జ్ఞానసూత్రం

బ్రహ్మము స్వసిద్ధముగా ప్రకాశముగలదై, నాశములేనిదై, షడ్భావ వికారములు లేనిదైనందున ఒకానొకప్పుడు, వృష్టిక్షయాదులు పొందనేరదు.

గనుక పరబ్రహ్మము నుండి వేరుకాని జ్ఞానము నశించుట, వృద్ధినొందుటయనునది ఎన్నడును జరగనేరదు.

అట్లు జరిగినయెడల బ్రహ్మమునుండి వేరుకాని తన ప్రకాశమునకు వృద్ధిక్షయాదులు కలుగవలెనన్న సూర్యునికి వృద్ధిక్షయాదులుండి తీరవలెను.

ఎట్లనగా చంద్రునియందు వృద్ధిక్షయాదులుండుట వలననే తన ప్రకాశముగూడ వృద్ధిక్షయాదులను పొందుట లోకములో అనుభవ సిద్ధముగానున్నది.

మరియు లోకములో షడ్భావ వికారములు లేనందున నది నశించుచున్నవి, నిత్యుడు, శాశ్వతుడు, పురాణుడు, అవ్యయుడు – అని శ్రుతిపలుకుచున్నది.

గనుక తన ప్రకాశమైన జ్ఞానముగూడ, మలినము లేకుండ సర్వదా ప్రకాశించుచునే యుండును.

అందుచే జ్ఞానము అభివృద్ధినొందిన యెడల అజ్ఞానము నశించునని చెప్పుటలో అర్థములేదు.

కాని సూర్యుడు, మేఘముచేత కప్పబడియున్నందున స్వయముగా ప్రకాశించుచున్నను, ఆ ప్రకాశము చక్కగా ఎట్లు కనిపించుటలేదో, ఆలాగుననే ఆత్మయొక్క ప్రకాశము అయిన జ్ఞానము, అజ్ఞానముచేత నావరింపబడినందున బాగుగా ప్రకాశించుట లేదు.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

భగవద్గీత :–

“అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ:”

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

కామ, క్రోధ, లోభములు – ఆత్మ నాశనకారకములు

అజ్ఞానమనగా యథార్థవస్తుగ్రాహ్యము లేకపోవుట. ఇది కామక్రోధాదులచే గలుగుచుండును.

ఈ కామక్రోధాదులు అంత:కరణమునందున్న రజోగుణమునందుద్భవించి మోక్షమునకు శత్రువులుగానున్నవి.

గనుక ఈ శత్రువులను నాశనము చేసినందున సుఖమైన మోక్షముకలుగును.

ఈ లోకములోగూడ మనము శత్రువు లేనియెడల నిర్భయముగా సుఖముగా నుండుట అనుభవసిద్ధము.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మన:”

కామ:క్రోధస్తధాలోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ∥ గీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

కామము,క్రోధము,లోభము ఈ మూడును ఆత్మను నాశనము చేయునట్టివి. అవి నరకప్రాప్తికి హేతువులు గనుక వానిని విడిచి పెట్టవలయును.

నరకమనగా జననమరణాదులచే గలుగు సుఖదు:ఖాదులు.

కనుక మొదట కామము, ఈ కామము వలన క్రోధమును రజోగుణము నుండి యుద్భవించినవి.

ఇది తృప్తిలేనిదియు, పాపమునకు కారణమైనదియు, మోక్షమునకు శత్రువనియు తెలిసికొనవలయును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ: ।

మహాశనో మహాపాప్మా, విద్ధేనమిహ వైరిణం” ∥

“అమృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।

కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేనచ” ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

గనుక జ్ఞానమునే ఆవరించినదై, జ్ఞానులకు సదా శత్రువై, విషయాదులచేత నిండియు నిండనిదై, అగ్నివలె తృప్తినొందనిదై, ఆశారూపమైన ఈ కామమున్ను జయించినందున అమృతత్వమగు మోక్షము సిద్ధించును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

యస్యసర్వేసమారంభా: కామ యస్యహృదిశ్రిత:

అధ మర్త్యోమృతమశ్నుతే ∥

తా ∥ ఎవని సర్వాభిష్టములను సంకల్పకాలమునందే నశించునో ఆ మానవుడు అమృతత్త్వమును పొందును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“తృష్ణ ఏవహి సంసారో తన్నాశో మోక్ష ఉచ్యతే.”

