టుకున్న సంచిత, ఆగామి కర్మలు — మన పాపకర్మలు అన్నీ — “విలయం యాతి” — నశిస్తాయి. ఎప్పుడు? “ప్రబోధాత్స్వప్నకర్మవత్” — నిద్రపోయినవాడు లేస్తే కలలోని కర్మలన్నీ పోయినట్టు.

పడుకున్నవాడు లేవడం ముఖ్యమా? లేక కలలోనే ఉండి, కలలోనే అనేక కర్మలు చేసి, స్వర్గానికి వెళ్ళి, అక్కడ జన్మించి — “ఓహో!” — లక్షల స్వర్గాలు, లక్ష సంవత్సరాలు స్వర్గాలు అనుభవించడమా? అవన్నీ ఎక్కడివి? కలలే! కాబట్టి అవి సుఖమూ కాదు, దుఃఖమూ కాదు. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? “ప్రబోధాత్స్వప్నకర్మవత్” — కలగంటున్నవాడు మెలకువలోకి వస్తే అవన్నీ పోతాయి.

ఈ మెలకువ రావడం అనే విధానం తెలియకపోవడం వల్లనే — “భజన్ కరో”, లేకపోతే “ఇంకోటి కరో” — ఏదో ఒకటి మనం చేస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ చేయడం తప్పు అని కాదు. అర్థం కానంతవరకు ఇలా ఇదంతా చేస్తున్నాం.

మహాత్ముల దర్శనం — శక్తి సంపూర్ణం

తరువాత ఎక్కడో ఒకచోట ఒక మహాత్ముని మాట చెవిలో పడింది అనుకోండి — నీ సందేహ నివృత్తి ప్రారంభమవుతుంది. సందేహ నివృత్తి ఆరంభమైందంటే ఇక నీ జన్మ తరించినట్టే. అందుకే:

సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ ।
సంభాషణం కోటితీర్థం వందనం మోక్షదాయకమ్ ॥

అన్నారు. మహాత్ముల దర్శనం అంటే అర్థం ఏమిటి? అది అలాంటి ఇలాంటి దర్శనం కాదు — అది శక్తితో నిండినది (It is full of energy). మహాత్ముల దర్శనం అంటే శక్తితో సంపూర్ణం. ఆ శక్తి ఎప్పుడైతే నీ లోపల, నీ మనస్సులో ప్రవేశించిందో, అప్పుడు నీ సందేహాలు (doubts) తీరడం ప్రారంభమవుతాయి. తరువాత వారిని అంటిపెట్టుకుని ఉంటావు.

మహాత్ములు దొరకడం కష్టం — మొన్న చెప్పాను కదా. దొరికిన తరువాత మనం ఏం చేస్తున్నాం? “సాధన ఎప్పుడైనా చేసుకోవచ్చులే; సంసారం మనకు ఎప్పుడు దొరుకుతుంది?” అన్నట్టుంది మన తీరు! గురువుగారు ఇచ్చిన సాధన దొరికింది — “అది ఎప్పుడైనా, రాత్రి పగలు, మనకు నచ్చినప్పుడు, తీరిక దొరికినప్పుడు చేసుకోవచ్చు; కానీ సంసారం (పని) ఎప్పుడు దొరుకుతుంది?” — కొంప మునిగిపోయినట్టు!

పరీక్ష అంటే ఏమిటి?

ప్రతి ఒక్కరూ “పరీక్ష” అంటారు. పరీక్ష అంటే ఏమిటి? పరీక్ష ఎవరు పెట్టారు? ఆయన పరీక్ష పెట్టాడని మనం అనుకుంటాం. మనం తట్టుకోలేకపోతే “పరీక్ష” అంటాం; తట్టుకుంటే అనం. తట్టుకోలేకపోవడమే “పరీక్ష”. మళ్ళీ ప్రశ్న — కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు? నువ్వు దానికి సిద్ధంగా లేవు (You are not prepared for that). ఒక బాధ వచ్చిందంటే — అనుభవించడానికి నువ్వు సిద్ధపడలేదు. “అమ్మో! అది అయిపోతుంది, ఇది అయిపోతుంది!”

మంచి రోజులు, చెడ్డ రోజులు — మనో దౌర్బల్యం

ఇంకొకటి ఏమిటంటే — చాలామంది “ఈ రోజు నాకు బాగుంది”, “నేను అనుకున్నది జరగదు”, “నేను ఏ పనిలో కాలు పెట్టినా అది ఐరన్ లెగ్ — పని జరగదు” అనుకుంటారు. “ఈ రోజు నాకు బాగాలేదు” — ఏమిటి? నీకు బాగున్న రోజు ఒకటి వస్తుంది, బాగాలేని రోజు ఒకటి వస్తుందా? సూర్యుని గమనంలో అవి వస్తాయా? అవన్నీ దేనికి? నీ బలహీన మనస్సును (weak mind) బయటపెడుతున్నావు — అంతే.

బాగాలేకపోవడం ఏమిటి? ఈ వేళ వర్షం, మబ్బుగా ఉంది — హాయిగా ఉంది. రేపు ఎండ ఎక్కి, బగబగా మండిపోతుంది. “ఇవాళ బాగుంది, రేపు బాగాలేదు” అంటామా? అది ప్రకృతి. ప్రకృతి వస్తూ పోతూ ఉంటుంది.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ॥

— భగవద్గీత 2.14

ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి.

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ॥

— భగవద్గీత 5.22

ఐదవ అధ్యాయం. ఇవన్నీ వస్తుంటాయి. వచ్చినప్పుడు — నీవు అనుకున్నది జరిగితే మంచి రోజులా? జరగకపోతే చెడ్డ రోజులా? “ఈ రోజు నాకు బాగాలేదు”, “అందరికంటే వాడు బాగా ఉన్నాడు”, “నేను పాపిష్ఠినా?”, “నేను కర్మలు అనుభవించవలసినవాడినా?” — ఇవన్నీ ఏమిటి? మన కల్పిత కట్టుకథలు.

ఒకే ఒక విషయం — నీ శక్తిని పెంచుకో (The only thing is: increase your energy). నువ్వు నీ శక్తిని పెంచుకో. అది తగ్గితే ఇవన్నీ వస్తాయి. ఈ మూఢనమ్మకాలు, దురాచారాలు — వీటన్నిటికీ కారణం ఎవరు? నీ దౌర్బల్యం — మనో దౌర్బల్యం అన్నారు. ఇంగ్లీషులో చెప్పాలంటే — మానసిక శక్తి లోపం (deficiency of mental energy). తెలుగు, సంస్కృత భాషా పండితులు దానిని “మనో దౌర్బల్యం” అంటారు.