కామ మే సంసారము గనుక దాని నాశనమే మోక్షము.

ఇంద్రియ నిగ్రహము – జ్ఞానమార్గము

గనుక ఇంద్రియములు, మనస్సు, బుద్ధి (అంత:కరణము) ఇవి కామమునకు కారణమైయున్నవి. ఈ ఇంద్రియాదులను ఆశ్రయించి జ్ఞానమును కప్పివైచి జీవిని మోహింపజేయును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే ।

ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ∥ ∥ గీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

గనుక జ్ఞానము బాగుగా ప్రకాశించవలెనన్న దాని యుపాధులైన ఇంద్రియాదులను, ఇంద్రియాదుల వృత్తులకు కారణమైన మనస్సును, అవశ్యముగా నిగ్రహింపవలయును.

మనస్సంకల్పములేనియెడల ఇంద్రియాదులు వాని వాని విషయములందు ప్రవర్తింపజాలవు. ఇంద్రియ వ్యాపారము లేనందున వాసనలుండజాలవు.

వాసనలనగా “దర్శనశ్రవణా ఇతివాసనా:”. శ్రుతి – చూచి విన్న దానిని మనస్సు మరల జ్ఞప్తికి తెచ్చుకొనగలుగును.

ఎన్నడును చూచి, వినని వానిని మరల చింతించలేదు గనుక వాసనలవలన మనస్సును, మనస్సువలన వాసనలును గలుగుచుండును.

మనస్సంకల్పము లేనియెడల వాసనలును గలుగజాలవు. గనుక వాసనాక్షయమే మోక్షమని శ్రుతి పలుకుచున్నది.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“వాసనాపి క్షయో మోక్షస్స జీవన్ముక్తిరేషిష్యతే” (ఆధ్యాత్మోపనిషత్)

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

మరియును ఇంద్రియాదులను నిరోధించినయెడల తనయందున్న ఆత్మను దర్శించగలడు.

“ఇంద్రియాణాం నిరోదేన దేహేపశ్యంతి మానవా :” ∥ ఉత్తరగీత ∥

ఇంద్రియచాపల్యము గలవాడు అవివేకుడని చెప్పబడును. అనగా ఇంద్రియలోలుడు పశువని పిలువబడును.

“ఇంద్రియాణి పశూన్ హత్వా ఆత్మనైవతు తుష్యతి” ∥ శ్రుతి ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

ఒక్క ఇంద్రియమైననూ – జ్ఞాన నాశనము

గనుక పశుబుద్ధిని గలుగజేయుచున్న ఇంద్రియములను అరికట్టినందున ఆనందము కలుగును అని పై శ్రుత్యర్థము.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే ।

తదస్యహరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ∥

యతతో హ్యపికౌంతేయ పురుషస్య విపశ్చిత: ∥

ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభంమన: ∥

నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా ∥

సచాభావయత: శాంతి రశాంతస్యకుత: సుఖమ్ ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

తా ∥ విషయాదులయందు ప్రవేశించుచున్న అవశీకృతమైన ఇంద్రియాదులలో నొక్క ఇంద్రియమునందైనను మనస్సు అనుగమించినయెడల, ఆ ఒక్క ఇంద్రియమే మనస్సు యొక్క వివేకమును సముద్రమందున్న ఏడను గాలీసుకొనిపోయి నాశనము చేయునట్లునే నాశనము చేయును.