అందువల్ల — తాము తెలుసుకున్నవారు ఒకలా; ఈ సారం తెలియనివారు, పాపం, అనేక రకాలుగా ఇవన్నీ చేస్తున్నారు. “అబ్బే, నాకు బాగానే ఉంది, నాకు నిజం తెలుసు; కానీ మా ఇంట్లో బాగాలేదు — ఏదో యాగం చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం” అంటారు. “అన్నీ బాగానే ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు; కానీ ఇంట్లో నిరంతరం బాధగా ఉంది — మనకు ఏదో చేద్దాం” — ఎక్కువమందికి అదే ధోరణి.

రుద్రయాగం — శ్వాసలోనే

ఏమిటి రుద్రయాగం? ఇక్కడ — శ్వాసలో నుంచి వేడిగా వస్తోంది. శ్వాసలో నుంచి వేడిగా వచ్చే ఆ శ్వాసనే రుద్రుడు అన్నారు. శ్వాసలో వస్తున్న వేడిని రుద్రుడు అన్నారు. ఇంకా పైకి వెళితే విష్ణువు; ఇంకా పైకి వెళితే బ్రహ్మ. ఇది బ్రహ్మ, విష్ణు, రుద్రుల క్రమం. రుద్రయాగం అంటే అర్థం ఏమిటి? బయటికి వస్తున్న ఆ వేడిని లోపలికి తీసుకువెళ్ళు — అదే రుద్రయాగం.

అంత ధైర్యం మనకు లేదు. ఎందుకంటే — డబ్బులు ఉన్నాయి, యాగం చేసేవాళ్ళు ఉన్నారు; ఒక కోటి ఖర్చుపెడితే సరిపోతుంది. నేను విమర్శించడం కాదు — అంతకంటే ధైర్యం మనకు కావాలి. తీర్థయాత్రలను విమర్శిస్తుంటాం, అయినా తీర్థయాత్రలకు వెళ్తుంటాం — అది వేరే విషయం. జీవితంలో ఒక్కసారి (once in a lifetime) అలాంటి సందర్భం వస్తుంది.

కర్మ చేయడానికి మరొక కారణం — భగవంతుడిచ్చే సందర్భాలు

మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. కర్మ చేయడానికి ఇంకొక కారణం ఉంది. కర్మ చేయడానికి కారణం మన మనస్సే. కానీ ఆ సర్వేశ్వరుడు మన నిత్య దైనందిన జీవితంలో కొన్నికొన్ని సందర్భాలు ఇస్తుంటాడు. ఆ సందర్భాలలో నువ్వు చేయవలసి ఉంటుంది. ఆ సమయాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకున్నావా?

ఒక భిక్షగాడు వచ్చాడు అనుకోండి. మామూలుగా ఎంతోమంది భిక్షగాళ్ళను చూస్తుంటాం. ఒకానొక సందర్భంలో వాడు వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు మన దగ్గర డబ్బు ఉంది; ఇచ్చే సందర్భం కూడా ఉంది; ఇవ్వడానికి ఏ ఆటంకమూ లేదు. అయినా సరే “పో” అంటాం. ఆయన (భగవంతుడు) అనుకుంటాడు — “వీడికి అవకాశం ఇచ్చాను; ‘పో’ అన్నాడు” — అంతే.

అలాంటి అవకాశాలను వినియోగించుకోవడానికి కూడా కర్మలు చేయవలసి ఉంటుంది. ఆ సందర్భాలను భగవంతుడు, గురుదేవుడు ఇస్తూ ఉంటారు. కాబట్టి “కర్మ చేయడం” అంటే — నీకు నువ్వు కర్తృత్వం పెట్టుకుని చేసే కర్మ వేరు; యాదృచ్ఛికంగా వచ్చే కర్మలు వేరు. అవి వస్తుంటాయి — వాటిని నువ్వు చేయవలసిందే. చేయక తప్పదు.

కుర్వన్నపి న లిప్యతే

అందుకే పరమాత్మ “కుర్వన్నపి న లిప్యతే” (భగవద్గీత 5.7) అన్నారు — ఏం చేసినా అంటుకోకుండా ఉండు. కర్మ చేశావా — అంటుకుంటుంది.

కర్మణా బధ్యతే జంతుర్విద్యయా తు విముచ్యతే ।
తస్మాత్కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః ॥

కర్మ చేత ప్రతి జీవుడూ బంధింపబడతాడు. ఎందుకంటే దానికి ఫలితం ఉంటుంది — పాజిటివ్ అయినా, నెగటివ్ అయినా (whether positive or negative). ఆ ఫలితం కోసం నువ్వు శరీరం ఎత్తాలి, జన్మ ఎత్తాలి. ఎత్తాక అనుభవించడంతో సరిపోదు — మళ్ళీ కర్మ చేస్తూనే ఉంటాం, కర్మ చేస్తూనే ఉంటాం. అందుకని కర్మ చేయకుండా ఉండాలనేదే మన లక్ష్యం. కానీ:

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ।
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ॥

— భగవద్గీత 3.8

మూడవ అధ్యాయం. “నియతం కురు కర్మ త్వం” — చేయవలసి వచ్చిన కర్మను చెయ్యి. “కర్మ జ్యాయో హ్యకర్మణః” — కర్మ చేయడం మానేయడం కంటే కర్మ చేయడమే శ్రేష్ఠం. ఎందుకు? “శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః” — కర్మ చేయకుండా ఈ శరీరయాత్ర కూడా నడవదు. సన్యాసికైనా సరే, అడవిలో ఉండే మునికైనా సరే — అది కర్మ చేయిస్తూనే ఉంటుంది.

నీ ప్రకృతి, భగవంతుని ప్రకృతి — నిష్కామ కర్మ

దానిని ఎవరు చేయిస్తున్నారు? ప్రకృతి. ప్రకృతి అంటే మళ్ళీ ప్రశ్న. ఇది నేను చెప్పాను చూశారా — భగవంతుని ప్రకృతి వేరు, నీ ప్రకృతి వేరు. నీ ప్రకృతి, బయట ఉన్న భగవంతుని ప్రకృతి — ఈ రెండూ కలిసిపోవాలి (coincide కావాలి). కలిసిపోతే అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏం చేస్తావు?