మోక్షముకొరకు ప్రయత్నము చేయుచున్న వివేకియొక్క మనస్సును గూడ, ఇంద్రియములు బలాత్కారముగా విషయాలయందు ప్రవేశింపజేయును.

వివేకియొక్క మనస్సు అని చెప్పుటవలన ఇంద్రియనిగ్రహము లేని ఆత్మవిచారణ నిష్ప్రయోజనమని వ్యక్తము.

అందువలన ఇంద్రియాదులను స్వాధీనము చేయనివానికి ఆత్మస్వరూప జ్ఞానము కలుగనేరదు.

ఆత్మధ్యానము చేయనివానికి ఆత్మయందు చిత్తోపరమమును గలుగదు.

చిత్తోపరమము లేనివానికి మోక్షము సిద్ధింపదని పై గీతార్థములు.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“ఇంద్రియాణాంతు సర్వేషు యుద్యేకం క్షరద్రియం

తేనాస్యక్షరతి ప్రజ్ఞాదృతే పాత్రాది షూదకం.” మనుస్మృతి

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

తా ∥ చిల్లుగల కుండయందున్న నీళ్ళు, ఆ కుండకుగల కన్నములు అన్నియు మూయబడి ఒక్కకన్నము మాత్రము శేషించిననూ అందలి నీరంతయు ఏవిధముగా కారిపోయి కుండ మాత్రము శేషించియుండునో అటులనే ఇంద్రియాదులన్నిటిలోనొక్క ఇంద్రియమునైననూ స్వాధీనము చేయక మిగిల్చిన యెడల మనుష్యుని జ్ఞానము పూర్తిగా నశించి అవివేకము మాత్రమే మిగులును.

గనుక మనస్సును, ఇంద్రియాదులను నిగ్రహించుటయే తప్పనియు, దీనికంటే శ్రేష్ఠమైన ధర్మము మరియొకటి లేదనియు వసిష్ఠమహర్షి బోధించియున్నాడు.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

మనసశ్చేంద్రియాణాంచ ఏకాగ్రం పరమంతప:

తజ్ఞాయసర్వధర్మేభ్య: సధర్మ: పరముచ్యతే ∥ మహాభారతం

అద్వైత జ్ఞానము – ఏకత్వ దర్శనము

ఏ యోగి అద్వైతుడై ఎల్లభూతములయందున్న నన్ను పూజించుచున్నాడో అట్టివాడు అనేక ప్రకారములుగా వర్తించువాడైననూ, నా యందే వర్తించుచున్నాడు.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“యస్మిన్ త్సర్వాణి భూతాని ఆత్మవాభూ ద్విధానత: ,

తత్రకోమోహకశ్శోక: ఏకత్వమనుపశ్యత : ∥ ∥ శ్రుతి ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

బ్రహ్మతైక్యజ్ఞానముగల పురుషునకు బ్రహ్మదిస్తంభ పర్యంతముగల భూతములు మిధ్యగాను, ఆత్మయే స్వరూపమాత్రముగను దోచును.

మాయావిలాసముగల అజ్ఞానమును, ఆ యజ్ఞాన సంబంధములగు సుఖదు:ఖములు నుండవు అని యభిప్రాయము. ఈ అద్వైతజ్ఞానమును శ్రీకృష్ణభగవాసుడు అర్జునికి బోధింపగా –

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“యో యం యోగస్త్వయా ప్రోక్తస్సామ్యేన మధుసూదన

ఏతస్య అహం నపశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్.” ∥ గీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“ఓ మధుసూదనా, నీవు బోధించిన సమత్వమనెడి యోగము అనగా సర్వత్ర బ్రహ్మదర్శనమనెడి జ్ఞానము అసాధ్యముగా నున్నది. మనసు నిలుకడలేనిది.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