“నీ ఇచ్ఛ నెరవేరుగాక” — భగవంతుడు ఏదో చెప్తుంటాడు; “సరే, నీ ఇష్టమే జరగనీ” అని — “నీ ఇచ్ఛ నెరవేరుగాక” — ఈ (తన) ప్రకృతిని వదిలిపెట్టి, బయట ఉన్న భగవంతుని ప్రకృతికి అప్పగిస్తాడు. అప్పుడు నీకేమిటి? అదే నిష్కామ కర్మయోగం.

నిష్కామ కర్మ అంటే — చెయ్యి! ఏమీ చేయకుండా ముక్కు మూసుకుని కూర్చుంటే సరిపోదు; చేయవలసినది చేయాలి. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం గనుక. అయితే సంసారంలో ఉండి కూడా అంటుకోకుండా ఉండాలి. అలా ఉండాలనుకుంటే ఒకే ఒక మార్గం — “పద్మపత్రమివాంభసా” (భగవద్గీత 5.10) — తామరాకు మీద నీటిబొట్టులా.

ఆ పదం ఎందుకు వేశారు? సంసారంలో ఉంటూ అంటుకోకుండా ఉండే విధానం ఉంది కాబట్టే “పద్మపత్రమివాంభసా” అన్నారు — తామరాకు మీద నీటిబొట్టులాగా. లేకపోతే ఆ పదం చెప్పవలసిన అవసరం ఏమిటి? అంటే — నువ్వు కర్మ చేయవలసి వస్తుంది; అంటుకోకుండా చేసే విధానం నేర్చుకోవాలి.

మానసిక శక్తి — శ్వాస రహస్యం

ఈ విధంగా మనం బాధలు అనుభవించడానికి ముఖ్యమైన కారణం — మాయ యొక్క ప్రభావం (influence). ఆ మాయ ప్రభావాన్ని మళ్ళీ శాస్త్రీయంగా నిర్వచించాలంటే (derive చేయాలంటే) — అది మానసిక శక్తి లోపం (deficiency of mental energy).

ఆ శక్తి ఎలా వస్తుంది? బయటి గాలిని తీసుకుంటే నీ లోపలి శక్తి తగ్గిపోతుంది. లోపలి గాలినే (ప్రాణాన్నే) తీసుకుంటే నీకు శక్తి పెరుగుతుంది. ఇంతే తేడా.

ప్రాణాయామం అంటే ఏమిటి? లోపలి గాలి కదిలితే అది ప్రాణాయామం; బయటి గాలిని ఎక్కువ తీసుకుంటే అది శ్వాసాయామం. మరి బయటి గాలిని ఎక్కువ తీసుకుంటున్నామో లేదో ఎలా తెలుస్తుంది? విడిచిపెట్టే గాలి ఎక్కువైతే బయటి గాలిని ఎక్కువ తీసుకున్నట్టు లెక్క. విడిచిపెట్టే గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి — బయటి గాలి ఎక్కువ తీసుకుని లోపలికి వెళ్ళింది; అది ఇమడదు; బయట పెట్టవలసిందే.

అదే మీరు ప్రాణాయామం చేశారు అనుకోండి — ఉపదేశం పొందిన నాటి నుంచి ఇలా చేయి పెట్టుకుని చూస్తే — అది తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అంటే అర్థం ఏమిటి? బయటి గాలిని లోపలికి తీసుకోవడం తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గుతుంది? లోపలి ప్రాణాన్ని తీసుకుంటే.

లోపలిది ప్రాణం; బయటి గాలి అపానం. లోపలిది ప్రాణం, బయటి గాలి అపానం — మీకు అర్థమైందా? ప్రాణాపానాలు రెండింటినీ ఏకం చేయాలి అంటే అర్థం ఏమిటి? ఏకం చేయడం కాదు — అపానాన్ని తీసివెయ్యి. తీసివేస్తే మిగిలేది ప్రాణమే. నువ్వు దానితోనే ఉన్నావు; ఇది (అపానం) వచ్చి దానిలో చేరుతోంది. అందులో నుంచి నువ్వు ఎంత తీసివేస్తే లోపల అంత శక్తివంతం (powerful) అవుతుంది.

రాంట్‌జెన్ — కాథోడ్ కిరణాలు

రాంట్‌జెన్ (Röntgen) అని ఒకాయన ఎక్స్-రే కనిపెట్టారు. ఆయన ఏం చేశారో తెలుసా? కాథోడ్ కిరణాలు (cathode rays) కనిపెట్టారు కదా. అవి కనిపెట్టినప్పుడు ఒక గొట్టం (tube) పెట్టుకున్నారు. ఆ గొట్టంలో ఒకచోట పాజిటివ్, ఒకచోట నెగటివ్ — ఆనోడ్, కాథోడ్ — అని పెట్టి, వీలైనంతవరకు అందులో పూర్తిగా శూన్యాన్ని (vacuum) సృష్టించారు. పూర్తిగా ఖాళీ (empty) చేశారు — కానీ ఎవరూ పూర్తిగా ఖాళీ చేయలేరు; ఎంతో కొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిన కొంతలో నుంచి విద్యుత్తును (electricity) పంపించారు. పంపిస్తే ఏమి వచ్చింది? కాథోడ్ నుంచి అందమైన కాంతి కిరణాలు వచ్చాయి (There are beautiful beams of light coming from the cathode). అందుకే వాటిని కాథోడ్ కిరణాలు అన్నారు — అవే ఎక్స్-రేలు.

ఆ మహానుభావుడు — అంటే పైన ఉన్న ఆ మహానుభావుడు (భగవంతుడు) — ఆయన ద్వారా ప్రేరణ చేశాడు. ప్రతి ఒక్కరికీ జరిగేది ఇదే — ఆ పైవాడు ఆయనలో ప్రవేశించి, ఈ లోకానికి ఉపయోగపడాలని అదంతా చేయించాడు.

(అదే విధంగా) మనం బయటి గాలిని తొలగించి, లోపలి ప్రాణంతో ఉంటే — లోపల శక్తి ప్రకాశిస్తుంది.