చంచలంహి మన: కృష్ణ ప్రమాది బలవద్రఢం।

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ∥ ∥ గీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“మనసు మిగుల చంచలమైనదియు, చిక్కులు పెట్టునదియు, స్వాధీనము కానిదియుగదా ! నేనిట్టి మనస్సును నిగ్రహించుట, గాలిని నిగ్రహించుటవలె అసాధ్యముగా దలంచుచున్నాను” అనెను.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్

అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ∥ ∥ గీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

అందులకు శ్రీ కృష్ణభగవానుడిట్లనెను :– అర్జునా, మనసు చంచలమైనదియు, నిగ్రహింపశక్యము కానిదియు అననుటకు సంశయము లేదు. అయిననూ అభ్యాసముచేతను, వైరాగ్యముచేతను మనస్సును స్వాధీనము చేసుకొనవచ్చును.

చిత్తము స్వాధీనము కానివానికి పైన చెప్పిన అభేదదర్శనము అసాధ్యము.

కాన వశీకృతచిత్తముగలవాడు పై యుపాయము వలన ప్రయత్నించి యోగికావచ్చును, అని నాయభిప్రాయము.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

అసంయతాత్మనో యోగో దుష్ప్రాప ఇతిమేమతి:

వశ్యాత్మనాతు యతధా శక్యోవాప్తు ముపాయత: ∥ ∥ గీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

గనుక మనోనిగ్రహము లేనిదే బ్రమ్మాతైక్యశ్రవణమాత్రము చేత బ్రహ్మజ్ఞానము కలుగదని శ్రీకృష్ణభగవానుని అభిప్రాయమైయున్నది.

మరియు, రామునికి వసిష్ఠమహర్షి యనేకవిధములు బ్రహ్మమును గురించి బోధించినను, చిత్తవిశ్రాంతి కలుగనందున, తన భార్యను రావణుడు తీసుకొనిపోయినపుడు దు:ఖించెనను విషయము ఆధ్యాత్మ రామాయణమందు గలదు.

మనోనిగ్రహము మోక్షమునకు అవశ్యము

అభ్యాసమునగా – “తత:స్థితో యత్నో అభ్యాస:” । (పతంజలి యోగసూత్రములు)

తా ∥ సర్వవృత్తులయందును మనస్సు నిశ్చలముగా నిలుచుటకొరకు చేయబడు ప్రయత్నము అభ్యాసమనబడును.

“యోగశ్చిత్తవృత్తి నిరోధ: తధాద్రష్టుస్వరూపావస్థాన” – చిత్తవృత్తులు యోగముచే నిరోధింపబడును.

పిదప ద్రష్టయగు ప్రత్యగాత్మకు పరమాత్మయందు నిశ్చలమగు స్థితి కలుగును. అని పతంజలి యోగసూత్రములందు చెప్పబడియున్నది.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

ప్రాణాయామము – జ్ఞానమార్గము

“యోపాన ప్రాణయోరైక్యం జీవాత్మపరమాత్మనో:” । ∥ శ్రుతి ∥

“ప్రాణాపాన నిశ్చయబుద్ధ్యాహృదిరుద్ధాచ్ఛిత్వా ।

సర్వంసంశయబంధం విషయోత్థాన్ ” ∥ ∥ బ్రహ్మగీత ∥

తా ∥ ప్రాణాపాన ఐక్యములచేత నిశ్చయబుద్ధి (జ్ఞానము) కలుగును. అది భేదించినందున సంశయ బంధములను, విషయాదులును కలుగును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యంతర చారిణౌ ∥

యతేంద్రియ మనోబుద్ధిర్ముని ర్మోక్షపరాయణ: ∥

విగతేచ్ఛా భయక్రోధోయస్సదాముక్త ఏవస: ∥

తా ∥ ప్రాణాసాన వాయువులను సమానముగాచేసి, ముక్కునందు సంచరింపజేసి, ఇంద్రియములు, బుద్ధి, మనస్సు వీనిని నిరోధించి, ఇచ్ఛా, భయ, క్రోధములను విడిచిపెట్టి మోక్షమునందే శ్రద్ధ గలవాడు ముని (మననశీలుడు) అట్టివాడు జీవించి యున్ననూ ముక్తుడే యగును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“చంద్రసూర్యే సమౌకృత్వా తయోద్యోగ: ప్రవర్తతే ।

గుణక్రియమతీతం స్యాత్ గ్రంధిత్రయ విభేదనాత్ ∥

శివశక్తి సమాయోగే జాయతే పరమాస్థి: ∥

క్షేత్రజ్ఞ: పరమాత్మాచ తయోరైక్యం యధాభవేత్ ∥ ∥ శ్రుతి ∥

ఆహారము – మనస్సు – గుణములు

ప్రాణచలన నిరోధముకొరకు, గురురుయుక్తిచేత ఉపదేశింపబడిన ప్రాణాయామము, శుచియు, మితమునగు ఆహారము, ఆసనము – వీనిని అభ్యసింపవలెను.

ఆహారములు సాత్విక, రాజసిక, తామసికములు అని త్రివిధములు – వానిననుసరించిన గుణములు వానివలన గలుగును.

ఏలాగుననగా కొన్ని ఆహారములు మనస్సునకు ప్రశాంతమును కలుగజేయును.

మనము భుజించు ఆహారము స్థూల, మధ్య, సూక్ష్మములుగా పరిణమించును – స్థూలము మలముగాను, మధ్యమాంశము దేహమందు మాంసముగాను, పరిణమించి సూక్ష్మాంశము మనస్సుకు శాంతినిగాని, అశాంతిని గాని కలిగించును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

(1) కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ణరూక్ష విదామిన: ।

ఆహారా రాజసనేష్టా దు:ఖ వోక మయప్రదా: ∥

రజోగుణ సంబంధములగు చేదు, చింతపండు, ఉప్పు, వేడిపదార్థములు, కారము – ఇవి రజోగుణమును కలుగజేయును.

చల్లబడి నిలువయైనదది యు, అపవిత్రమైనదియు, దుర్గంధము గలదియు, ఎంగిలి చేయబడినదియు, అపవిత్రమైనది నగు ఆహారము తమోగుణ సంబంధమైనది.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

(2) గర్వం క్రోధ మహంకారస్స్త్రీసంగ: ప్రలాపన్ ।

అప్రియం దంభమాత్సర్యం రాజసం గుణలక్షణం ∥

అజ్ఞానం మోహనిద్రాచ చాపల్యం బుద్ధిహీనతా ।

పాపిష్ఠం పరపీడత్వం తామసం గుణలక్షణం ∥

(3) సత్యం జ్ఞానం తపోమౌనం ధృతిర్ధర్మం తీక్షచ ।

ఉత్సాహం నిశ్చలం ధైర్యం సాత్వికం గుణలక్షణం ∥ ∥ గీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

రజోగుణ సంబంధములగు ఆహారమువలన, గర్వము, క్రోధము, అహంకారము, స్త్రీలయందనురాగము, అప్రియము, దంభము, మాత్సర్యమును గలుగును.

తమోగుణప్రధానమగు ఆహారమువలన, అజ్ఞానము, మోహము, నిద్ర, చపలత, బుద్ధిహీనత, పాపకార్యప్రేరేపణ, పరపీడన ఇత్యాదిగునములు గలుగును.

మితముగా భుజించవలెను. ఇతరములగు ఆహారములవలన జ్ఞానము కలుగనేరదు.