కుంభకం — జాగ్రత్త

బయటి గాలిని లోపల నింపడం మాత్రమే కాదు — కుంభించడంలో రకాలు ఉన్నాయి. కానీ (బయటి గాలిని బలవంతంగా నింపి ఆపడం) మాత్రం మహా ఘోరం. ఈ ఘోరం ఏమిటంటే — మన ధాన్యం బస్తా నిండా ధాన్యం, వడ్లు నిండి ఉన్నాయి. అది నిండిపోయింది; ఇక ఇంకేమీ పట్టదు (It cannot accommodate more). దానిలో ఇంకా కొద్ది ధాన్యం దట్టించి కుక్కాను అనుకోండి — ఏమవుతుంది? చినిగిపోతుంది; ఎక్కడో చిరిగి బయటకు పోతుంది.

అదే విధంగా — మన లోపల ప్రాణం నిహితమై (నిండి) ఉంది. అది బయటికి వచ్చి దేనితోనో కలుస్తోంది — ఈ అపానంతో. దానిని తీసివేయడం మానేసి, బయటి గాలిని కూడా తీసుకువచ్చి కుంభించాం అనుకోండి — ఈ బస్తా చిట్లిపోతుంది.

అందుకనే హఠయోగంలో అజీర్ణం (indigestion) మొదలైనవన్నీ రావడానికి కారణం — “కుంభకం” అనే పదం ఉంది కానీ, అది ఎలా కుంభించాలో, ఎప్పుడు కుంభించాలో, గురుముఖతః ఎలా చేయాలో తెలియకపోవడం. “బాగా గాలి తీసుకుని నేను ఐదు నిమిషాలు ఆపుతాను” అని కొంతమంది ఐదేసి నిమిషాలు, ఇన్నేసి నిమిషాలు ఆపుతారు. ఆపితే ఏమవుతుంది? తాత్కాలికంగా లోపలి గాలి కూడా స్తంభింపబడుతుంది. అప్పుడు మనస్సు కూడా స్తంభిస్తుంది; సంకల్పాలు తగ్గుతాయి. కానీ లోపల కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోయి (accumulate అయిపోయి), తరువాత అది విషం (poison) అవుతుంది. విషం అవుతుంది — అర్థమైందా?

హఠయోగుల ముఖం నల్లగా ఉంటుంది; (రాజ)యోగుల ముఖం కాంతివంతంగా ఉంటుంది. సాధన చేసేవారికి ఇవన్నీ అనుభవమే.

అఖండ ప్రాణాయామం — ఆవు ఉదాహరణ

ఇంత అనుభవమైనా సరే, “దీనికంటే ఇంకేదో ముఖ్యమైనది (important) ఉంది” అని మనం ఈ అఖండ ప్రాణాయామాలకు, వీటన్నిటికీ ఎగ్గొడుతున్నాం. అఖండ ప్రాణాయామాలకు ఎగ్గొడుతున్నాం.

దీనికి రమణ మహర్షి ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. బయట గడ్డి తినే ఆవు — దానికి అలవాటు పడిపోయింది. బయట ఇతరుల పొలాల్లో ఉండే గడ్డి అంతా తినే ఆవు. దానిని తీసుకువచ్చి కట్టేశాడు. కట్టేసి, దానికంటే మించిన మంచి గడ్డి ఇక్కడ పెట్టాడు. కానీ దానికి దొంగబుద్ధి కదా — ఆ కట్టు తెంచుకుని మళ్ళీ బయటికి వెళ్ళింది చూశారా!

అదే విధంగా — సకల భోగభాగ్యాలు, సుఖసౌఖ్యాలు, ఆనందం — అన్నీ లోపలే ఉండగా, ఈ ఇంద్రియాలతో కలిసి మనస్సు ఏం చేస్తుందంటే — దొంగబుద్ధితో బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి తినేది ఏమీ లేదు; దానికంటే మంచి గడ్డి ఇక్కడే ఉంది. కానీ అలవాటు — అదే “మోహం”.

మోహం అనే పదం దేనికి పెట్టారంటే — యథార్థం ఏమిటో తెలియక, అదేదో గొప్పది అనుకుని దాని మీద మనస్సు పడడం.

ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ॥
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ॥

— భగవద్గీత 2.62–63

ఇవన్నీ వరుసగా — నువ్వు బయటికి వెళ్ళి ఎలా పడిపోతున్నావో (how you are falling down) — ఒక పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు.

యత్ర యోగేశ్వరః కృష్ణః

శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరు? అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉండేవారు వారే. మన గురువుగారు కృష్ణుడిని తలచుకుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకునేవారు. అంటే అర్థం ఏమిటి? వారు “అది” అయిపోయారు. అప్పుడు వారు అది అయిపోయారు కాబట్టే అలా స్మరించేవారు.

మనం చేసేది ఏమిటంటే — ఉట్లు కొట్టడం, లేకపోతే బాలకృష్ణ వేషాలు వేయడం — ఇవన్నీ మామూలుగా చేసుకోవడం. కానీ అసలైనది ఏమిటి?

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥

— భగవద్గీత 18.78

ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడో — అందరూ అర్జునులే; ప్రతి జీవుడూ అర్జునుడే; కానీ ధనుర్ధారి అయిన జీవుడు — అక్కడ అన్నీ ఉన్నాయి అన్నారు.

బ్రహ్మవిద్య — అతి సులభం, అతి కష్టం

ఈ బ్రహ్మవిద్య ఎటువంటిది అంటే — చేస్తుంటే “ఈ పూటే చేరిపోతాను” అన్నట్టే ఉంటుంది. చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే — శుభ్రం (clean) అవుతూ ఉంటే — “ఇంకేముంది! నాకు కలిగిపోయింది; ఇక నేను అక్కడికి వెళ్ళిపోయాను” అనేటట్టుగానే ఉంటుంది. కానీ నాచు కప్పేస్తుంది. బయటికి వచ్చిన వెంటనే నాచు కప్పేస్తుంది. నాచు కప్పేస్తే మళ్ళీ మొదలుపెట్టాలి.

బ్రహ్మవిద్య అంటే అర్థం — ఇది అతి సులభమైనది, అతి కష్టమైనది. అతి కష్టం ఎందుకంటే — గురువును నమ్మకపోవడం. గురువును నమ్మకపోవడం!