మరియు పై శ్లోకములో 3 వదానిని బట్టి, సత్యము, జ్ఞానము, తపస్సు, మౌనము, ధృతి, ధర్మము, తీక్ష, ఉత్సాహము, నిశ్చలత్వము, ధైర్యముకలుగజేయు ఆహారములను అనగా రసయుతములు, నేతితోకూడినవి, ప్రియములైనవియు, ఆయువు, బలము, సత్త్వము, ఆరోగ్యము మున్నగువానిని వృద్ధిజేయునవియు నగు గోధుమ, ఆవుపాలు, శర్కర, నెయ్యి కొన్ని విధములైన పండ్లు మాత్రము మితముగా భుజింపవలెను.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

ప్రాణాయామ దృఢాభ్యాసైర్యుక్త్యాచ గురుదత్తయా ।

ఆసనాశనయోగేన ప్రాణస్పందో నిరుధ్యతే ∥ వసిష్ఠరామాయణం

మనస్సు – చిత్తము – బుద్ధి

పైవిధముగా నభ్యసించినయెడల ఇంద్రియాదులచేత గలుగు దోషములనుండి నివర్తింపబడి (అజ్ఞానావరణము నుండి ముక్తుడై) స్వస్వరూపమును తెలిసికొనగలుగును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

యధా పర్వతధాతూనాం దహ్యంతే దహనాన్మలా: ।

తధేంద్రియకృతా దోషా దహ్యంతే ప్రాణనిగ్రహాత్ ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

అని వసిష్ఠవాక్యము:– “తత:క్షీయతే ప్రకాశావరణం” – పతంజలియోగసూత్రము – “ఇంద్రియైర్బధ్యతే జీవ ఆత్మైవచబధ్యతే” – శ్రుతి ∥

తా:– ఏ ప్రకారము పర్వతములయందుండు రజతాది ధాతువులయొక్క సారాంశము అగ్నిచే దహించబడునో ఆ ప్రకారముగా ఇంద్రియాదుల దోషములను నశింపజేయును.

అప్పుడు అజ్ఞానావరణము నశించి జ్ఞానము చక్కగా ప్రకాశించును.

ఇంద్రియాదులచే బాధింపబడునప్పుడు జీవుడనియు, అట్లుకాని స్థితిపరమాత్మయునగుచున్నది.

హంససరూపుడగు జీవునికి పరమాత్మకును పరస్పర సంబంధము గలదు. ఈ సంబంధము సూర్యునికి తన కిరణమునకును, మరియు అగ్నికి దాని ప్రకాశమునకును గల సంబంధము వంటిదే.

యోగముచే చిత్తవృత్తులు నిరోధింపబడి అజ్ఞానావరణము తొలగి హంససరూపుడైన జీవుడు కామము నుండి నివృత్తుడగుటచే బ్రహ్మమగును.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

శ్లో ∥ ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ ।

యోగేన గతకామానాం భావనా బ్రహ్మచక్షతే ∥ – ఉత్తరగీత ∥

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

మనస్సు, చిత్తము, బుద్ధి – ఇవి వేరువేరుకావు. మనస్సనగా మననము. చిత్తమనగా చింతనము. బుద్ధియనగా నిశ్చలత.

మనస్సు సంకల్పించనిదే చింతుచుటకు వీలుకాదు. చింతనచేత నిశ్చయించుట జరుగును.

ఇవి మూడును వేరువేరు అయిన యెడల ఒకే సమయమునందు పై మూడు వృత్తులు జరుగవలయును గాని అట్లు జరుగుట లేదు.

మనస్సు ఒకదానిని సంకల్పించిన పిదప, ఆ మనస్సే సంకల్పించిన విషయమును గురించి చింతించుచున్నది. పిదప నిశ్చయించుచున్నది.

గనుక ఇవి యన్నియు ఒక మనోవృత్తిలేగాని వేరువేరు కాదు.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

కామసంకల్పోవిచికిత్సా శ్రద్ధా అశ్రద్ధా ధృతిరధృతి:

హ్రీర్ధీర్భి రిత్యేతత్సర్వం మన ఏవ ∥ ∥ శ్రుతి ∥

(బృహదారణ్యకోపనిషత్)

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

తా ∥ కామము, సంకల్పము, విచారణ, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, బుద్ధి, భయము – ఇవన్నియు మనస్సే.