గురువును ఎందుకు నమ్మలేకపోతున్నావు? నీవు చేసిన సాధనలో కలిగిన ఆ అనుభూతి ఉంది చూశారా — ఆ అనుభూతికి కారకులెవరు అనేది నువ్వు ఆలోచించు. కృతజ్ఞతా భావం!

కొంతమంది “నాకు రహస్యాలు తెలిసిపోయాయి; ప్రపంచమంతా (నాకు తెలుసు)” అనుకుంటారు. రహస్యాలు కాదు — ఒక రహస్యం నీకు వచ్చిందంటే అది ఎవరిది? అనాది నుంచి, గురు పరంపర నుంచి — వారందరూ తపస్సుతో సంపాదించిన ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి ధారపోశారు. అది ఒక గురువు ద్వారా నీకు అందింది. నువ్వు వారందరినీ మరచిపోయావు; ఈ గురువును కూడా మరచిపోయి నువ్వు సాధన చేస్తే — ఇక అది ఎక్కడ దొరుకుతుంది?

అందుకనే — యోగం చేసేవాళ్ళందరూ మోక్షం పొందలేరు; కానీ యోగం వలననే మోక్షం కలుగుతుంది. చూశారా — యోగం వలననే మోక్షం కలుగుతుంది; కానీ యోగం చేసేవారందరూ మోక్షం పొందలేరు. కారణం — ఈ అనుపానాలు (సహాయక నియమాలు) తక్కువ.

యదా సద్గురుకటాక్షః — గురువుపై నమ్మకం

అందువలన బ్రహ్మవిద్య ఫలవంతం కావాలంటే ఏం కావాలి? గురువును నమ్మాలి. గురువును నమ్మడం అంటే మామూలుగా నమ్మడం కాదు — నీ నరనరాల్లో కూడా అది పాతుకుపోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే — ఈ వేళ నీకు సత్ఫలితం కలిగిందంటే ఎవరి వల్ల? కళ్ళ నీళ్ళు పెట్టుకుని, “నా గురువు వల్లనే ఇది వచ్చింది; నేను ఏమీ కాదు” అని నువ్వు భావించాలి.

యదా సద్గురుకటాక్షో భవతి తదా వేదాంతశ్రవణధ్యానాదౌ శ్రద్ధా జాయతే ।

గురువును సంతోషపెట్టాలి (pleasing చేసుకోవాలి); గురువును నమ్ముకుని ఉండాలి; గురువును సంతోషపరచాలి. ఎప్పుడైతే గురు కటాక్షం కలుగుతుందో, అప్పుడే — “తదా వేదాంతశ్రవణధ్యానాదౌ శ్రద్ధా జాయతే” — వేదాంత శ్రవణం, ధ్యానం మొదలైన వాటన్నిటియందు శ్రద్ధ కలుగుతుందట.

ఈ వేళ “నేను సాధన చేద్దాం” అని కూర్చున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. కొన్నికొన్ని సందర్భాలలో పక్కన ఒక సీనియర్ సాధకుడు కూర్చుంటాడు; ఆయన ఎక్కువసేపు చేయగలుగుతాడు. ఈ ఎక్కువసేపు చేయగలిగే అవకాశం ఎవరు ఇచ్చారు? గురువే! అదే గురువు యొక్క అస్తిత్వం — దానిని పోల్చుకోవడం కష్టం.

గురువు యొక్క అస్తిత్వం ఎక్కడ ఉంది? “అహం చిత్తే వ్యవస్థితః” — నేను నీ చిత్తమందే ఉన్నాను. నీ చిత్తమందే ఉన్నాను; నీ సంకల్పంలో, ప్రతిదానిలో కూడా నేను ఉన్నాను.

వాసనా బలం

దానిని పట్టుకోనివ్వకుండా చేసేది ఏమిటంటే — బయట అనేక రకాలుగా ఉన్న ఈ వాసనా బలం. అందుకనే ఒక పదిమంది సాధనలో కూర్చున్నారు అనుకోండి — పదిమందీ బాగానే చేస్తున్నారు; కానీ వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి; బయట వారి ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే వారి వాసనలు వేరు.

గురువుగారి సమాధి అని, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, ఒక ఇన్‌స్పెక్టర్ గారు — “నేను నాలుగు గంటలు పద్మాసనంలో కూర్చుని యోగం చేస్తున్నానండీ” అన్నారు. “నాలుగు గంటలు చేస్తున్నాను; మీరు ఇచ్చిన సాధన చేస్తున్నాను; చాలా మంచిది, చాలా శక్తి వస్తోంది” అన్నారు. తరువాత ఆ మనిషి కనబడలేదు! మరి ఏమిటి? ఇంత కలిగాక కూడా ఆ మనిషి మళ్ళీ కనబడలేదు.

గురువే అందరికంటే ఆత్మీయుడు

అందుకని — నీ మనస్సును కాపాడేది ఎవరు? నీ గురువే; మరెవరూ కాదు. మమకారంతో — ధనకనక వస్తువాహనాలు గానీ, సంతానం గానీ — వీరందరూ నీకు ఆత్మీయులే. కానీ అందరికంటే ఆత్మీయుడు ఎవరంటే — గురువే. ఎందుకంటే అది మనస్సుకు సంబంధించినది.

మనస్సు గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మిమ్మల్ని ఆసనంలో కూర్చోమంటే అందరికీ కాళ్ళ నొప్పులు — లేకపోతే అదే ఆలోచిస్తాం. అదే ఇక్కడ (భ్రూమధ్యంలో) దృష్టి పెట్టి, గురుస్మరణతో నువ్వు సాధన మొదలుపెట్టావు అనుకోండి — నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువసేపు కూర్చుంటావు! ఊహించిన దానికంటే ఎక్కువసేపు కూర్చుంటావు. కూర్చోబెట్టేది ఎవరు? “ఆహా! నేనే కూర్చున్నాను” అనుకుంటావు. నీకు ఆ సంకల్పాన్నీ, ఆ సహనశక్తినీ (endurance power) ఇచ్చేది ఎవరంటే — గురువే. అంటే నీ మనస్సులో ఏది సాధించినా సరే, ఆ సాధనకు మూలపురుషుడు ఎవరంటే — గురువే.

న గురోరధికమ్ ।

అందుకే “గురువు కంటే అధికమైనది ఏదీ లేదు” అనాలి. ఏదైనా ఉంటే వదిలిపెట్టు — సంసారమే కాదు, ఏదైనా సరే వదిలిపెట్టు. నీకు పర్వాలేదు; నీ సంసారం పోదు, పాడైపోదు; భార్య ఎక్కడికీ వెళ్ళిపోదు. నువ్వు ముందు గురువుకు ప్రాధాన్యం (preference) ఇచ్చి వచ్చెయ్యి; మిగతావన్నీ వదిలిపెట్టు.

ఇది నా గొప్ప కాదు — నేను అది అనుభవించాను కాబట్టి, చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ అవకాశం గురువుగారు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను.

సిరికిం జెప్పడు — గురువు పిలుపుకు పరుగు

గురువు అంటే ఆ విధంగా! “సిరికిం జెప్పడు, శంఖచక్రయుగముం జేదోయి సంధింపడు” అని (పోతన గారు గజేంద్ర మోక్షంలో) చెప్పారు కదా — ఎవరు? విష్ణువు! ఎవరికీ చెప్పకుండా పరిగెత్తుకుని వచ్చాడు. అంతకంటే వేగంగా (speed‌గా) రావాలి గురువు మాటకు! గురువు మాటకు ఆ ఒక్కటే — వేగంగా రావాలి.

అప్పుడు — అక్కడ గెస్ట్‌హౌస్ ఉండేది; గురువుగారు ఇక్కడ ఉండేవారు. ఇది చాలామందికి తెలుసు; అప్పుడు ఉన్నవాళ్ళకు తెలుసు. స్వామీజీ “డాక్టర్!” అని పిలిచేవారు. ఆ పిలుపు వినగానే నేను భూమి మీద నడిచేవాడిని కాదు — అసలు నడుస్తున్నట్టే నాకు తెలియదు. పరిగెత్తుకుని ఎక్కడి నుంచి వచ్చేవాడినో, ఎలా వచ్చేవాడినో తెలియదు. “స్వామీజీ!” అని వచ్చేవాడిని. ఆ శక్తిని కూడా ఇచ్చేది ఎవరు? మళ్ళీ నేను కాదు. ఆ ప్రేమతో వారు పిలిచారు కాబట్టి ఆ శక్తి నాకు వచ్చింది.

గురు ప్రేమ — గురువు కోపం

గురువు యొక్క ప్రేమ అనేది — తాత్కాలికంగా అనేక రకాలుగా అనుకుంటారు. గురు ప్రేమ వర్ణనాతీతం; తల్లి ప్రేమ కంటే ఎక్కువ.

శివే రుష్టే గురుస్త్రాతా గురౌ రుష్టే న కశ్చన ।

అన్నారు. (శివుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు; గురువు కోపిస్తే రక్షించేవారు ఎవరూ లేరు.) గురువుకు కోపం వస్తే మార్గం లేదు — కోపం రాకుండా చూసుకోవాలి. గురువుకు అంత కోపం వస్తుందని కాదు; మనం ఎక్కడెక్కడ అశ్రద్ధ చేస్తున్నామో దానిని మనం విశ్లేషించుకోవాలి, విశదీకరించుకోవాలి, విమర్శించుకోవాలి. విమర్శించుకుంటే — మనం చేసిందంతా తప్పే అని తెలుస్తుంది.

స్వయమేవాత్మనాత్మానమ్ — గురుతత్త్వం ఎంత లోతైనది

గురువు అంటే ఏదో ఒక మనిషి కాదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో “నేను ఎవరు” అని అంతా వర్ణించారు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను సంబోధిస్తూ పదవ అధ్యాయంలో ఇలా అంటాడు:

స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥

— భగవద్గీత 10.15

“ఓ పురుషోత్తమా! నిన్ను నీవే తెలుసుకోగలవు.” దీని అర్థం ఏమిటి? — నీవు మమ్మల్ని ఉద్ధరించడానికి సగుణంలోకి వచ్చావు; నువ్వు సగుణంలో ఉన్నావు. కానీ ఆ నిర్గుణంలోకి వెళ్ళాలనుకుంటే నీవే వెళ్ళగలవు; మరెవరూ కాదు. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో (stage‌లో) ఉన్నావు? “భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతే” — భూతాలను సృష్టించినవాడు, భూతాలకు ప్రభువు, దేవతలకు దేవుడు, జగత్తుకు పతి. అటువంటి నిన్ను నీవే తెలుసుకోగలవు అంటే — అలాంటివాడు ఎవరై ఉంటాడో అదే గురువు. గురుతత్త్వం అంత లోతైనది.

గురుః సాక్షాత్ పరబ్రహ్మ ।

అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే — దీనిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మన పరమ గురుదేవులు శ్రీ శివానంద పరమహంస గారు “మనస్సే గురువు” అన్నారు; (బయట) ఎవరూ లేరు — మనస్సే గురువు అని ఇక్కడ చెప్పారు. అది ఏ స్థాయిలో చెప్పారు? (అది అర్థం చేసుకోకుండా) — అది లేకుండా ఇవన్నీ అనేక రకాలుగా (తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు).

తల వంచాలి — లోపలి గురువుకు

మనిషి ఆధ్యాత్మిక పురోగతికి వెళ్ళాలనుకుంటే తల వంచాలి. ప్రతి ఒక్కరూ తల దించాలి. ఎవరికి దించాలి? నీ లోపల ఉండే గురువుకే నువ్వు తల వంచు. లోపల ఉండే గురువుకే — ఎవరికో కాదు.

“తల వంచితే నా ప్రెస్టేజ్ తగ్గిపోతుందేమో” — ఏమీ కాదు! ఆయన సంతోషిస్తాడు. గురువు చాలా సంతోషిస్తాడు — “ఆహా! వీడికి ఈ జన్మలోనే (గమ్యం) దగ్గర పడింది; వీడికి ఇంకేమీ అక్కరలేదు” అని గురువులు సంతోషిస్తారు. గురువుకు ఏమీ అక్కరలేదు — కానీ అన్నీ కావాలి. అన్నీ తెస్తే ఆయన సంతోషిస్తాడు — కానీ ఏమీ అక్కరలేదు.

శరీరమర్థం ప్రాణం చ సద్గురుభ్యో నివేదయేత్ ।

శరీరం, ధనం, ప్రాణం — ఇవన్నీ గురువుకు నివేదించమని (చెప్పారు). ఇవన్నీ ప్రాక్టికల్‌గా (ఆచరణలో) జరిగేవేనండీ.