మనస్సు యొక్క చలనము లేని స్థితియే బుద్ధియని చెప్పబడును.

ఏలయనగా మనస్సుకు చలనము లేనందున, బయటకు ప్రకాశించుచున్న చిత్రప్రభయొక్క ప్రకాశము నిశ్చలమై యథార్థజ్ఞానము కలుగును.

చిత్రప్రభ ప్రాణవాయువుచే చలించినందున మనస్సనియు, చలనము లేనందున బుద్ధియనియు చెప్పబడుచున్నది.

అందువలననే చిత్తైకాగ్రతవలన జ్ఞానము కలుగునని ముక్తికోపనిషత్తునందు చెప్పబడియున్నది.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

శ్రుతి:– “సాహిసర్వగతాసంవిత్ ప్రాణస్పందేన చాల్యతే, చిత్తైకాగ్రస్తధా

జ్ఞానం యుక్తం సముపజాయతే”

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

అట్టి ఏకాగ్రత గల మనస్సుచేత బ్రహ్మము తెలియబడునని కఠోపనిషత్తునందు చెప్పబడియున్నది.

“మనసై వేద మాప్తవ్యం.”

“సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియం”

తా ∥ బ్రహ్మమునందు ఏ సుఖముగలదో దానిని బుద్ధిచే గ్రహింపనగును గాని ఇంద్రియాదులచే గ్రహింప సాధ్యము కాదు.

మనస్సు – సృష్టికారణము

ఏకాగ్రత లేని మనస్సు బహిర్ముఖమైనందున సంసార హేతువైనది.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“మన ఏవహి సంసారో తన్నాశో మోక్ష ఉచ్యతే”

“మన ఏవమనుష్యాణాం కారణం బంధమోక్షయో:!”

“ఉపాయ ఏక ఏవాస్తి మనసన్వస్యనిగ్రహే.”

“సహస్రాంకుర శాఖాత్మా ఫలపల్లవశాలిన:” ।

అస్యసంసార వృక్షస్య మనోమూల మిదంస్థిర:” (ముక్తికోపనిషత్)

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

“రూపం నామంచజాతించ కల్పయిత్వా స్వవక్తిత: । బ్రహ్మజ్ఞ ముపివాచిత్తం సంసార యతిపూరుషం,”

అని శంకరవాక్యం. మనస్సు తన స్వశక్తిచేత నామరూపాది జగత్తును, పవుపక్ష్యాది జాతులను కలుగజేసి బ్రహ్మవేత్తనైననూ సంసారము పెంచునట్లు చేయును.

కాబట్టి సృష్ట్యాదులకు కారణం మనస్సేగాని బ్రహ్మ, విష్ణువులుకారు. మనస్సే విష్ణువని చెప్పబడును.

‘మనోహివిష్ణు:’

గనుక మనపై విష్ణువునుండి అహంకారమైన బ్రహ్మముద్భవించి లోకమును సృష్టించుచున్నది.

మరియు మనస్సు చంద్రుడు – అదియే జలముగనుక చంద్రుడు, జలము అయిన విష్ణువునుండి అహంకార మగు బ్రహ్మయు, అందునుండి భూమియు నుద్భవించినవి.

ఇందుచేతనే జలమునుండి భూమి యుద్భవించెనని కారణము.

పాలమీగడ పాలకు పైభాగమున నున్నట్లు, నీటి మీగడయైన భూమి నీటికి పైభాగమున నున్నది.

కాబట్టి జగత్తునకు కారణమగు మనస్సు నశించిన యెడల జగత్తుగూడ నశించవలెను.

⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹ ⊹

ఓం తత్ సత్

— ఇతి జ్ఞానసూత్రం సంపూర్ణమ్ —