నేను ఈ మధ్య అనారోగ్యంగా (sick‌గా) ఉన్న సమయంలో, సర్వకాల సర్వావస్థలలో గురువుగారిని స్మరించాను; వారు అలా రక్షించారు. బయటివారికి తెలియదు; అప్పుడు ఉన్న డాక్టర్‌కు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితిలోకి వచ్చానో — ఆయనకు తెలుసు. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు — నేను శరీరాన్ని విడిచిపెట్టి, దూరంగా గురువు పాదాల దగ్గర ఉన్నాను. అది మీరు చూశారు. అసంకల్పితంగా (involuntary‌గా) కూడా గురుస్మరణతో ఉండాలి — అది ఆయన చూశారు.

ఇదంతా కొత్తగా ఒక్క రోజులో వచ్చేది కాదండీ. చిరకాలం గురువును నమ్ముకుని సేవ చేస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది — “ఓహో! గురువు అంటే ఇదా!” అని. శరీరాన్ని చూడవద్దు; శరీరాన్ని చూడవద్దు.

నరవద్దృశ్యతే సాక్షాత్ శ్రీగురుః పాపకర్మణామ్ ।
శివవద్దృశ్యతే సాక్షాత్ శ్రీగురుః పుణ్యకర్మణామ్ ॥

గురువును నరుడిగా చూసేవాళ్ళందరూ పాపకర్ములు. నువ్వు సాధన చేస్తూ ఉంటే — ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు శివుడే! సాక్షాత్తు శివుడే — అనేది ఎప్పుడూ (గుర్తుండాలి).

గురు పాదుకలు — ప్రాణాపానాలు

నువ్వు అన్నం తిన్నా, ఇక్కడ దండం పెట్టినా — గురు పాదాలు కనబడాలి. ప్రతిసారీ దండం పెట్టినప్పుడు గురు పాదాలు కనబడాలి. ప్రతిదానిలో కూడా ఆ గురుస్మరణే ఉండాలి; నీకు ఇంకొకటి లేదు. నిన్ను నీవు మరచిపోవాలంటే గురువును పట్టుకోవాలి. గురువును పట్టుకోకపోతే అన్నీ “నువ్వే” (అహంకారమే). మాయ అక్కడే ఉంది.

మాయను దాటడం — సంసార బాధలన్నీ ఎందుకు వచ్చాయి? సంసార బాధకు కారణం — ఏకాగ్రత లోపం (lack of concentration). ఇక్కడ రెండు పాదుకలు ఉన్నాయి. అవి ఏమిటంటే — మనకు ప్రాణాపానాలు అక్కడి నుంచే వస్తాయి.

ప్రాణక్షయసమీపస్థమపానోదయకోటిగమ్ ।

— అన్నపూర్ణోపనిషత్తు 5.30

అని అన్నపూర్ణోపనిషత్తు చెప్తోంది. అంటే — ఈ ప్రాణం ఎక్కడైతే క్షయమవుతుందో (అంతమవుతుందో), దాని సమీపంలోనే అపానం ఉదయిస్తుందట. అదే గురుపాదుక; ఆత్మస్థానం.

నువ్వు ఏం చేసినా మనస్సు ఆ పాదం దగ్గర ఉండాలి. మనస్సు అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? శ్వాస అక్కడ ఉండాలి. శ్వాస అక్కడ ఉండాలంటే సాధనతోనే ఉండాలి. ఊరికే స్మరిస్తే సరిపోదు.

ప్రయత్నం లేనిదే ఫలితం లేదు

కొన్ని సందర్భాలలో కొంతమంది — ఒక దీనావస్థలో, ఏదీ చేతకాకపోతే — “అన్నీ దేవుడే, గురువే” అనుకుని ఏ పనీ చేయరు, ఏ ప్రయత్నమూ చేయరు. ప్రయత్నం చేయకుండా — “అంతా నాకు గురువుగారు ఇవ్వాలి; లేకపోతే అంతా వారే చేయాలి; నేను బాగా సాధన చేసినట్టు అనుగ్రహించండి” అంటారు. గురువు అనుగ్రహించవలసింది సాధనను. సాధన చేయాలంటే ఎవరు చేయాలి? నేనా? గురువా? లేక ఇంకెవరైనానా?

కష్టం లేనిదే ఫలితం లేదు. కానీ చాలామంది కష్టం లేకుండా ఫలితాన్ని సంపాదించాలనే సూత్రాలు కనిపెట్టారు — గురువును కాకా పట్టడం, గురువును పొగడడం — అది, ఇది. అదేమీ పనిచేయదు (Nothing doing)! సాధన చెయ్యి!

నువ్వు దేనికి పుట్టావు? వీటన్నిటికీ కాదు. నీ జీవితాన్ని వృథా చేయకు (Don’t waste your life). ఈ శరీరాన్ని, ఈ జన్మను వృథా చేయవద్దు. మధ్యమధ్యలో ఈ ఉత్సవాలు (functions) ఎందుకు వస్తాయి? గుర్తుచేస్తుంటాయి — “అయ్యో, వృథా చేసుకున్నామే! అరే, ఇప్పుడైనా సరే పరిష్కరించుకోవాలి; ఇప్పుడైనా సరే పట్టుకోవాలి” అని. ఎందుకంటే ఏ క్షణం ఎలా ఉంటుందో, శరీరం ఎలా ఉంటుందో చెప్పలేం. ఏమైతే అది అవుతుంది — గురువు పాదాలు పట్టుకో! అదేనండీ నీకు శక్తినిస్తుంది, నీకు శక్తినిస్తుంది.

ఇదంతా — శరీరానికి సంబంధించినవన్నీ — తుచ్ఛమైనవి; వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నడిపించేది ఎవరు? నిన్ను కాపాడేది ఎవరు? అంతా గురువే. ఆ గురువు యొక్క ఉనికి నీకే తెలుస్తుంది.

నేను కొద్దిగా — అసలు పూజకు కూర్చోలేని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఇలా (మీ ముందు కూర్చుని మాట్లాడగలుగుతున్నాను) — ఇది గురుశక్తి! గురుశక్తి! మీ అందరికీ గురువుగారు చూపిస్తున్నారు. గురువును నమ్ముకుంటే ఎక్కడా లేని శక్తి వస్తుంది.

కిందకు భిన్నత్వం, పైకి ఏకత్వం

ఈ విధంగా — కిందకు ఉంటే భిన్నభిన్నంగా ఉంటుంది; అదే ప్రకృతి. పైకి వెళితే భిన్నత్వం కాకుండా ఏకత్వం; అది బ్రహ్మం. ఈ కిందది ప్రకృతి, మాయ. “మాయ, మాయ” అనుకుంటూ కూర్చోవడం కాదు — మనం పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.

పైకి వెళ్ళడానికి ప్రయత్నం ఎవరు చేయాలి? నీ ప్రయత్నం ముందు నీదే. నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటుంది. ప్రయత్నం చేయకుండా అనుగ్రహం కావాలనేవాడు దొంగ. ప్రయత్నం చేయనివాడిని ఏ గురువూ అనుగ్రహించడు. అందుకే చెప్పారు:

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ॥

— భగవద్గీత 9.29

“నేను అన్ని జీవులయందు సమానంగానే ఉన్నాను; కానీ నన్ను భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో వారియందే నేను ఉంటాను.” అన్ని చోట్లా ఉన్నప్పుడు ఏమిటి? అన్ని చోట్లా ఉండేది సాక్షీభూతంగా. కానీ సాధకుని దగ్గర మాత్రం ఆయన ఎప్పుడూ సిద్ధంగా (ready‌గా) ఉంటాడు. నీ కుడి శ్వాసలోనే కూర్చుంటాడు; ఆయన కుడి శ్వాసను ఎప్పుడూ మరచిపోడు. నువ్వు సాధన బాగా చేస్తుంటే, కుడి పక్కన (శ్వాస) నడిచిందంటే — గురువు ఉన్నారని (గుర్తు).

మనం భగవత్ స్వరూపులమై ఉండి కూడా ఈ బాధలు కలగడానికి, వేరువేరు సంసారాలు అన్ని రకాలుగా కలగడానికి కారణం ఏమిటంటే — నీ శ్వాసను నువ్వు కిందకు వదిలిపెడితే సృష్టి; పైకి వెళితే అది లయం. నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే శివుడు, ఈశ్వరుడివి నువ్వే, సాక్షాత్ పరబ్రహ్మవు — ఎప్పుడు? నువ్వు ఎంత పైకి వెళ్తే అంత. నువ్వు కిందకు ఎంత దిగితే — ఏదీ నువ్వు కాదు, ఏదీ నువ్వు కాదు. కనీసం తిర్యగ్జాతులలో ఉండే జీవుడిలోకి వెళ్ళిపోతాం. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి.

అఖండ ప్రాణాయామం — అశ్రద్ధ చేయకండి

అందువల్ల — అఖండ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు అశ్రద్ధ చేయకండి. మీకు చెప్పాలనిపిస్తోందండీ — అశ్రద్ధ చేయకండి. మీకు తెలుసు; రుచి చూసి కూడా మాయలో పడిపోతున్నారు. వారానికి ఒక్క రోజు ఇక్కడికి వచ్చి చేసుకుంటే మీకేమో అది (చిన్నతనంగా) అయిపోతుంది, ప్రెస్టేజ్ తక్కువ అనిపిస్తుంది.

ఇక్కడికి వచ్చి చేస్తే — ఇక్కడ జరిగే సాధన ఇంకెక్కడా జరగదు; మీ ఇళ్ళలో జరగదు. జరిగినట్టు ఉన్నా సరే దాని ఫలితం ఉండదు. అర్థమైందా? అలాంటప్పుడు గురువుగారి సమాధి కిటకిటలాడాలి — “అయ్యో, నాకు కూర్చోడానికి స్థలం లేదే!” అనేటట్టుగా ఉండాలి.

అది లేకుండా — ఈ మాయ గురించి ఎన్నాళ్ళు చెప్పడం? ఈ మాయను ఎన్నాళ్ళు చెప్పి పొడుస్తూ ఉండాలి? నేను కూడా దర్జాగా — ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది — పడుకోవచ్చు. కానీ రాత్రి రాత్రి ఎందుకు కూర్చోవలసి వచ్చింది? నిన్న సాయంకాలం ఎందుకు కూర్చోవలసి వచ్చింది? నా బాధ్యత నాకు ఉంది. పదిమంది అనేక ప్రాంతాల నుంచి వచ్చారు; వారికి గురువాణి వినిపించాలి. వినిపించాలి — ప్రపంచానికి తెలియాలి. కొన్ని రహస్యాలు వస్తుంటాయి; అవన్నీ తెలియజేయాలనే — నాకు ఏదైనా ఉత్సవం (function) వచ్చిందంటే రాత్రిపూట నిద్రపట్టదు. కారణం ఏమిటి? లోపలి నుంచి గురువుగారు చేయిస్తుంటారు.

రాబోయే 41 రోజుల అఖండ ప్రాణాయామం

ఈ పూటకు ఇది సరిపోతుంది. ఇక మళ్ళీ అఖండ ప్రాణాయామం — ఇప్పటికైనా బుద్ధి వచ్చి (సద్వినియోగం చేసుకోండి). ఎక్కువ రోజులు ఉంది — 41 రోజులు: అక్టోబర్ 15 నుంచి నవంబర్ 24 వరకు. నవంబర్ 24 శ్రీ శివానంద పరమహంస స్వామి వారిది. కాబట్టి 41 రోజులు — అక్టోబర్ 15 నుంచి.

ఈ రోజు సెప్టెంబర్ 4; అక్టోబర్ 15కు మధ్యలో 40 రోజుల వ్యవధి ఉంది. ఈ 40 రోజుల వ్యవధి తరువాత ఆ 40 రోజులు వస్తాయి. ఆ రోజులన్నీ మీరు సద్వినియోగం చేసుకోండి.

మీకు ఎందుకు చెప్తున్నానంటే — మీ కాలమంతా ఎల్లవేళలా ఒకేలా ఉండదు; ఒకేలా ఉండదు. ఏ క్షణానికి ఎవరిని ఆ మాయ ఎలా కప్పేస్తుందో, ఎలా దూరం చేస్తుందో తెలియదు. అందువల్ల జాగ్రత్తగా ఉండి సాధనను కొనసాగించుకోండి.

ఓం శ్రీ గురుభ్యో నమః
జై గురుదేవ!
ఓం శ్రీ గురుభ్యో నమః